మైత్రీ మూవీ మేకర్స్ బినామీలకు అడ్డా?.. తీగలాగితే డొంక కదులుతున్న వైనం? తెరవెనుక పొలిటికల్ లీడర్స్?

First Published Apr 23, 2023, 3:23 PM IST

టాలీవుడ్‌లో టాప్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌గా రాణిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వివాదాల్లో ఇరుక్కుంది. భారీ సినిమాల నిర్మాణం వెనక, పెట్టుబడుల వెనక భారీ అవకతవకలు జరిగినట్టు ఐటీ రైట్స్ లో తెలుస్తుంది. 
 

టాలీవుడ్‌లో బడా నిర్మాణ సంస్థగా రాణిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇందులో వందల కోట్ల డొల్లతనం బయటపడినట్టు తెలుస్తుంది. మూడు రోజులు ఐటీ రైడ్స్ టాలీవుడ్‌ని షేక్‌ చేశాయి. మైత్రీ మూవీస్‌తోపాటు సుకుమార్‌ రైటింగ్‌, ఆయన ఇంటిపై కూడా ఐటీ సోదాలు జరిగాయి. మైత్రీతో సుకుమార్‌ కంటిన్యూగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఆయనపై కూడా ఆరా తీసింది ఐటీ. అందుకే దాడులు చేశారు. అయితే ప్రధానంగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ టార్గెట్‌గానే ఈ రైడ్స్ జరిగినట్టు సమాచారం. విదేశాల నుంచి వచ్చిన ఐదు వందల కోట్ల ఎక్కడివి అనే లెక్కలపై ఆరా తీసినట్టు సమాచారం. అదే సమయంలో ఈ సంస్థలో ఎవరెవరు పెట్టుబడి పెట్టారనేది కూడా ఐటీ అధికారులు ఆరా తీసినట్టు తెలుస్తుంది. ప్రధాన మీడియా మాధ్యమాల నుంచి అందిన సమాచారం మేరకు.. తీగ లాగితే డొంక కదిలినట్టు అనేక కోట్ల లావాదేవీలకు సంబంధించిన సరైన పత్రాలు లేవని టాక్‌. ట్యాక్స్ లు ఎగ్గొట్టినట్టుగా ఐటీ అధికారులు గుర్తించారట. 

ఈ సంస్థని వెనకాల ఉండి నడిపించేది ఎన్‌ఆర్‌ఐలు, రాజకీయ నాయకులని తెలుస్తుంది. బినామీలకు ఈ సంస్థ అడ్డాగా మారిందని ఐటీ రైట్స్ లో ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటపడినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఏపీకీ చెందిన ఓ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అలాగే హైదరాబాద్‌ కి చెందిన ఓ ఎమ్మెల్యే ఇందులో పెట్టుబడులు పెట్టారని తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యే హైదరాబాద్‌ లోని సెంట్రల్‌లో అత్యంత ఖరీదైన నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అని సమాచారం. వీరితోపాటు మరికొందరు రాజకీయ నేతలు ఇందులో పెట్టుబడులు పెట్టారని తెలుస్తుంది. 
 

Latest Videos


దీంతోపాటు వందల కోట్లు విలువ చేసే భూములను ఐటీ అధికారులు గుర్తించారట.  కొన్నేళ్లలో మైత్రీ నిర్మాతలు మొయినాబాద్, శంకర్ పల్లి లాంటి ప్రాంతాల్లో వందల కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఐటీ రైట్స్ లో ఆ వివరాలన్నీ బయటపడినట్టు టాక్‌. అలాగే మైత్రి నిర్మాతలు నవీన్, రవిశంకర్.. భారీ చిత్రాల నిర్మాణం కోసం ముంబైలో ఫైనాన్షియర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తెచ్చినట్లు తెలుస్తోంది. ఆ లావాదేవీలకు సంబంధించిన సరైన డాక్యుమెంట్స్ లేవని ఐటి అధికారులు గుర్తించారట. ఎన్‌ఆర్‌ఐల నుంచి వచ్చే డబ్బుకి కూడా లెక్కల్లేవని, అవి ఎవరివి అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారట.

చాలా వరకు బ్లాక్ మనీని విదేశాల నుంచి తెప్పించి సినిమాల్లో ఇన్వెస్ట్ చేసి, దాన్నుంచి రియల్‌ ఎస్టేట్‌లోకి మళ్లిస్తున్నారట. ఇలా బ్లాక్ మనీని వైట్‌గా చేసే ప్రక్రియ మైత్రీ సంస్థ ద్వారా పెద్ద ఎత్తున జరుగుతుందని టాక్‌. నిబంధనల్ని ఉల్లంఘించి విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. వీటన్నింటిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో దర్శకుడు సుకుమార్ వ్యక్తిగత ఆస్తుల గురించి కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారట. పుష్ప చిత్రం కోసం మైత్రి సంస్థతో సుకుమార్ ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారో తెలపాలని కోరినట్లు తెలుస్తోంది. 

ఈ దాడులు ఇంతటితో అయిపోలేదని, దీని వెనకాల ఈడీ కూడా ఉందని, ఐటీ, ఈడీ సంయుక్తంగా ఈ దాడులు చేసినట్టు, ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు సమాచారం. మున్ముందు కూడా ఈ దాడులు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ దాడుల నేపథ్యంలో నిర్మాత నవీన్‌ ఎర్నేని అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆయన బీపీ లెవల్స్ పడిపోయి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ ఐటీ దాడుల వెనకాల రాజకీయం కోణం ఉందా? లేక నిజంగానే అవకతవలు జరిగాయా? అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే మైత్రీ మూవీ మేకర్స్ లో ప్రధానంగా నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌, సీవీఎం మోహన్‌ నిర్మాతలుగా ఉండేవారు. మోహన్‌ ఇప్పుడు కనిపించడం లేదు. ప్రధానంగా రవిశంకర్, నవీన్‌ చూసుకుంటున్నారు. చెర్రీ(చిరంజీవి) ఈ సంస్థకి సీఈవోగా ఉన్నారు. సినిమాల నిర్మాణంలోని లోతులు పెద్దగా తెలియని నవీన్‌, రవిశంకర్.. చెర్రీ సహకారంతో ప్రొడక్షన్‌ స్టార్ట్ చేశారు. సినిమాలని సెట్‌ చేయడంలో చెర్రీదే ముఖ్య పాత్ర. 2015లో మహేష్‌బాబు హీరోగా వచ్చిన `శ్రీమంతుడు` చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది మైత్రీ. ఆ తర్వాత వరుసగా పెద్ద పెద్ద స్టార్స్ తో సినిమాలు చేశారు. ఎన్టీఆర్‌తో `జనతా గ్యారేజ్‌`, రామ్‌చరణ్‌తో `రంగస్థలం`, నాగచైతన్య `సవ్యసాచి`, రవితేజ `అమర్‌ అక్బర్‌ ఆంటోనీ`, సాయిధరమ్‌ తేజ్‌ `చిత్రలహరి`, నాని `గ్యాంగ్‌ లీడర్‌`, `మత్తువదలరా`, `ఉప్పెన`, అల్లు అర్జున్‌ `పుష్ప`, మహేష్‌ `సర్కారు వారి పాట`, నాని `అంటే సుందరానికి`, `హ్యాపీ బర్త్ డే`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, చిరంజీవితో `వాల్తేర్‌ వీరయ్య`, బాలకృష్ణతో `వీరసింహారెడ్డి`, కళ్యాణ్‌ రామ్‌తో `అమిగోస్`, అలాగే `మీటర్‌` వంటి చిత్రాలు నిర్మించాయి. ఇప్పుడు `ఖుషి`, `పుష్ప2`, పవన్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, `ఎన్టీఆర్‌ 31`, `ఆర్సీ16` చిత్రాలను నిర్మించబోతుంది. 

అయితే రావడం రావడంతోనే భారీ రేంజ్‌లో వచ్చిందీ నిర్మాణ సంస్థ. ప్రారంభంలోనే దాదాపు అందరు స్టార్‌ హీరోలకు, స్టార్‌ డైరెక్టర్లకి బ్లాంక్ చెక్కులిచ్చి సినిమా చేయాలనే అగ్రిమెంట్లు చేసుకున్నారు. దీంతో టాలీవుడ్‌లో ఓ అలజడి కనిపించింది. కానీ ఎవరూ దీనిపై దృష్టి పెట్టలేదు. పెద్ద బ్యానర్లు గా ఉన్న సురేష్‌ ప్రొడక్షన్‌, గీతా ఆర్ట్స్ వంటి ఎన్నో పెద్ద నిర్మాణ సంస్థలు సైతం సినిమాల్లో లాభాలు లేక నిర్మించడం తగ్గించాయి. ఆచితూచి సినిమాలు చేస్తున్నాయి. కానీ అనూహ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ ఒకేసారి భారీ చిత్రాలు, వందల కోట్ల సినిమాలను తెరకెక్కించడంతో అందరిని ఆశ్చర్యపరిచింది. తాజా పరిణామాలు అందరిని షాక్‌కి గురి చేస్తున్నాయి. మరి మున్ముందు ఇంకా ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయో చూడాలి. 
 

click me!