Garlic
వెల్లుల్లి ఒక మసాలా దినుసు. అందుకే ఇది ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. నిజానికి వెల్లుల్లి కేవలం మసాలా దినుసే కాదు.. ఎన్నో ఔషదాలున్న వంటింటి పదార్థం కూడా. ఇది వంటలను టేస్టీగా చేయడమే కాకుండా.. మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. నిజానికి వెల్లుల్లి మన ఆరోగ్యానికి చాలా మంచిది.
అందుకే వెల్లుల్లిని పురాతన కాలం నుంచి సాంప్రదాయ వైధ్యం, ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు. వెల్లుల్లిలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ బి6, విటమిన్-సి, అల్లిసిన్, మాంగనీస్ వంటి ఎన్నో రకాల పోషకాలుంటాయి. అంతేకాదు దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వెల్లుల్లి చలికాలంలో మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. రోజూ రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే మనం ఎన్నో వ్యాధులకు, జబ్బులకు దూరంగా ఉంటాం. వెల్లుల్లి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. దీంతో ఈ సీజన్ లో దగ్గు, జలుబు వంటి సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా తొందరగా తగ్గిపోతాయి. వెల్లుల్లి మన రోగనిరోధక శక్తిని పెంచి మనల్ని సీజనల్ వ్యాధులకు దూరంగా ఉంచుతుంది.
వెల్లుల్లిని తింటే శరరీంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. ముఖ్యంగా వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అసలు చలికాలంలో రోజూ ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది
మీకు తెలుసా? చలికాలంలో మన ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోతుంది. దీనివల్ల దగ్గు, జలుబు, జ్వరంతో పాటుగా ఇన్ఫెక్షన్లు ఇతర జబ్బులు తరచుగా వస్తుంటాయి. అయితే వెల్లుల్లిని ఈ సీజన్ లో రోజుకు రెండు తిన్నా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది.
వెల్లుల్లిలో ఉండే క్రియాశీల సమ్మేళనం అల్లిసిన్ ఇందుకు సహాయపడుతుంది. అల్లిసిన్ లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని వైరస్లు, బ్యాక్టీరియాతో పాటుగా ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
మీరు చలికాలంలో రోజూ ఉదయం పరిగడుపున 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే రోగనిరోధక శక్తి పెరిగి దగ్గు, జలుబు వంటి సమస్యలకు దూరంగా ఉంటారు.
బరువు తగ్గుతారు
ఇతర సీజన్ల కంటే చలికాలంలో బరువు ఎక్కువగా పెరిగిపోతారు. ఎందుకంటే చలికి ఎవ్వరూ వ్యాయామం చేయరు. ఉదయం లేట్ గా నిద్రలేచి పనులకు వెళ్లిపోతుంటారు. అందులోనూ ఈ కాలంలో సోమరితనం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్ లో బాగా బరువు పెరుగుతారు.
అయితే ఈ సీజన్ లో మీరు రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే మాత్రం ఖచ్చితంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అవును వెల్లుల్లిని రోజూ తింటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
అలాగే వెల్లుల్లి మీ కడుపులో ఉన్న బ్యాక్టీరియాను సమతుల్యం చేస్తుంది. మీ జీర్ణక్రియను సరిగ్గా ఉంచి కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను రాకుండా చేస్తుంది. అలాగే వెల్లుల్లి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా మన మెటబాలిజాన్ని పెంచుతుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు.
కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది
శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం మంచిది కాదు. అయితే వెల్లుల్లి దీన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. రోజూ వెల్లుల్లిని తింటే శరీరంలో ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అంతేకాదు ఇది మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటె గుండె ఆరోగ్యం బాగుంటుంది. గుండె జబ్బులొచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
garlic
శరీరం నిర్విషీకరణ చెందుతుంది
వెల్లుల్లిని తింటే శరీరంలోని హానికరమైన విషపదార్థాలు బయటకు పోతాయి. వెల్లుల్లి శరీరం లోపలి భాగాన్ని శుభ్రపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీతో మన శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
వెల్లుల్లిని ఎలా తినడం మంచిది?
రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మెత్తగా నూరండి. ఒక నిమిషం పాటు అలాగే ఉంచి ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగండి.