
ఈరోజుల్లో ప్రతి ఆహారం కల్తీ చేయడం చాలా కామన్ అయిపోయింది. పాలు, నెయ్యి, పన్నీర్ మాత్రమే కాకుండా.. మనం ప్రతిరోజూ వాడే గోధుమ పిండిని కూడా నకిలీ చేస్తున్నారు. ముఖ్యంగా పండగల సీజన్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు కొందరు వ్యాపారులు లాభం కోసం కల్తీకి పాల్పడుతూ ఉంటారు. దీనిని వాడటం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, మనం ఉపయోగిస్తున్న గోధుమ పిండి స్వచ్ఛమైనదా లేక.. నకిలీ చేసిందా అన్నది తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదు. అలా అని దానిని టెస్టు చేయడానికి మనం ప్రయోగశాలకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సులభమైన పద్ధతులు వాడటం వల్ల మనం పిండి నాణ్యతను గుర్తించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం....
1.వాసన ద్వారా గుర్తించడం...
స్వచ్ఛమైన గోధుమ పిండి సహజమైన మృదువైన, తీపి, తాజా వాసన కలిగి ఉంటుంది. తాజా గోధుమల వాసనలా ఉంటుంది. పిండిలో కల్తీ జరిగితే దాని నుంచి ఘాటైన వాసన లేక.. రసాయనాలు కలిపిన వాసన వస్తుంది. వాసనతో తేడాను మనం చాలా సులభంగా గుర్తించొచ్చు.
2. నీటి పరీక్ష..
ఇది చాలా సులభమైన పద్ధతి. ఒక గ్లాసు శుభ్రమైన నీటిలో అర టీస్పూన్ గోధుమ పిండిని వేసి కలపండి.
స్వచ్ఛమైన పిండి… పూర్తిగా నీటిలో కరిగి, కొంతసేపటికి అడుగున స్థిరపడుతుంది.
కల్తీ పిండి .. నీటి మీద తేలిపోతుంది లేదా పైభాగంలో పొరలా ఏర్పడుతుంది. అంటే.. ఇందులో గోధుమ పిండితో పాటు ఇతర పౌడర్లు కలిసినట్లు అర్థం చేసుకోవడం.
పిండిని మీ చేతుల మధ్య రుద్దినప్పుడు స్వచ్ఛమైన పిండి మృదువుగా, సిల్క్‌లా అనిపిస్తుంది. కల్తీ పిండి రుద్దినప్పుడు జిగటగా లేదా ముతకగా అనిపించవచ్చు. ముఖ్యంగా రవ్వ లాంటి గరుకుదనం ఉంటే, లేదా రసాయనాల వాసన వస్తే, ఆ పిండిని ఉపయోగించకపోవడమే మంచిది.
4. పొట్టు..
ఆరోగ్యకరమైన గోధుమ పిండిలో సహజమైన పొట్టు ఉండాలి. ఇది ఫైబర్ కి మంచి మూలం, జీర్ణక్రియకు సహాయపడుతుంది. పూర్తిగా మెత్తగా, పొట్టు లేకుండా ఉండే పిండి ఎక్కువగా ప్రాసెస్ చేసినది గుర్తించాలి. ఇలా ప్రాసెస్ చేసిన పిండిలో పోషకాలు ఉండవు.
5. రంగు, రూపం
స్వచ్ఛమైన గోధుమ పిండి లేత గోధుమ రంగులో ఉంటుంది. కల్తీ పిండికి అసహజంగా తెలుపు లేదా పసుపు రంగు ఉండవచ్చు. అలాగే, పిండిలో చిన్నచిన్న రాళ్లు, ధూళి లేదా వేరే దినుసులు కనపడితే అది కల్తీ అయ్యే అవకాశం ఉంటుంది.
పిండితో రొట్టెలు లేదా చపాతీలు చేసినప్పుడు అవి సహజమైన రుచి, వాసన ఇవ్వాలి. కల్తీ పిండితో చేసిన వంటకాలు రుచి, రంగు, వాసనలో తేడా చూపిస్తాయి. చపాతీలు త్వరగా ఎండిపోవడం, గట్టిగా మారడం కూడా కల్తీ సూచన.
ఫైనల్ గా..
పిండిలో కల్తీని గుర్తించడం కష్టమైన పని కాదు. వాసన, రంగు, రూపం, స్పర్శ, నీటిలో కరిగే తీరు వంటి సులభమైన పరీక్షలతో మనం ఇంట్లోనే దీన్ని తెలుసుకోవచ్చు. కల్తీ పిండిని వాడటం ఆరోగ్యానికి హానికరం . ఇది జీర్ణ సమస్యలు, విష ప్రభావాలు, దీర్ఘకాలిక వ్యాధులకు కారణం కావచ్చు. అందుకే పిండిని విశ్వసనీయమైన వనరుల నుండి మాత్రమే కొనుగోలు చేయాలి.
ఈ చిన్నచిన్న పరీక్షలు అలవాటు చేసుకుంటే, ప్రయోగశాలకు వెళ్లకుండానే కల్తీ పిండిని సులభంగా గుర్తించవచ్చు. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా, మోసపోకుండా ఉండటానికి కూడా సహాయపడుతుంది.