Cancer: ఇటీవల క్యాన్సర్ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే చాలా మందికి అసలు క్యాన్సర్ ఎలా మొదలవుతుంది.? దాని కథ ఏంటో తెలియదు. మరి సింపుల్ భాషలో క్యాన్సర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరం లక్షల కోట్ల చిన్న కణాలతో (cells) తయారై ఉంటుంది. ఈ కణాలు రోజూ పాతవి చనిపోతాయి, కొత్తవి తయారవుతాయి. ఇలా శరీరం సహజంగా పనిచేస్తూ ఉంటుంది. కానీ ఒకప్పుడు కొన్ని కణాలు నియంత్రణ కోల్పోతాయి. అవి ఆగకుండా పెరుగుతుంటాయి. అలా అదుపు తప్పి పెరిగే కణాల సమూహాన్ని క్యాన్సర్ అంటారు. ఇది మొదట చాలా చిన్న సమస్యలా మొదలవుతుంది. కానీ సమయానికి గుర్తించకపోతే ప్రమాదంగా మారుతుంది. సాధారణంగా మన శరీరంలో ప్రతి కణం ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు ఆగాలి అనే నియమం ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఈ నియమం చెడిపోతుంది. ఉదాహరణకు స్మోకింగ్, ఆల్కహాల్, కాలుష్యం, తప్పుడు ఆహారంతో పాటు కొన్ని వైరస్‌లు, కుటుంబంలో ముందు నుంచే ఉన్న సమస్యలు వంటి కారణాల వల్ల ఒక కణం మారిపోతుంది. ఆ కణం నియంత్రణ లేకుండా పెరగడం మొదలుపెడుతుంది. అదే క్యాన్సర్ ప్రారంభం.
25
చిన్న కణం ఎలా పెద్ద సమస్య అవుతుంది?
మొదట ఒక కణం మాత్రమే మారుతుంది. కొంత కాలం తర్వాత అది రెండు అవుతుంది. ఆ తర్వాత నాలుగు అవుతుంది. ఇలా చాలా వేగంగా పెరుగుతుంది. ఇలా పెరిగిన కణాలు ఒక గడ్డలా తయారవుతాయి. దీనిని ట్యూమర్ అంటారు. కొన్ని ట్యూమర్లు ప్రమాదం కాదు. కానీ కొన్ని ట్యూమర్లు ప్రమాదకరం. అవే క్యాన్సర్.
35
క్యాన్సర్ శరీరంలో ఎలా వ్యాపిస్తుంది?
క్యాన్సర్ ఒక చోటే ఉండదు. అది పెరిగిన తర్వాత శరీరంలో మరో భాగాలకు వెళ్తుంది. ఉదాహరణకు రక్తం ద్వారా, లింఫ్ అనే ద్రవం ద్వారా. ఇలా క్యాన్సర్ కణాలు ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు వంటి ఇతర అవయవాలకు చేరుతాయి. ఈ దశను క్యాన్సర్ వ్యాపించడం అంటారు. ఈ సమయంలో చికిత్స కాస్త కష్టం అవుతుంది.
మన శరీర అవయవాలు సరిగ్గా పనిచేస్తేనే మన జీవన క్రియ సక్రమంగా ఉంటుంది. అయితే క్యాన్సర్ కణాలు పెరిగితే అవయవాలను నెమ్మదిగా నాశనం చేస్తాయి. ఉదాహరణకు ఊపిరితిత్తుల్లో ఉంటే శ్వాస కష్టం, కాలేయంలో ఉంటే జీర్ణ సమస్యలు, మెదడులో ఉంటే నరాల సమస్యలు వస్తాయి. అవయవాలు పనిచేయకపోతే శరీరం బలహీనమవుతుంది. అందుకే క్యాన్సర్ ప్రమాదకరం.
55
క్యాన్సర్ నుంచి ఎలా కాపాడుకోవాలి?
క్యాన్సర్ వచ్చిన తర్వాత చికిత్స ఉంటుంది. కానీ ముందే జాగ్రత్త తీసుకుంటే ఇంకా మంచిది. స్మోకింగ్‌కు దూరంగా ఉండడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటూ వ్యాయామం చేస్తుంటే క్యాన్సర్ జీవితంలో మన జోలికి రాదు. ఇక క్యాన్సర్ మొదటి దశలో ఉన్నా బయటపడడం సులువే. అందుకే శరీరంలో మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి.