రోజువారీ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయ టమాట. ఇది రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. టమాటాలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే మంచిదనుకుంటారు. కానీ ఎక్కువగా తింటే కొన్ని సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు
టమాటాలను కూరలు, చట్నీలు, సూపులు, సలాడ్లు, సాస్‌లు ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుంటాం. టమాటాల్లో విటమిన్ C, విటమిన్ A, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే టమాటాలను అతిగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి టమాటాలు ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
27
గ్యాస్ సమస్యలు
టమాటాల్లో సహజంగా ఆమ్ల గుణం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కడుపులో మంట, ఛాతీలో మంట, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గ్యాస్ట్రిక్ అల్సర్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారు టమాటాలను మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
37
కీళ్ల సమస్యలు
టమాటాల్లో సోలానిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోకి ఎక్కువగా చేరితే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు టమాటాలు ఎక్కువగా తింటే నొప్పులు ఎక్కువైనట్లు అనిపించవచ్చని చెబుతున్నారు.
టమాటాలను అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై కూడా భారం పడే అవకాశం ఉంది. టమాటాల్లో పొటాషియం మోతాదు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇది ఆరోగ్యానికి మంచిదే అయినా, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో అధిక పొటాషియం స్థాయి ప్రమాదకరంగా మారవచ్చు. కిడ్నీలు సరిగ్గా పనిచేయని పరిస్థితుల్లో శరీరంలో పొటాషియం నిల్వ ఉంటే గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది.
57
చర్మ సమస్యలు
సాధారణంగా టమాటాలు చర్మానికి మేలు చేస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో టమాటాల్లో ఉండే హిస్టమిన్ అనే పదార్థం కొందరిలో అలెర్జీ లక్షణాలను ప్రేరేపించవచ్చు. దానివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, చర్మం ఎర్రగా మారడం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంది.
67
పంటి ఎనామిల్
టమాటాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పంటి ఎనామెల్ దెబ్బతినే ప్రమాదం ఉంది. టమాటాల్లోని ఆమ్ల గుణం వల్ల పళ్లపై ఉన్న రక్షణ పొర క్రమంగా బలహీనపడుతుంది. ఫలితంగా చల్లటి లేదా వేడి పదార్థాలు తిన్నప్పుడు పంటి నొప్పి వస్తుంది. ముఖ్యంగా టమాట జ్యూస్, టమాట సాస్‌లను ఎక్కువగా తీసుకునేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
77
ఇతర కూరగాయలతో కలిపి..
నిపుణుల ప్రకారం… టమాటాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ సరైన మోతాదు ముఖ్యం. రోజూ అధిక మోతాదులో టమాటాలను తీసుకోవడం కంటే, మితంగా తీసుకోవడం ఉత్తమం. ఇతర కూరగాయలతో కలిపి టమాటాలను వండుకుని తినడం వల్ల వాటి ఆమ్ల గుణం కొంత తగ్గుతుంది.