
40 ఏళ్లకే కీళ్ల నొప్పులు సర్వసాధారణంగా మారింది.అయితే.. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కీళ్లలోని మృదులాస్థి (cartilage) అరిగిపోవడం, అధిక బరువు వల్ల మోకాళ్లపై ఒత్తిడి పెరగడం వంటి అంశాలు ముందుగా చెప్పుకోవచ్చు. అలాగే చిన్న వయసులో ఆటల సమయంలో గాయాలు కావడం వల్ల కీళ్లు బలహీనంగా మారుతాయి. కుటుంబ చరిత్రలో కీళ్ల నొప్పులు ఉన్నవారికి, ఈ సమస్య రావడానికి అవకాశం మరింత ఎక్కువ. వయసు పెరగడం సహజ కారణమైనా, జీవనశైలి అలవాట్లు కూడా ఈ సమస్యకు కారణం. వాటి వివరాలేంటో తెలుసుకుందాం..
కీళ్ల నొప్పులు వస్తే కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. మోకాలి ప్రాంతంలో ఎప్పుడూ లేదా అప్పుడప్పుడు నొప్పి. ముఖ్యంగా ఉదయం లేచినప్పుడు లేదా ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడంతో కీళ్ళు గట్టిగా మారుతాయి. కీలు కదిలించినప్పుడు పటపట శబ్దాలు రావడం. మోకాళ్లను పూర్తిగా చాచలేకపోవడం లేదా వంచలేకపోవడం, కీలు బలహీనంగా అనిపించడం, నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు లేదా వంగి నిలబడేటప్పుడు నొప్పి పెరగడం. కీలు ప్రాంతంలో వాపు లేదా కదలికల్లో ఇబ్బంది.
ఆర్థరైటిస్ అనేది కీళ్ల వ్యాధుల్లో అత్యంత సాధారణమైనది. ఇది కీళ్లలోని మృదులాస్థి (cartilage) నెమ్మదిగా అరిగిపోవడం వల్ల కలుగుతుంది. ఈ మృదులాస్థి ఎముకల మధ్య దిండులా పనిచేస్తూ, కదలిక సమయంలో ఘర్షణను తగ్గిస్తుంది. అయితే అది అరిగిపోయినప్పుడు, ఎముకలు ఒకదానికొకటి రాపిడి కావడంతో నొప్పి, వాపు, కదలికలలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది ఎక్కువగా మోకాళ్లు, తుంటి భాగం, చేతుల కీలు, వెన్నెముకను ప్రభావితం చేస్తుంది.
కీళ్ల నొప్పులను ఆరంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.
జీవనశైలి మార్పులు: బరువు తగ్గడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి తగ్గి నొప్పిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కండరాలను బలోపేతం కోసం ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. అలాగే సౌకర్యవంతమైన, సరైన సైజు బూట్లు ధరించడం వల్ల కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.
ఫిజియోథెరపీ (Physiotherapy): ఫిజియోథెరపిస్టులు కీళ్ల కదలికను మెరుగుపరచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, నొప్పిని తగ్గించడానికి ప్రత్యేక వ్యాయామాలను నేర్పుతారు.
ఇంజెక్షన్లు: హైలూరోనిక్ యాసిడ్ (Hyaluronic Acid) ఇంజెక్షన్లు, తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి.
కీలు మార్పిడి శస్త్రచికిత్స అంటే.. తీవ్రమైన కీళ్ల నొప్పి రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంటే.. ( నడవడం, నిద్రపోవడం, చిన్నపాటి పనులు చేయడంలోనూ ఇబ్బంది) కీలు మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు సూచిస్తారు. ఈ శస్త్రచికిత్సలో మోకాలి కీళ్లలో అరిగిపోయిన మృదులాస్థి, ఎముక భాగాలను తొలగించి, వాటి స్థానంలో లోహం, ప్లాస్టిక్‌తో తయారైన కృత్రిమ భాగాలు అమర్చుతారు. ఇది నొప్పిని తగ్గించడంలో, కదలికల్ని మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడుతుంది.
నేటి ఆధునిక వైద్యంలో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు సాంకేతికంగా అత్యంత పురోగతిని సాధించాయి. ఇవి ఇప్పుడు మరింత సురక్షితంగా, తక్కువ నొప్పితో, త్వరితంగా కోలుకునేలా తయారయ్యాయి.
మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ: చిన్న కోతలతో శస్త్రచికిత్స చేస్తారు. తక్కువ రక్తస్రావం, తక్కువ మచ్చలు, త్వరగా కోల్కోవడం.
కంప్యూటర్ సాయంతో శస్త్రచికిత్స: ఖచ్చితమైన భాగాల అమరిక కోసం కంప్యూటర్ గైడెన్స్ ఉపయోగించబడుతుంది. ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
రోబోటిక్ శస్త్రచికిత్స: రోబో చేతుల సాయంతో అత్యంత నియంత్రితంగా, సమర్థవంతంగా ఆపరేషన్ జరుగుతుంది. మానవ తప్పిదాలు తగ్గుతాయి.
కృత్రిమ భాగాలు: ఇప్పుడు వాడే లోహ/ప్లాస్టిక్ కీళ్ల భాగాలు మరింత దృఢంగా, ఎక్కువ సంవత్సరాల పాటు నిలిచేలా ఉంటాయి.
ఫిజియోథెరపీ (Physiotherapy): శస్త్రచికిత్స తర్వాత వెంటనే ఫిజియోథెరపీ ప్రారంభమవుతుంది. ఇది నొప్పి నుండి ఉపశమనం, కీళ్ల కదలిక సామర్థ్యాన్ని తిరిగి పొందడం, కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
ఇంటి సంరక్షణ: వైద్యుడు, ఫిజియోథెరపిస్ట్ చెప్పిన సూచనలను పాటించాలి. ఇంటి చుట్టూ ఉన్న అడ్డంకులను తొలగించడం, బాత్రూమ్‌లలో హ్యాండిల్స్ అమర్చడం వంటి చిన్న మార్పులు సహాయపడతాయి.
వైద్య సలహా: వైద్యుడు సూచించిన విధంగా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలకు వెళ్లాలి.