
సబ్జా గింజలు లేదా తులసి గింజలు అనేవి చిన్ననాటి నల్లని గింజలు, ఇవి నువ్వులు లేదా చియా గింజల మాదిరిగా కనిపిస్తాయి. అయితే ఇవి వాటితో పోలిస్తే భిన్నమైనవి. ఈ గింజలు తులసి మొక్క నుండి కాకుండా, స్వీట్ బాసిల్ (Sweet Basil) అనే తీపి తులసి మొక్క నుండి లభిస్తాయి. ఈ గింజలు నీటిలో నానబెట్టినప్పుడు, అవి వెలుపల జెల్ లాంటి పొరను ఏర్పడుతుంది. వాటి అసలు పరిమాణం కంటే చాలా రెట్లు పెద్దవిగా మారతాయి.
సబ్జా గింజలు నీటిని పీల్చుకుని తమ పరిమాణం కంటే సుమారు 30 రెట్లు ఉబ్బుతాయి, వీటి చుట్టు జెల్ లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. వీటిలో కరిగే, కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ప్రత్యేక రుచి లేకపోవడం వల్ల ఏ పానీయం లేదా ఆహారంతోనైనా కలిపి తినవచ్చు.
పోషక విలువలు: ఇందులో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, రాగి, పొటాషియం, విటమిన్ K, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.
సబ్జా గింజలు శరీరంలోని వేడిని తగ్గించడంలో సహాయపడతాయి, కాబట్టి కడుపు లేదా గుండెల్లో మంట (heartburn) వంటి అసిడిటీ లక్షణాలకు తక్షణ ఉపశమనం కలుగుతుంది. నీటిలో నానిన తర్వాత ఏర్పడే జెల్ పొర కడుపు గోడను కప్పి ఆమ్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ప్రేగు కదలికలు మెరుగవుతూ, మలబద్ధకం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ అసిడిటీని నియంత్రించడంలో సహాయపడుతుంది.
వేసవిలో శరీర వేడి ఎక్కువగా అనిపించినప్పుడు, సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగితే శరీరం చల్లబడుతుంది. ఇందులో ఉన్న ఫైబర్ కడుపు నిండిన భావం కలిగించి, ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల అనవసరమైన చిరుతిళ్లు తినడం తగ్గించి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
మలబద్ధకం, కడుపు పుండ్లు, జీర్ణ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఉపయోగకరంగా ఉంటాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఇవి మేలు చేస్తాయి. సబ్జా గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలకు చెక్ పెడుతాయి.
సబ్జా గింజలు సాధారణంగా సురక్షితమైనవైనప్పటికీ, వీటిని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా చిన్న పిల్లలకు నానబెట్టకుండా నేరుగా ఇవి ఇవ్వకూడదు, ఎందుకంటే ఇవి నీటిని పీల్చుకొని ఉబ్బుతాయి కాబట్టి గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, వీటిని పూర్తిగా నానబెట్టి, జెల్ రూపంలో మాత్రమే ఇవ్వాలి.
అలానే, సబ్జా గింజలను అధికంగా తీసుకుంటే కడుపులో ఉబ్బరం, వాయువు, లేదా కడుపునొప్పి వంటి సమస్యలు రావచ్చు. రోజుకు 1–2 టీస్పూన్లు మితంగా తీసుకుంటే సరిపోతుంది. ఇవి నీటిని పీల్చుకునే గుణం కలిగి ఉండటంతో, తినేటప్పుడు తగినంత నీరు తాగడం తప్పనిసరి. లేకపోతే ప్రేగుల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి, సబ్జా గింజల ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నా, వాటిని సరైన విధంగా, మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు.
అసిడిటీ నుండి ఉపశమనం పొందడానికి సబ్జా గింజలను సరైన సమయంలో, సరైన విధంగా తీసుకోవడం ముఖ్యం. గుండెల్లో మంట లేదా కడుపులో మంట వంటి అసిడిటీ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే, 1–2 టీస్పూన్ల నానబెట్టిన సబ్జా గింజలను ఒక గ్లాసు చల్లటి నీటిలో కలిపి తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
కొంతమందిలో భోజనం తర్వాత అసిడిటీ సమస్య వస్తుంది. అలాంటి వారికి భోజనం ప్రారంభించకముందే సుమారు 15–20 నిమిషాల ముందు ఒక టీస్పూన్ నానబెట్టిన సబ్జా గింజలను నీటిలో కలిపి తాగడం మంచిది. ఇది ఆమ్ల ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.
అలాగే, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో సబ్జా గింజలు నీటిలో కలిపి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి, రోజంతా అసిడిటీ సమస్యలు రాకుండా నివారించడంలో సహాయపడుతుంది.