
పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి మొదట మీ దినచర్యను పరిశీలించుకోవాలి. ఉదయం నుండి రాత్రి వరకు ఏమి చేస్తారు? ఎంత సేపు పని చేస్తారు? ఎంత సేపు విశ్రాంతి తీసుకుంటారు? అనేది నోట్‌బుక్ లేదా మొబైల్‌లో రాసుకోండి. దాంతో పాటు ఏ సమయంలో ఎక్కువ అలసట వస్తుందో ? ఏ పనులు శరీరానికి, మనస్సుకు ఒత్తిడిగా మారుతున్నాయో గుర్తించవచ్చు. చిన్నమార్పులు కూడా పెద్ద తేడా తీసుకురాగలవు. ఉదాహరణకు గంటలకొద్ది కూర్చునే పని చేస్తే, ప్రతి గంటకోసారి లేచి నడవడం లేదా కాసేపు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవడం వంటివి అలసటను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి.
సమయాన్ని సరిగ్గా వినియోగించుకోకపోవడం కూడా పని ఒత్తిడికి ఒక కారణం. చాలా పనులు ఉన్నట్లుగా అనిపించినా, సరైన ప్రణాళికతో వాటిని సులభంగా నిర్వహించవచ్చు. ముందుగా ఏ పనులు పూర్తి చేయాలో నిర్ణయించుకుని, చేయాల్సిన పనుల జాబితాను రాసుకోవడం వల్ల ఏదీ మర్చిపోకుండా, పనులను సక్రమంగా చేయవచ్చు. ఒకేసారి ఒక పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. మీకు సమయం లేనప్పుడు లేదా ఇప్పటికే చాలా పని ఉన్నప్పుడు, అదనపు బాధ్యతలను తీసుకోవడానికి నిరాకరించడం నేర్చుకోండి. ఇది మీ సమయాన్ని, శక్తిని ఆదా చేస్తుంది.
ఆఫీస్ పని ముగిసిన తర్వాత కూడా ఈమెయిల్స్ చెక్ చేయడం, ఫోన్ కాల్స్ తీసుకోవడం, పని గురించి ఆలోచించడం వల్ల మీ విశ్రాంతి సమయం దెబ్బతింటుంది. ఇది వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే, ఉద్యోగానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన గీతను గీయాలి. ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబంతో, స్నేహితులతో సమయం గడపడం, మీకు ఇష్టమైన పనుల్లో పాల్గొనండి. ఇలా చేస్తే మీ మనసు ఉల్లాసంగా మారుతుంది.
పనికి ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పు లేదు, కానీ వ్యక్తిగత జీవితం, కుటుంబం, స్నేహితులు, వినోదం, వ్యాయామం, విశ్రాంతి కూడా ముఖ్యమే. ఇవన్నీ సమతుల్యంగా ఉండాలి. దేని ప్రాధాన్యత తగ్గినా మిగతావి కూడా ప్రభావితమవుతాయి. ఉదాహరణకు తగిన విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేస్తే శారీరక, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. కాబట్టి, వారాంతాలు లేదా సెలవులు వచ్చినప్పుడు పని పక్కనబెట్టి పూర్తిగా రిలాక్స్ అవ్వండి. ప్రయాణాలు చేయండి, పుస్తకాలు చదవండి, మీకు ఇష్టమైన వాటితో సమయం గడపండి. ఇలాంటివి మిమ్మల్ని తిరిగి ఉత్సాహంగా మార్చుతుంది.
శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఉత్సాహంగా, పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే పోషకాహారం, వ్యాయామం, నిద్ర ఈ మూడింటిపైనా శ్రద్ధ వహించాలి. జంక్ ఫుడ్‌కు బదులు కూరగాయలు, పండ్లు, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. రోజుకు కనీసం 2–3 లీటర్ల నీరు తాగాలి. ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ఇవి మీ శరీరాన్ని చురుకుగా, మనసును ఉల్లాసంగా ఉంచుతుంది. అలాగే 7–8 గంటల నిద్ర శరీరానికి పూర్తిస్థాయి విశ్రాంతినిస్తూ, తదుపరి రోజుకు శక్తిని అందిస్తుంది.
కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా పని ఒత్తిడిని తట్టుకోలేకపోవచ్చు. అలాంటి సమయంలో, మీరు ఒంటరిగా బాధపడాల్సిన అవసరం లేదు. మీ మనస్థితి గురించి సహోద్యోగులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడండి . ఇలా చెప్పుకోవడం వల్ల మనసుకు ఊరట కలుగుతుంది. అవసరమైతే.. కౌన్సెలర్ లేదా మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి. వారు మీకు సరైన మార్గదర్శకత్వం అందించి, ఈ ఒత్తిడి నుండి బయటపడటానికి సహాయం చేస్తారు.