వెల్లుల్లి అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లిని పాలతో కలిపి తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. మరి వెల్లుల్లి పాలను ఎలా తయారుచేయాలి? వాటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం.
వెల్లుల్లి, పాలు విడిగా రెండూ ఆరోగ్యానికి మంచివే. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం ద్వారా రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. మరి వెల్లుల్లి పాలు ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.
వెల్లుల్లి పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
పాలు- ఒక కప్పు
వెల్లుల్లి రెబ్బలు- 2 లేదా 4
పటిక బెల్లం లేదా తేనె- 1, 2 టీ స్పూన్లు
పసుపు- చిటికెడు
మిరియాల పొడి- చిటికెడు
ముందుగా వెల్లుల్లి రెబ్బలను ఒలిచి, చిన్న ముక్కలుగా కట్ చేసి.. మెత్తగా నలగగొట్టాలి. తర్వాత ఒక పాత్రలో పాలు తీసుకొని, స్టవ్ పై పెట్టి మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత నలగగొట్టిన వెల్లుల్లిని వేయాలి.
25
పాలల్లో వెల్లుల్లి ఉడికేలా..
వెల్లుల్లి బాగా ఉడికి మెత్తబడే వరకు పాలను మరిగించాలి. వెల్లుల్లి కారం పాలల్లో కలిసే వరకు బాగా మరిగించాలి. దీనికి దాదాపు పది నిమిషాలు పట్టవచ్చు. వెల్లుల్లి బాగా ఉడికిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి వేసి స్టవ్ ఆపి పాలను దించాలి.
పాలు గోరువెచ్చగా అయిన తర్వాత పటిక బెల్లం లేదా తేనె కలిపి తాగవచ్చు. తాగే ముందు ఒక చెంచాతో వెల్లుల్లిని బాగా చిదిమేయాలి. వెల్లుల్లిని వడపోయకూడదు. పాలతో కలిపి నమిలి తాగాలి. డయాబెటిస్ లేదా బిపి ఉన్నవారు పటిక బెల్లం, తేనె వంటివి కలపకుండా పాలను అలాగే తాగవచ్చు.
35
ఔషధ గుణాలు కలిగిన పాలు..
ఈ పాలను పెద్దలు తాగవచ్చు. కానీ పిల్లలకు ఇవ్వడానికి ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. వెల్లుల్లి పాలు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇందులోని అలిసిన్, పోషకాలు కలిసి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
పసుపు, మిరియాలు వేయడం వల్ల ఈ పాలు.. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కఫాన్ని తొలగించి శ్వాస మార్గాన్ని శుభ్రపరుస్తాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ వంటి సమస్యలకు ఈ పాలు చక్కటి పరిష్కారం.
వెల్లుల్లిలోని సల్ఫర్, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతాయి.
వెల్లుల్లి పాలు మెరుగైన జీర్ణవ్యవస్థకు సహాయపడతాయి. అజీర్తి, ఆమ్లత, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలకు ఈ పాలతో చెక్ పెట్టవచ్చు. అంతేకాదు ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడతాయి.
వెల్లుల్లిలో సహజంగా ఉండే నొప్పి నివారణ లక్షణాలు.. నడుము, కీళ్లు, చేతులు, కాళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
55
ఇవి గుర్తుంచుకోండి!
వెల్లుల్లి పాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ.. కొంతమందికి అలెర్జీని కలిగిస్తాయి. ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, చాలా కాలంగా మందులు వాడుతున్నవారు లేదా ఇతర సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించిన తర్వాతే ఈ పాలను తీసుకోవడం మంచిది.