మనలో చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే బరువు తగ్గడంలో కొన్ని గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. సరిగ్గా అలాంటివే జనపనార విత్తనాలు. ఇవి తీసుకోవడం ద్వారా త్వరగా బరువు తగ్గవచ్చట. వెయిట్ లాస్ కి ఈ గింజలు ఎలా సాయపడతాయో చూద్దాం.
బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి జనపనార విత్తనాలు మంచి ఆప్షన్. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్.. ఆకలిని తగ్గిస్తాయి. జీవక్రియను మెరుగుపరుస్తాయి. కడుపు నిండిన భావన కలిగిస్తాయి. జనపనార విత్తనాలలోని పోషకాలు, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ చూద్దాం.
25
ఆకలి నియంత్రణకు..
జనపనార విత్తనాల్లో మొక్కల ఆధారిత ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రోటీన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఆకలి అదుపులో ఉంటుంది. వీటిలో ఉండే కరిగే, కరగని ఫైబర్లు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. జీవక్రియను మెరుగుపరచడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.
35
ఎలా తీసుకోవాలి?
జనపనార విత్తనాలను చాలా రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటిని వండాల్సిన అవసరం లేదు. పచ్చిగా లేదా ఆహారంలో కలిపి తినవచ్చు. నానబెట్టిన విత్తనాలను ఉదయం స్మూతీ లేదా జ్యూస్ తో కలిపి తాగవచ్చు. దానివల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఓట్స్, గంజి, సలాడ్ లలో కూడా కలిపి తీసుకోవచ్చు. పెరుగుతో కలిపి తింటే ప్రోబయోటిక్ తో పాటు ప్రోటీన్, ఫైబర్ కూడా లభిస్తాయి.
ఇంట్లో తయారుచేసే రొట్టెలు, కుకీస్ లలో కూడా వీటిని వాడచ్చు. సాయంత్రం స్నాక్ గా తినచ్చు. సూప్ లలో కూడా వాడచ్చు. రోజుకి 1-2 టేబుల్ స్పూన్లు (15-30 గ్రాములు) తినడం మంచిది. మొదట్లో తక్కువ మొత్తంలో మొదలుపెట్టి.. ఆ తర్వాత పెంచుకోవచ్చు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగాలి.
55
ఎలా నిల్వ చేయాలి?
జనపనార విత్తనాలను గాలి చొరబడని డబ్బాలో.. చల్లని, చీకటి ప్రదేశాల్లో నిల్వ చేయాలి. జనపనార విత్తనాలు వెయిట్ లాస్ కి మంచిదే కానీ.. ఇది శాశ్వత పరిష్కారం కాదు. సమతుల్య ఆహారం, వ్యాయామం, నడక, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు ఈ విత్తనాలను తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అయితే వీటిని తీసుకునే ముందు డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవడం మంచిది. కొంతమందికి అజీర్తి, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు.