Bile Duct Cancer: ఈ ప్రాణాంతక వ్యాధి లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

Published : Jul 10, 2025, 08:29 AM IST

Bile Duct Cancer : అరుదైన, ప్రమాదకరమైన వ్యాధుల్లో పిత్తనాళ క్యాన్సర్ ఒకటి. ఇది కాలేయం నుండి పేగులకు పిత్తరసం తీసుకెళ్లే నాళాల్లో ఏర్పడుతుంది. ఈ క్యాన్సర్ లక్షణాలు, కారణాలు, పరీక్షలు, చికిత్సా విధానాలు, ముందస్తు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

PREV
16
పిత్తనాళ క్యాన్సర్

కాలేయం.. శరీరంలోని కీలకమైన అవయవం. కాలేయం నుండి స్రవించే పిత్తరసాన్ని చిన్నపేగులోకి తీసుకెళ్లే గొట్టాలనే పిత్తనాళాలు అంటారు. ఈ పిత్తరసం శరీరంలో కొవ్వుల జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పిత్తనాళాల్లో ఏర్పడే అరుదైన క్యాన్సర్‌ను పిత్తనాళ క్యాన్సర్ (Bile Duct Cancer / Cholangiocarcinoma) అంటారు. ఇది చాలా తీవ్రమైన కాన్సర్. దీనిని ప్రారంభ దశలో గుర్తించడం కష్టం, ఎందుకంటే మొదట్లో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. ఎక్కువగా ఇది చివరి దశలోనే గుర్తించబడుతుంది. అయినప్పటికీ, కొన్ని సూచనలు లేదా మార్పుల ద్వారా ముందే జాగ్రత్త పడవచ్చు.

26
పిత్తనాళ క్యాన్సర్ రకాలు

పిత్తనాళాల్లో ఎక్కడైనా క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉంది. క్యాన్సర్ ఏర్పడే ప్రదేశాన్ని బట్టి పిత్తనాళ క్యాన్సర్‌ను మూడు ప్రధాన రకాలుగా వర్గీకరిస్తారు.

ఇంట్రా హెపాటిక్ కోలాంగియోకార్సినోమా – ఇది కాలేయం లోపల ఉన్న పిత్తనాళాల్లో ఏర్పడే క్యాన్సర్.

ఎక్స్‌ట్రా హెపాటిక్ కోలాంగియోకార్సినోమా – ఇది కాలేయానికి వెలుపల ఉన్న పిత్తనాళాల్లో ఏర్పడుతుంది.

డిస్టల్ కోలాంగియోకార్సినోమా – ఇది క్లోమానికి (ప్యాంక్రియాస్) సమీపంలో ఉన్న పిత్తనాళ చివరి భాగంలో ఏర్పడుతుంది.

ఈ వర్గీకరణ ద్వారా క్యాన్సర్ ఉన్న స్థలాన్ని స్పష్టంగా గుర్తించి, తగిన చికిత్సను అందిస్తారు. 

36
పిత్తనాళ క్యాన్సర్ లక్షణాలు:

పిత్తనాళ క్యాన్సర్ ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదిరిన తర్వాతే ఎక్కువగా గుర్తించబడుతుంది. ఈ వ్యాధి లక్షణాల్లో ముఖ్యంగా చర్మం,  కళ్ల తెల్ల భాగం పసుపు రంగులోకి మారడం (జాండిస్).  అలాగే, పిత్తరసం సరిగ్గా బయటకు రాకుండా రక్తంలో కలవడం వల్ల మూత్రం ముదురు పసుపు లేదా నారింజ రంగులో బయటకు వస్తుంది. అలాగే.. మలం బంకమట్టి రంగులో   కనిపించవచ్చు. ఈ మార్పులు పిత్తరసం చిన్నపేగుకు చేరకపోవడం వల్ల కలుగుతాయి. శరీరంలో పిత్త లవణాల పేరుకుపోవడం వల్ల తీవ్రమైన చర్మ దురద కూడా రావచ్చు.

46
పిత్తనాళ క్యాన్సర్ కారణాలు

పిత్తనాళ క్యాన్సర్ ముదిరిన దశలో అనేక తీవ్రమైన లక్షణాలు కన్పించవచ్చు. వాటిలో అధిక అలసట, ఆకలి లేకపోవడం, కడుపు పైభాగం లేదా కుడి వైపున నొప్పి, జ్వరం, బలహీనత, కాలేయం వాపు, అనూహ్యంగా బరువు తగ్గడం ముఖ్యమైనవి. ఈ లక్షణాలు వేరే వ్యాధులవల్ల కూడా వచ్చే అవకాశం ఉండడంతో, చివరి దశలోనే గుర్తించబడుతుంది.

ఈ క్యాన్సర్‌ రావడానికి  కచ్చితమైన కారణాలు తెలీయకపోయినా, కొన్ని పరిస్థితులు ప్రమాద కారకాలుగా గుర్తించబడ్డాయి. ఉదాహరణకు పిత్తనాళాల్లో వాపు, కొన్ని ఇన్ఫెక్షన్లు, కాలేయపు పరాన్నజీవులు (liver flukes), పుట్టుకతో వచ్చే నాళాల్లో లోపాలు, దీర్ఘకాలిక హెపటైటిస్ B లేదా C, కాలేయ సిర్రోసిస్, ధూమపానం, మద్యం సేవనం, డయాబెటిస్, ఊబకాయం, హానికరమైన రసాయనాల వినియోగం మొదలైనవి. 

56
పిత్తనాళ క్యాన్సర్ పరీక్షలు, చికిత్స విధానాలు

పిత్తనాళ క్యాన్సర్‌ను గుర్తించేందుకు పలు పరీక్షలు ఉన్నాయి. ముఖ్యంగా కాలేయ పనితీరు పరీక్షలు, కణితి మార్పులు, అల్ట్రాసౌండ్, CT స్కాన్, MRI, MRCP,  ERCP వంటి స్కానింగ్ పద్ధతులను ఉపయోగిస్తారు. ERCP విధానంలో ఒక గొట్టం ద్వారా పిత్తనాళాలను పరిశీలించి బయాప్సీ (కణం నమూనా) తీసుకోవచ్చు. ఇది అడ్డంకులను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది.

చికిత్సా విధానం క్యాన్సర్ ఏ దశలో ఉంది, ఎక్కడ ఉంది,  రోగి ఆరోగ్య స్థితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రారంభ దశలో క్యాన్సర్ కనిపిస్తే, శస్త్రచికిత్స ద్వారా కణితిని పూర్తిగా తొలగించడం సాధ్యపడుతుంది. అయితే, కణితి చుట్టుపక్కల భాగాలకు వ్యాపించి ఉంటే, ఆ ప్రభావిత భాగాన్ని తొలగిస్తారు. సమస్య తీవ్ర స్థాయికి చేరినపుడు, శస్త్రచికిత్స కంటే కీమోథెరపీ, రేడియేషన్, లేదా పల్లియేటివ్ కేర్ వంటి విధానాలు వాడతారు.

66
ముందస్తు గుర్తింపు, జాగ్రత్తలు

పిత్తనాళ క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తించడం చాలా కష్టం. ఇది ఎక్కువగా చివరి దశలోనే కనిపించడంతో చికిత్స కూడా క్లిష్టమవుతుంది. పూర్తిగా నయం చేయలేని పరిస్థితుల్లో పాలియేటివ్ కేర్ ద్వారా కేవలం లక్షణాలను తగ్గించి, రోగి జీవన నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఉంటుంది. ఇది జీవిత కాలాన్ని కొంతవరకు పొడిగించగలదు. కానీ, క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయదు.

ఇలాంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా ఉండాలంటే ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కాలేయం, పిత్తనాళాలు సంబంధిత కుటుంబ చరిత్ర ఉన్నవారు లేదా  కాలేయ సమస్యలు ఉన్నవారు ప్రతి 6 నెలలకోసారి పూర్తి శారీరక పరీక్ష చేయించుకోవడం మేలు.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం అంతా సాధారణ విద్యా ప్రయోజనాల కోసం, అవగాహన కల్పించడం కోసం మాత్రమే. పిత్తనాళ క్యాన్సర్ చాలా సంక్లిష్టమైన వ్యాధి. ఏదైనా లక్షణాలు లేదా సందేహాలు ఉంటే వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించి వ్యాధి నిర్ధారణ , చికిత్సా ప్రణాళికను పొందడం చాలా ముఖ్యం.

Read more Photos on
click me!

Recommended Stories