Virataparvam Review: సాయిపల్లవి `విరాటపర్వం` మూవీ రివ్యూ.. రేటింగ్‌..

First Published | Jun 17, 2022, 1:44 AM IST

 నక్సల్స్ బ్యాక్‌ డ్రాప్‌లో ప్రేమ కథ అనే కొత్త పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు వేణు ఊడుగుల. దీంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయిపల్లవి నటించిన సినిమా కావడంతో మరింత క్రేజ్‌ నెలకొంది. అందరిలోనూ అంచనాలు పెంచింది. శుక్రవారం(జూన్‌ 17)న విడుదలవుతున్న ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుంటుందా? నేటి తరాన్ని ఆకట్టుకుందా? అనేది `విరాటపర్వం` రివ్యూలో తెలుసుకుందాం. 

నక్సల్స్ ఉద్యమం నేపథ్యంలో 90 దశకంలో చాలా సినిమాలు వచ్చాయి. అప్పట్లో నక్సల్స్ ఉద్యమాలు బలంగా ఉండటంతో జనాల్లో వాటి ప్రభావం చాలా ఉంది. అందుకే అప్పట్లో వచ్చిన సినిమాలకు మంచి ఆదరణ దక్కింది. కమర్షియల్‌ సినిమాలకు దీటుగా ఆదరణ పొందాయి. కలెక్షన్లూ సాధించాయి. గ్లోబలైజేషన్‌ కారణంగా మనిషిలో మార్పు వచ్చింది. లగ్జరీలు పెరిగాయి. డబ్బు ప్రభావం జనంపై పడింది. దీంతో లెఫ్ట్ ఉద్యమాలకు, నక్సల్ పోరాటాలకు ఆదరణ దగ్గుతూ వస్తుంది. అదే సమయంలో అలాంటి సినిమాలు తగ్గుతూ వచ్చాయి. ఒక్క ఆర్‌ నారాయణ మూర్తి మాత్రమే ఇప్పటికీ తన వంతు ప్రయత్నంగా పోరాటం చేస్తున్నారు. అణగారిన వర్గాల సమస్యలను, రైతు సమస్యలను లెఫ్ట్ ఐడియాలిజీతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన సినిమాలకు ఆదరణ తగ్గిపోయింది.
 

ఈ నేపథ్యంలో నక్సల్‌ ఉద్యమం బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పుడు `విరాటపర్వం` సినిమాని తీశారు దర్శకుడు వేణు ఊడుగుల. `నీది నాది ఒకే కథ`తో మంచి ప్రశంసలందుకున్న ఆయన 1990లో జరిగిన సంఘటనలను బేస్‌ చేసుకుని మాజీ నక్సల్స్ రవన్న, ఆయన ఉద్యమ స్ఫూర్తి పొందిన సరళ జీవితాల ఆధారంగా `విరాటపర్వం` అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రవన్నగా రానా, సరళగా సాయిపల్లవి నటించారు. సురేష్‌బాబు సమర్పణలో శ్రీకాంత్‌, సుధాకర్‌ చెరుకూరి, రానా కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నక్సల్స్ ఉద్యమాల ప్రభావం లేని ఈ టైమ్‌లో, నక్సల్స్ బ్యాక్‌ డ్రాప్‌లో ప్రేమ కథ అనే కొత్త పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు వేణు ఊడుగుల. దీంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయిపల్లవి నటించిన సినిమా కావడంతో మరింత క్రేజ్‌ నెలకొంది. అందరిలోనూ అంచనాలు పెంచింది. శుక్రవారం(జూన్‌ 17)న విడుదలవుతున్న ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుంటుందా? నేటి తరాన్ని ఆకట్టుకుందా? అనేది `విరాటపర్వం` రివ్యూలో తెలుసుకుందాం. Virataparvam Movie Review.

Latest Videos


కథః 

అది 1973 తెలంగాణ రూరల్‌-ఆంధ్రప్రదేశ్‌.. అర్థరాత్రి అడవిలో పోలీసులకు, నక్సల్స్ మధ్య భీకరమైన కాల్పులు జరుగుతుండగా వెన్నెల(సాయిపల్లవి) జన్మిస్తుంది. ఆమె పుట్టుకే రక్తపాతంతో కూడింది. చిన్నప్పట్నుంచే వెన్నెల మొండి పట్టుదల కలిగిన అమ్మాయి. తనకు నచ్చినదాని కోసం ఏమైనా చేస్తుంది. జమ్మికుంట ప్రాంతం చిన్న పల్లెటూరికి చెందిన వెన్నెల `అరణ్య` పేరుతో నక్సలైట్‌ రవన్న(రానా) రాస్తున్న పుస్తకాలకు ఆకర్షితురాలై, ఆయన రాతలకు ముగ్దురాలవుతుంది. ఆయన్ని ఆరాధిస్తూ, పిచ్చిగా ప్రేమిస్తుంది. ఎలాగైనా ఆయన్ని కలవాలని తపిస్తుంది. తన ప్రేమని ఆయనకు చెప్పాలనుకుంటుంది. తన ఊరిలో బోనాల పండుగ జరుపుకుంటున్న సమయంలో పోలీసులు అరాచకాలను అడ్డుకునేందుకు నక్సల్స్ వచ్చినప్పుడు మొదటిసారి రవన్నని చూస్తుంది వెన్నెల. ఆ తర్వాత వరుసగా ఆయన రాసిన పుస్తకాలు చదివి మరింతగా ఆయనకు ఆకర్షితురాలవుతుంది. తండ్రి(సాయిచంద్‌) ఒగ్గుకథలు చెబుతుండగా, అందులో మీరా భాయ్‌ కృష్ణుడి ప్రేమ కోసం ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పిన మాట విని తను కూడా రవన్న కోసం, తన ప్రేమ కోసం ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకుంటుంది. ఇష్టం లేని పెళ్లిని ఎదురించి ప్రేమికుడి కోసం వెళ్లిపోతున్నట్టు లెటర్‌ రాసి వెళ్లిపోతుంది వెన్నెల. రవన్న కాంటాక్ట్ కోసం ఊరూరా తిరుగుతూ ఉద్యమ నాయకులను కలుస్తుంది. మరి వెన్నెలకి రవన్న దళం కాంటాక్ట్ దొరికిందా? తన ప్రేమని ఆయనకు చెప్పిందా? ఆమె ప్రేమని రవన్న ఒప్పుకున్నాడా? చివరికి ఏం జరిగిందనేది మిగిలిన సినిమా కథ. Virataparvam Movie Review.

విశ్లేషణః 

`విరాటపర్వం` సినిమాని యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు వేణు ఊడుగుల రూపొందించినట్టు చెప్పిన విషయం తెలిసిందే. నక్సలైట్‌ రవన్నని ప్రేమించిన సరళ అనే అమ్మాయి ఆయన్ని కలవాలని, తన ప్రేమని వ్యక్తం చేయాలని భావిస్తుంది. అయితే ఆమెని పోలీసులు పంపించిన కోవర్ట్ గా అనుమానించి నక్సలైట్లే చంపినట్టు యదార్థ సంఘటలు చెబుతున్నాయి. ఈ పాయింట్‌లో ప్రేమ ఉంది, స్ట్రగుల్‌ ఉంది, ఎమోషన్‌ ఉంది. మంచి ఫీల్‌ ఉంది. కమర్షియాలిటీకి తగ్గ అంశాలన్ని ఉన్నాయి. ఎంతో లిబర్టీ తీసుకుని కూడా సినిమాని తీయోచ్చు. కానీ దర్శకుడు వేణు ఊడుగుల వాటిని పట్టించుకోకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్‌.  సినిమా ప్రారంభం నుంచి వెన్నెల.. రవన్నని కలవాలని, ఆయన్ని ప్రేమలోనే మునిగి తేలుతున్న అంశంపైనే ఫోకస్‌ పెట్టారు. రవన్నపై ఆమెకి ప్రేమ కలగడానికి బలమైన కారణం చూపించలేకపోయాడు. బలమైన స్ట్రగుల్స్ ఆమె జీవితంలో లేకపోవడంతో ఆమె ప్రేమలో ఎమోషన్‌ మిస్‌ అయ్యింది. వెన్నెల ప్రేమలో ఫీల్‌ మిస్‌ అయ్యింది. దీంతో ఆమె ప్రేమ ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది. వెన్నెల అంతగా ఆయన్ని ఎందుకు ఇష్టపడుతుందో ఆడియెన్స్ కి అర్థం కాదు. Virataparvam Movie Review.

సినిమా మొత్తం రవన్నని వెన్నెల కలిసేందుకు చేసే జర్నీనే ఉంటుంది. మధ్య మధ్యలో పోలీసులకు, నకల్స్ కి మధ్య కాల్పులు వచ్చిపోతుంటాయి. తప్పితే ఎందులోనూ ఎమోషన్‌ ఉండదు. దీంతో ఆత్మలేని బాడీలా అనిపిస్తుంటుంది. ఏ సినిమాకైనా సోల్‌, ఎమోషన్‌ ముఖ్యం. అది ఆడియెన్స్ కనెక్ట్ అయితేనే కథతో ట్రావెల్‌ చేస్తాడు. లేదంటే చిరాకు తప్పదు. `విరాటపర్వం` విషయంలో అదే జరిగింది. కథతో ఆడియెన్స్ ట్రావెల్‌ కాలేకపోతాడు. ఒక సీన్‌ తర్వాత మరో సీన్ వచ్చీ పోతుంటాయి తప్పితే ఏ ఒక్కటి ఆడియెన్స్ కి ఎక్కదు. మధ్యలో మదర్‌ సెంటిమెంట్‌ ఫర్వాలేదనిపిస్తుంది. ఇక చివర్లో వెన్నెలని చంపే సన్నివేశం భావోద్వేగానికి గురి చేస్తుంది. అదొక్కటే సినిమాకి బలం. అక్కడే ఎమోషన్‌ ఉంటుంది, ఫీల్‌ ఉంటుంది. ఆ సీన్‌ కోసమే రెండున్నరగంటల సినిమాని భరించాలా? అనే ఫీలింగ్‌ ఆడియెన్స్ కి కలుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే వెన్నెలని పోలీస్‌ కోవర్ట్ గా అనుమానించి చంపడం భావోద్వేగభరిత అంశం, పైగా ఆమెని ఎవరు చంపారనేది కూడా ఎగ్జైటింగ్‌ పాయింట్‌గా చెప్పొచ్చు. 
 

నక్సల్స్ ఉద్యమాలు 1990లో ఎంత బలంగా ఉన్నాయనేది అప్పటి తరానికి బాగా తెలుసు. కానీ నేటి యూత్‌కి తెలియదు. ఇప్పుడు వాటి ప్రభావం లేకపోవడంతో అవేంటో కూడా ఇప్పటి తరానికి తెలియదు. దీంతో నేటితరం ఆడియెన్స్ ఈ చిత్రానికి కనెక్ట్ కావడం కష్టం. కమర్షియల్‌గా ఈ సినిమా మనుగడ సాధించడం మరింత కష్టం. వామపక్ష భావజాలం కలిగిన వారు, లెఫ్ట్ ఐడియాలజీతో ఉన్నవారికి, అప్పటి నక్సల్స్ పోరాటాలను చూసిన వారికి, వాటి గురించి చదువుకున్న వారికి అంతో ఇంతో సినిమా కనెక్ట్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.అదే సమయంలో నకల్స్ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన ప్రేమని చెప్పాలనే కొత్త ఐడియా విషయంలో, ఆయన చేసిన ప్రయత్నం విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. చరిత్రలో దాగిన నిజాలను నేటి తరానికి తెలియజెప్పాలనే కాజ్‌ విషయంలోనూ ప్రశంసించాల్సిందే.  
 

నటీనటులుః 
ఇందులో రవన్న పాత్రలో రానా ఒదిగిపోయి ప్రాణం పోశాడు. రవన్న ఇలానే ఉంటాడేమో అనేట్టుగా ఆయన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆకట్టుకున్నారు. తనవంతుగా సినిమాకి పిల్లర్‌గా నిలిచారు. ఇక సినిమాకి సాయిపల్లవే హీరో. వెన్నెల పాత్రలో ఆమె అబ్బురపరిచింది. మరోసారి తన నటనలోని పరిణతిని ఆవిష్కరించింది. పల్లెటూరి అమ్మాయిగా, ప్రేమికురాలిగా, నక్సలైట్‌గా, హక్కుల కోసం తిరుగుబాటు చేసే నాయకురాలి తరహా పాత్రలో ఆద్యంతం కనువిందు చేసింది. కానీ ఆమె నుంచి అభిమాలను ఆశించే డాన్సులు, వినోదం లేకపోవడం మైనస్‌. అదే సమయంలో ఆమె పాత్ర విషాదాంత ముగింపు ఫ్యాన్స్ జీర్ణించుకోలేరు. భారతక్కగా ప్రియమణి పాత్ర పరిమితం, నవీన్‌ చంద్ర పాత్ర కూడా పరిమితం. కానీ ఉన్నంతలో బాగా చేశారు. సాయిచంద్‌, రాహుల్‌ రామకృష్ణ, జరీనా వాహెబ్‌, ఈశ్వరీ రావు, నందితా దాస్‌,  బెనర్జీలు కనిపించినంత సేపు తమపై అటెన్షన్‌ క్రియేట్‌ చేసి ఆకట్టుకున్నారు. Virataparvam Movie Review.

టెక్నీషియన్ల పనితీరుః

సురేష్‌ బొబ్బిలి సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి ప్లస్‌ అయ్యింది. సినిమా నేపథ్యానికి తగ్గ సంగీతం, బీజీఎం అందించారు. పాటలన్నీ కథలో భాగంగానే రావడం కూడా ప్లస్‌ అనే చెప్పాలి. డానీ సలో, దివాకర్‌ మణి కెమెరా వర్క్ బాగుంది. పీరియడ్‌ లుక్‌లో విజువల్స్ ఆకట్టుకున్నాయి. చాలా నేచురల్‌గా ఉన్నాయి. శ్రీ నాగేంద్ర ఆర్ట్ వర్క్ ప్రశంసనీయం. అప్పటి కాలానికి తీసుకెళ్లాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఏ విషయంలోనూ రాజీపడలేదు. ఫైనల్‌గా దర్శకుడు వేణు ఉడుగుల ఎత్తుకున్న పాయింట్‌ బాగానే ఉన్నా, దాన్ని వెండితెరపై ఆవిష్కరించడంలో తడబడ్డారనిపిస్తుంది. ఎంత విప్లవ నేపథ్య కథ అయినా నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా, కాస్త ఎంటర్‌టైనింగ్‌గానే, ఎంగేజింగ్‌గానే, ఎమోషనల్‌గా చెబితేనే ఆకట్టుకుంటుంది. ఆ పాయింట్‌ని వదిలేసి తన పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో `విరాటపర్వం` కథ చెప్పడమే ఇక్కడ కమర్షియాలిటీ పరంగా చిక్కొచ్చి పడింది. Virataparvam Movie Review.

Virataparvam Review: ఫైనల్‌గా సాయిపల్లవి కోసం ఓ సారి చూడొచ్చు. వాపపక్ష భావజాలం కలిగిన వారికి నచ్చే సినిమా.

రేటింగ్‌ః 2.5

click me!