Cancer: ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ క్యాన్సర్ మహమ్మారి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య తగ్గడంల లేదు. అయితే క్యాన్సర్‌ను ముందుగా గుర్తించి, సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
పురుషులకు తరచూ మూత్రం రావడం సాధారణ వయస్సు ప్రభావంగా చాలామంది భావిస్తారు. కానీ ఇది ప్రమాదకర సంకేతం కూడా కావచ్చు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన పురుషుల్లో ఇలా తరచూ మూత్రం రావడం ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ లక్షణంగా ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాన్ని పట్టించుకోకపోతే సమస్య తీవ్రంగా మారే ప్రమాదం ఉంది.
25
ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించవు
ప్రోస్టేట్ క్యాన్సర్ లో ప్రధాన సమస్య ఏంటంటే మొదటి దశలో స్పష్టమైన నొప్పి లేదా అసౌకర్యం కనిపించదు. ఎలాంటి ఇబ్బంది లేకుండానే వ్యాధి నెమ్మదిగా పెరుగుతుంది. అందుకే చిన్న అనుమానం వచ్చినా పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ఆలస్యం అయితే చికిత్స కష్టమవుతుంది.
35
మూత్రానికి సంబంధించిన హెచ్చరిక లక్షణాలు
తరచూ మూత్రం రావడం, మూత్రం ధార బలహీనంగా ఉండటం, మూత్రం మొదలుపెట్టడానికి లేదా ఆపడానికి ఇబ్బంది పడటం, మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాలేదన్న భావన రావడం వంటి లక్షణాలు చాలామంది సాధారణ సమస్యగా భావిస్తారు. కానీ ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్ కు తొలి హెచ్చరికలుగా ఉండొచ్చు.
మూత్రంలో లేదా వీర్యంలో రక్తం కనిపిస్తే అది చాలా గంభీరమైన సంకేతం. కొందరు దీన్ని తాత్కాలిక సమస్యగా భావించి వదిలేస్తారు. కానీ ఇది క్యాన్సర్ కు సంబంధించిన ముఖ్య లక్షణం కావచ్చు. అలాగే నడుము, పొత్తి కడుపు ప్రాంతంలో నిరంతర నొప్పి, కారణం లేకుండా బరువు తగ్గడం, ఎక్కువ అలసట వంటి లక్షణాలు వ్యాధి ఎక్కువ దశకు చేరినప్పుడు కనిపిస్తాయి.
55
ఎవరికెక్కువ ప్రమాదం? జాగ్రత్తలు
ప్రోస్టేట్ క్యాన్సర్ కు ఖచ్చితమైన కారణాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. వయస్సు పెరగడం, కుటుంబ చరిత్ర, హార్మోన్ల మార్పులు ముఖ్య కారణాలుగా భావిస్తున్నారు. పొగతాగడం, మద్యం అలవాటు, అధిక బరువు, అనారోగ్యకర జీవనశైలి ప్రమాదాన్ని పెంచుతాయి. వైద్యుల సూచన ప్రకారం 50 ఏళ్ల తర్వాత ప్రతి పురుషుడు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉంటే ఇంకా ముందే స్క్రీనింగ్ మొదలుపెట్టాలి.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.