Sleep: మీకు కూడా నిద్రలో ఛాతిపై దెయ్యం కూర్చున్నట్లు అనిపించిందా.? అస‌లు నిజం ఏంటో తెలుసా?

Published : Jun 02, 2026, 03:08 PM IST

Sleep: చాలా మందికి ఒక్కసారైనా ఈ విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొంటారు. నిద్రలో చేతులు, కాళ్లు కదలవు, మాట బ‌య‌ట‌కు రాదు కొందరికి ఛాతిపై ఏదో బరువైన వస్తువు ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో ఇది దెయ్యం ప‌ని అనుకుంటారు. కానీ దీనికి కార‌ణం స్లీప్ ప్యారాలిసిస్. 

PREV
17
స్లీప్ ప్యారాలిసిస్ అంటే ఏమిటి?

ఈ పరిస్థితిని వైద్య భాషలో స్లీప్ ప్యారాలిసిస్ (Sleep Paralysis) అంటారు. ఇది నిద్ర నుంచి మేల్కొనే సమయంలో లేదా నిద్రలోకి వెళ్లే సమయంలో సంభవించే తాత్కాలిక పరిస్థితి. ఈ సమయంలో మెదడు మెలకువలోకి వచ్చినా శరీరం మాత్రం ఇంకా నిద్ర స్థితిలోనే ఉంటుంది. అందువల్ల కొన్ని సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు వ్యక్తి కదలలేడు, మాట్లాడలేడు. సాధారణంగా ఇది ప్రమాదకరమైన వ్యాధి కాదు. అయితే అనుభవిస్తున్న వ్యక్తికి మాత్రం చాలా భయాన్ని కలిగిస్తుంది.

27
ఛాతిపై ఎవరో కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది?

స్లీప్ ప్యారాలిసిస్ సమయంలో చాలామందికి ఛాతిపై బరువు ఉన్నట్లు అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం శ్వాసలో వచ్చే స్వల్ప మార్పులు. నిద్రలో శరీరం విశ్రాంతి స్థితిలో ఉండటంతో శ్వాస నెమ్మదిగా సాగుతుంది. అయితే మెలకువ వచ్చిన తర్వాత కూడా శరీరం పూర్తిగా స్పందించకపోవడం వల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోతున్నామనే భావన కలుగుతుంది. దీంతో మెదడు భయాందోళనకు గురై, గదిలో ఎవరో ఉన్నట్లు లేదా ఛాతిపై ఏదో ఒత్తిడి చేస్తున్నట్లు ఊహాత్మక అనుభూతులను సృష్టిస్తుంది. దీనిని "హాల్యూసినేషన్" అని పిలుస్తారు. ఇది నిజంగా జరుగుతున్నది కాదు. మెదడు సృష్టించే తాత్కాలిక భావన మాత్రమే.

37
ఈ సమస్యకు ప్రధాన కారణాలు ఏమిటి?

స్లీప్ ప్యారాలిసిస్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. సరైన నిద్ర లేకపోవడం, రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండటం, అధిక ఒత్తిడి, ఆందోళన, పని భారం ఎక్కువగా ఉండటం, నిద్ర సమయాల్లో తరచూ మార్పులు రావడం,

వెన్నుపైన పడుకుని నిద్రించడం, కొన్ని నిద్ర రుగ్మతలు వంటివి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్పొచ్చు. ప్రత్యేకంగా నార్కోలెప్సీ (Narcolepsy) అనే నిద్ర సంబంధిత రుగ్మత ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే స్లీప్ ప్యారాలిసిస్ వచ్చిన ప్రతి ఒక్కరికీ నార్కోలెప్సీ ఉందని అర్థం కాదు. చాలామందికి కేవలం నిద్రలేమి లేదా ఒత్తిడి వల్ల కూడా ఈ పరిస్థితి ఎదురవుతుంది.

47
స్లీప్ ప్యారాలిసిస్ సమయంలో ఏమి చేయాలి?

ఈ పరిస్థితి ఎదురైనప్పుడు భయపడకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే భయం పెరిగితే అనుభవం మరింత తీవ్రంగా అనిపిస్తుంది. ఆ సమయంలో ఇది తాత్కాలిక పరిస్థితి అని గుర్తుంచుకోండి. శ్వాసపై దృష్టి పెట్టండి. చేతి వేళ్లు లేదా కాలి వేళ్లను కదిలించే ప్రయత్నం చేయండి. భ‌య‌ప‌డ‌కుండా ప్రశాంతంగా ఉండండి. కొన్ని సెకన్లు లేదా నిమిషాల్లోనే పరిస్థితి సాధారణంగా మారిపోతుంది. చాలా సందర్భాల్లో ఎలాంటి వైద్య చికిత్స అవసరం ఉండదు.

57
ఈ సమస్యను నివారించాలంటే ఏమి చేయాలి?

స్లీప్ ప్యారాలిసిస్‌ను పూర్తిగా నివారించడం ఎల్లప్పుడూ సాధ్యం కాకపోయినా, కొన్ని అలవాట్లు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. నిద్ర సమయాన్ని ప్రతిరోజూ ఒకేలా ఉంచడం మంచిది. ఒత్తిడిని త‌గ్గించుకోండి, ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాలు మానసిక ప్రశాంతతను పెంచుతాయి. మొబైల్ వినియోగాన్ని తగ్గించండి. నిద్రకు గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వంటి స్క్రీన్‌లను దూరంగా ఉంచడం మంచిది.

67
నిద్ర వాతావరణాన్ని మెరుగుపరచండి

గది ప్రశాంతంగా, చల్లగా ఉండేలా చూసుకోవాలి. లావెండర్ వంటి సువాసనల ఎసెన్షియల్ ఆయిల్స్ కొందరిలో నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. శారీరక విశ్రాంతి అవసరం, రోజంతా శరీరానికి, మెదడుకు తగిన విశ్రాంతి లభించేలా చూసుకోవాలి.

77
గుర్తుంచుకోవాల్సిన విషయం

నిద్రలో కదలలేకపోవడం, మాట్లాడలేకపోవడం, ఛాతిపై ఎవరో కూర్చున్నట్లు అనిపించడం వంటి అనుభవాలు చాలా భయానకంగా ఉంటాయి. కానీ ఇవి దెయ్యాలు, ఆత్మలు లేదా ఇతర అతీంద్రియ శక్తులతో సంబంధం ఉన్నవి కావు. చాలా సందర్భాల్లో ఇవి స్లీప్ ప్యారాలిసిస్ అనే సాధారణ నిద్ర సంబంధిత పరిస్థితి వల్లే సంభవిస్తాయి. తరచూ ఈ సమస్య ఎదురవుతుంటే లేదా నిద్ర నాణ్యత తీవ్రంగా దెబ్బతింటే మాత్రం నిద్ర నిపుణుడు లేదా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories