ఒకప్పుడు పేదవారి ఆహారంగా భావించబడిన చిరుధాన్యాలను ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తున్నారు. అందుకే చాలా మంది తమ డైట్ లో చిరు ధాన్యాలను భాగం చేసుకుంటున్నారు. వీటిని 'కొత్త బంగారు ధాన్యాలు' (New Golden Grains) అనే పేరుతో ప్రాచుర్యంలోకి తీసుకవస్తున్నారు. గోధుమ, వరితో పోలిస్తే చిరుధాన్యాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
ఇందులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే, వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Low Glycemic Index) కలిగి ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి చిరుధాన్యాలు బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు.
చిరుధాన్యాల్లో ప్రోటీన్, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీర బలాన్ని, ఎముకల ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి. అందుకే, గోధుమ, వరిపై మాత్రమే ఆధారపడకుండా, చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.