జనాల మధ్య ఉన్నా ఒంటరిగా అనిపించడం ఇప్పుడు చాలామందికి సాధారణమైపోయింది. పని ఒత్తిడి, మారుతున్న జీవన శైలి మనిషిని మెల్లగా ఒంటరిగా మారుస్తున్నాయి. కానీ ఒంటరిగా ఉండటం ఆరోగ్యానికి మంచిదేనా? ఏదైనా సమస్యలకు దారి తీస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
ప్రస్తుత జీవనశైలిలో చాలామంది పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, సామాజిక మార్పుల కారణంగా ఒంటరిగా జీవిస్తున్నారు. కొందరికి ఇది ప్రశాంతతనిస్తే, మరికొందరిలో మానసిక సమస్యలకు దారి తీస్తోంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఒంటరిగా ఉండటం ఆరోగ్యానికి మంచిదా? కాదా? ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
26
మెదడుకు విశ్రాంతి
నిపుణుల ప్రకారం.. కొంత సమయం ఒంటరిగా గడపడం మానసిక ఆరోగ్యానికి అవసరం. రోజంతా మనం మనుషులతో, శబ్ధాలతో, డిజిటల్ స్క్రీన్‌లతో ఉంటాం. కాబట్టి మెదడుకు విశ్రాంతి అవసరం. ఒంటరిగా ఉండే సమయం మెదడుకు రీసెట్ బటన్‌లా పనిచేస్తుంది. ఈ సమయంలో మన ఆలోచనలు స్పష్టంగా మారతాయి, భావోద్వేగాలను అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. అలాగే స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ ఉత్పత్తి స్థాయి తగ్గుతుంది.
36
ఎక్కువ రోజులు ఒంటరిగా ఉంటే?
దీర్ఘకాలం ఇష్టంలేకుండా ఒంటరిగా ఉండటం ఆరోగ్యానికి హానికరం. సామాజిక సంబంధాలు లేకపోవడం వల్ల మనిషి మెల్లగా మానసిక ఒత్తిడికి లోనవుతాడు. కొన్ని అధ్యయనాల ప్రకారం, దీర్ఘకాల ఒంటరితనం డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి, ఆత్మవిశ్వాస లోపం వంటి సమస్యలను పెంచుతుంది. మనిషి ఇతరులతో మాట్లాడటం, భావాలు పంచుకోవటం ద్వారా మెదడులో డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి తగ్గిపోతే మానసిక అలసట పెరుగుతుంది.
శారీరక ఆరోగ్యంపై కూడా ఒంటరితనం ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ కాలం ఒంటరిగా ఉండే వారిలో రక్తపోటు, గుండె జబ్బులు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మానసిక ఒత్తిడి ఎక్కువైతే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇది క్రమంగా శారీరక వ్యాధులకు దారి తీస్తుంది.
56
రెండింటి మధ్య తేడా ముఖ్యం
ఒంటరిగా ఉండటం వేరు. ఒంటరితనం వేరు. ఒంటరిగా ఉండటం అనేది మన ఎంపిక. ఒంటరితనం అనేది బాధ. ఎవరు తమ ఇష్టంతో మనశ్శాంతి కోసం ఒంటరిగా ఉంటారో.. వారికి ఇది మేలు చేస్తుంది. కానీ ఎవరు సమాజం నుంచి దూరమై, మాట్లాడేందుకు ఎవరూ లేని పరిస్థితిలో ఉంటారో.. వారికి అది మానసిక సమస్యగా మారుతుంది.
66
ఆరోగ్యంగా జీవించాలంటే..
నిపుణుల ప్రకారం.. ఆరోగ్యంగా జీవించాలంటే, కొంత సమయం మన కోసం ఒంటరిగా గడపాలి. అదే సమయంలో కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులతో సంబంధాలను కొనసాగించాలి. రోజూ కనీసం ఒక వ్యక్తితో అయినా మన భావాలను పంచుకోవడం మానసిక ఆరోగ్యానికి మంచిది.