
ఆరోగ్యకరమైన కూరగాయల్లో క్యారెట్లు ఒకటి. దీనిలో మన శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలా మంది క్యారెట్లు తింటే కళ్లు మాత్రమే బాగా కనిపిస్తాయని, వీటితో ఇదొక్కటే ప్రయోజనం ఉందని అనుకుంటారు. కానీ క్యారెట్లు కళ్లకు మాత్రమే కాదు మన మొత్తం శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే వీటిని ఖచ్చితంగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
నిజానికి క్యారెట్లు మిగతా కూరగాయల కంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని వండి మాత్రమే కాదు పచ్చిగా తిన్నా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. క్యారెట్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ఈ కూరగాయను తింటే కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
నిపుణుల ప్రకారం.. క్యారెట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. క్యారెట్లను ఎవ్వరు తిన్నా తినకున్నా.. ఆరుగురు మాత్రం ఖచ్చితంగా తినాలి. ఎవరు వాళ్లు? ఎందుకు ఖచ్చితంగా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చర్మ సమస్యలు ఉన్నవారు
అవును చర్మ సమస్యలున్న వారు క్యారెట్లను ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే క్యారెట్లలో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి మన చర్మాన్ని రక్షిస్తాయి. అలాగే చర్మ పునరుత్పత్తికి సహాయపడతాయి. అందుకే చర్మ సమస్యలున్నవారు క్యారెట్లను తినాలని చెప్తారు.
పేలవమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు
జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయని వారు కూడా క్యారెట్లను రోజూ తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెప్తారు. ఎందుకంటే క్యారెట్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. దీంతో మీకు ఉన్న మలబద్దకం సమస్య నుంచి బయటపడతారు. అలాగే మీ మొత్తం జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికి క్యారెట్లు మంచి మేలు చేస్తాయి. ఎందుకంటే క్యారెట్లలో పొటాషియం, ఫైబర్ మెండుగా ఉంటాయి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. దీనిలో ఉండే పొటాషియం బీపీని కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.
షుగర్ సమస్యలు ఉన్నవారు
క్యారెట్లు తీయగా ఉన్నప్పటికీ.. ఇవి ఇతర కూరగాయల కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు వీటిని ఎంచక్కా తినొచ్చు. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అలాగే బ్లడ్ షుగర్ ను నియంత్రించడానికి సహాయపడతాయి.
క్యారెట్లు బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఎలా అంటే వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్ లో వీటిని చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
కంటిచూపు సరిగ్గా లేనివారు
కంటిచూపును మెరుగుపర్చడంలో క్యారెట్లు ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. నిజానికి క్యారెట్లు బీటా కెరోటిన్ కు మంచి వనరు. ఈ బీటా కెరోటిన్ మన శరీరంలోకి వెళ్లి విటమిన్ ఎ గా మారి ఆ తర్వాత రోడాప్సిన్ గా మారుతుంది. రోడాప్సిన్ అనేది రెటీనాలో ఉండే ప్రోటీన్. ఇది మన కళ్ల ముఖ్యమైన భాగం. ఇది కాంతిని రసాయన సంకేతాలుగా మార్చి మనం బాగా చూడటానికి సహాయపడుతుంది.
విటమిన్ ఎ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, కళ్లు బాగా కనిపించడానికి, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటానికి చాలా అవసరం. ఈ విటమిన్ ఎ శరీరంలో తగ్గితే ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి విటమిన్ ఎ లోపం ఉన్నవారు క్యారెట్లను రోజూ తినాలి. క్యారెట్లలో పుష్కలంగా ఉండే విటమిన్ ఎ మిమ్మల్ని ఈ లోపం నుంచి బయటపడేస్తుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.