పగలంతా కష్టపడిన తర్వాత రాత్రి అలా పడుకోగానే నిద్ర పడితే ఎంత హాయిగా ఉంటుంది. కానీ.. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తున్నా కూడా ఆ పని పూర్తవ్వదు. ఇంకా చెప్పాలంటే.. రాత్రిపూటే ఎక్కువ సేపు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ బిజీ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా సమయానికి నిద్రపోకుండా ఉండేవారు చాలా మందే ఉన్నారు. రాత్రి 12 తర్వాత పడుకోవడం.. ఉదయం 9 తర్వాత నిద్ర లేవడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కానీ.. ఈ రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా?
25
ఆరోగ్యానికి, నిద్రకు సంబంధం..
ఎందుకంటే, మన శరీరం సూర్యోదయం, సూర్యాస్తమయానికి అనుగుణంగా పనిచేసే సహజమైన సిర్కాడియన్ లయపై ఆధారపడి ఉంటుంది. దీనిని మెరుగ్గా నిర్వహించాలంటే సమయానికి పడుకోవడం చాలా అవసరం. ఆలస్యంగా నిద్రపోవడం మన ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. మరి, ప్రతిరోజూ రాత్రి 10 లోగా నిద్ర పోతే ఎన్ని లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
35
గుండె ఆరోగ్యం..
సమయానికి నిద్రపోవడం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరం విశ్రాంతిగా ఉండటానికి తగినంత సమయం దొరికినప్పుడు, మన మానసిక స్థితి మెరుగవుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది. శారీరక సామర్థ్యం కూడా మెరుగవుతుంది. తద్వారా మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు దూరంగా ఉంటాయి. అలాగే, సమయానికి నిద్రపోవడం మన శరీరంలోని కార్టిసాల్ వంటి ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
మరొక ముఖ్యమైన అంశం, సమయానికి నిద్రపోవడం మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మంచి నిద్ర వల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరిగి శరీరం వ్యాధులతో బలంగా పోరాడగలదు. ఇవే కాదు, ఆకలి నియంత్రణలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రలేమి ఉన్నప్పుడు గ్రెలిన్ అనే ఆకలికి సంబంధిచిన హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. లెప్టిన్ అనే తృప్తి హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది అధికంగా ఆహారం తీసుకోవడం, బరువు పెరగడానికి దారి తీస్తుంది. త్వరగా పడుకోవడం వల్ల ఈ హార్మోన్ల సమతుల్యతను సాధించవచ్చు.
55
మానసిక సమస్యలు కూడా ఉండవు..
మానసిక ఆరోగ్య పరంగా కూడా సమయానికి నిద్రపోవడం ఎంతో మేలు చేస్తుంది. తగినంత నిద్ర లేకపోతే మనసు అశాంతిగా మారుతుంది. ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ, సరైన సమయంలో పడుకొని సరిపడా నిద్రపోతే, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మానసిక స్థితి మెరుగవుతుంది.
ఈ అన్ని కారణాల వల్ల, ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా మన నిద్రపోయే సమయాన్ని నియంత్రించుకోవాలి. చివరగా, ఈ సూచనలు పాటించే ముందు తప్పనిసరిగా వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.