`2018` మూవీ తెలుగు రివ్యూ, రేటింగ్‌

First Published | May 25, 2023, 11:57 AM IST

2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో రూపొందిన చిత్రం `2018`. టొవినో థామస్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటికే విడుదలై సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాని నిర్మాత బన్నీ వాసు తెలుగులో విడుదల చేస్తున్నారు. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

సునామి కోస్టల్‌ ఏరియాని ఎలా ముంచెత్తిందో, హైదరాబాద్‌ లో వరదలు జనాన్ని ఎంతగా అతలాకుతలం చేసిందో. ఆ సమయంలో జనం ఎంతగా ఇబ్బంది పడ్డారో మనం ప్రత్యక్షంగా చూశాం. అలానే 2018లో కేరళలో వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. జనం అనేక అవస్థలు పడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. చాలా వరకు ఒకరికొకరు సహాయం చేసుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ జరిగిన నష్టం వర్ణించలేనిది. ఈ యదార్థ ఘటనలతో తాజాగా `2018` సినిమాని సర్వైవల్‌ థ్రిల్లర్‌గా రూపొందించారు దర్శకుడు జూడో ఆంటోనీ జోసెఫ్‌. వరదల నేపథ్యంలో మన ఇండియన్‌ సినిమాలో మూవీస్‌ రావడం చాలా అరుదు. రాలేదనే చెప్పాలి. ఫస్ట్ టైమ్‌ ఓ ప్రయోగం జరిగింది. మలయాళంలో `2018`(ఎవ్రీ వన్‌ ఈజ్‌ ఏ హీరో) సినిమా ఈ నెల ప్రారంభంలో మే 5న విడుదలై అక్కడ సంచలన విజయం సాధించింది. వంద కోట్లు కలెక్ట్ చేసి అక్కడ ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇందులో టొవినో థామస్‌, తన్వి రామ్‌, అసిఫ్‌ అలీ, బోబన్‌, అపర్ణ బాలమురళి, వినీత్‌ శ్రీనివాసన్‌, కళైయరాసన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాని ఇప్పుడు తెలుగులోనూ తీసుకొస్తున్నారు నిర్మాత బన్నీవాసు. ఈ నెల 26న సినిమాని రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో, మలయాళ ఆడియెన్స్ ని ఆకట్టుకున్నట్టే తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తుందా? అనేది రివ్యూలో చూద్దాం. 
 

కథః 

ఈ సినిమా వరదల బ్యాక్‌ డ్రాప్‌లో ప్రధానంగా ఐదుగురి ఫ్యామిలీస్‌ కథలను తెలియజేసే చిత్రం. వరదల కారణంగా వాళ్లు ఎలా సఫర్‌ అయ్యారు, ఎలా సర్వైవ్‌ అయ్యారు, ఏం చేశారనేది ఈ సినిమా కథ. కథలోకి వెళితే.. టొవినో థామస్‌.. సినిమాల్లో చూసి ఆవేశంలో ఆర్మీలో జాయిన్‌ అవుతాడు. కానీ కళ్లముందే ఇద్దరు జవాన్లు చనిపోవడంతో ఆ భయంతో తిరిగి ఇంటికొస్తాడు, అతన్ని ఊర్లో అంతా ఎగతాళి చేస్తుంటారు.వేరే జాబ్‌ ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో కొత్తగా ఊరికొచ్చిన టీచర్‌ని తన్వి రామ్‌ని చూసి ఇష్టపడతాడు, ఎట్టకేలకు పెళ్లి కూడా ఫిక్స్ చేసుకుంటాడు. ఆ ఏర్పాట్లలో బిజీగా ఉంటాడు. 

మరోవైపు అసిఫ్‌ అలీ.. తన నాన్న లాల్‌, అన్న నరెన్‌ మత్య్సకారులుగా జీవనం సాగిస్తుంటారు. తను మోడల్‌గా ప్రయత్నాలు చేస్తాడు. తాను ప్రేమించిన అమ్మాయిని సంబంధం కోసం వెళితే అమ్మాయి వాళ్ల నాన్న దారుణంగా అవమానిస్తాడు. దీంతో ఆ ఫ్యామిలీ మొత్తం బాధపడుతుంటుంది. ఇంకోవైపు కుంచక్కు బోబన్‌.. ప్రభుత్వ అధికారి. తన కూతురి పుట్టిన రోజుకి గిఫ్ట్ తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ కేరళలో బ్యాక్‌ టూ బ్యాక్ ఏర్పడ్డ తుఫానుల కారణంగా సహాయక చర్యల్లో భాగంగా కంట్రోల్‌ రూమ్‌ నిర్వహిస్తుంటాడు. తాను వస్తాడని భార్య, కూతురు ఆశగా ఎదురుచూస్తుంటారు. 

అదే కాదు.. వినీత్‌ శ్రీనివాసన్‌.. ఓ సాఫ్ట్ వేర్‌ ఎంప్లాయ్‌.. భార్యతో గొడవలు, తాను కాపురానికి రాదు. ఆ విషయం అమ్మకి తెలియకుండా మ్యానేజ్‌ చేస్తుంటాడు, భార్య రాక ఆయన మదన పడుతుంటారు. కలైయరాసన్‌.. ఓ లేబర్‌ కార్మికుడు. డబ్బులు లేక, ఇంటిని పట్టించుకోక తిరుగుతుంటాడు. తనకు బ్లాస్టింగ్ చేసేందుకు బాంబ్‌లు తరలించే పని వస్తుంది. రిస్క్ అయినా డబ్బుల కోసం వాటిని తీసుకుని బయలుదేరతాడు. అపర్ణ బాలమురళి.. న్యూస్‌ ఛానెల్‌లో హెడ్‌గా ఉంటుంది. తమ ఛానెల్‌ని జనం చూడాలంటే మంచి బ్రేకింగ్‌ లాంటి వార్తల కోసం తపిస్తుంటుంది. వీరందరి జీవితాలను వరదలు తలకింద్రులు చేస్తాయి. ఆ వరదల వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి? వరదల నుంచి తప్పించుకున్నారా? అక్కడ ఎలా సర్వైవ్‌ అయ్యారు? ఈ క్రమంలో చోటు చేసుకున్న విషాద సంఘటనలు ఏంటి? అనేది మిగిలిన కథ. 
 

Latest Videos


విశ్లేషణః

మన తెలుగు రాష్ట్రాల్లో వరదలు కొత్తకాదు. ఏపీలో కోస్తా ప్రాంతంలో ఎప్పుడూ వరదలు వస్తూనే ఉంటాయి. సునామీ లాంటి భీభత్సాలను చూశారు జనం. మరోవైపు తెలంగాణలోనూ వరదలు జనాన్ని ఇబ్బంది పెట్టాయి. హైదరాబాద్‌ వరదలు తీవ్ర నష్టాలను తీసుకొచ్చాయి. ఈ సినిమా చూస్తుంటే ఆయా సంఘటనలే, ఆ పరిస్థితులే గుర్తుకొస్తాయి. అలా ఇది యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న స్టోరీగా నిలిచింది. మనకు కనెక్ట్ అవుతుంది. అందుకే ఇది సంచలన విజయం సాధించింది. ఎమోషన్స్ కి, మనుగడ కోసం చేసే పోరాటం ఎక్కడైనా ఒక్కటే, ఈ సినిమా అందరికి కనెక్ట్ కావడానికి అదే ముఖ్య కారణం. అదే పాయింట్‌ని నమ్ముకుని నిర్మాత బన్నీవాసు తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు.
 

సినిమాలో మొదటి భాగం మొత్తం కథని, ముఖ్యంగా పాత్రలను ఎస్టాబ్లిష్‌ చేయడానికే ప్రయారిటీ ఇచ్చాడు దర్శకుడు. దానికి పారలల్‌గా వరదలు, వర్షాలను మరోవైపు చూపిస్తున్నాడు. పాత్రల మధ్య రిలేషన్స్, సంఘర్షణ మరింత ముదురుతుంటే, మరోవైపు వర్షాలు తీవ్రమవుతుంటాయి. అవి కాస్త పెను తుఫానులా మారుతుంటాయి. నెమ్మదిగా ఆ ఇంటెన్సిటీని పెంచుతూ, సరదా సన్నివేశాల నుంచి సీరియస్‌ నెస్‌ని పెంచుతూ ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ప్రతి సన్నివేశాన్ని చాలా డిటెయిలింగ్‌గా చూపించారు. ఆ డీటెయిలింగ్‌లోకి వెళ్లే క్రమంలో కథ కొంత నెమ్మదిస్తుంది. అదే సమయంలో ప్రారంభంలో కొంత కన్‌ఫ్యూజన్‌ ఏర్పడుతుంది. ఏ పాత్ర ఎవరు, ఏం చేస్తున్నారనేది అర్థం చేసుకోవడానికి, మనకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఇంటర్వెల్‌ వచ్చే వరకు ఓ క్లారిటీ వస్తుంది. 

అయితే ప్రధానంగా ఐదుగురు ప్రధాన పాత్రల తాలుకూ జీవితాలు, ఫ్యామిలీల సంఘర్షణ, వరదలకు ముడిపెట్టిన తీరు, వాటిని అంతే స్ఫూత్‌గా తెరకెక్కించిన తీరు మాత్రం ఆకట్టుకుంది. సినిమాలో ఉన్నోడు, లేనోడు అనేది ఏం లేదు, వరదలు పెరిగాక అందరి పరిస్థితి ఒక్కటే. ప్రాణాలు కాపాడేందుకు చేసే పోరాటమే. సొంత ఇళ్లు లేదు, చేసే పనేంటో క్లారిటీ లేదు, ఎలా పిల్లని ఇవ్వాలన్నా ఆహాంకారాన్ని ఈ సినిమా పటాపంచలు చేసింది. చివరికి వారి చేతనే ప్రాణాలు కాపాడేలా చేస్తుంది. ఎవరో వస్తారు, మనల్ని కాపాడతారు అనే ఎదురుచూడటం కాదు, తామే తమ ప్రాణాలు కాపాడుకోవాలి, తామే ఇతరులను కాపాడాలని సందేశాన్ని ఇచ్చే చిత్రమిది. 
 

సినిమా ఓ ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌. ప్రతి పాత్రలోనూ, ప్రతి సన్నివేశంలోనూ ఓ ఎమోషన్స్ ఉంటాయి. అంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ రిలేషన్స్ గొప్పతనాన్ని తెలియజేశాడు దర్శకుడు. ప్రతి సీన్‌లోనూ ఏదో ఒక కనెక్టింగ్‌ పాయింట్‌తో ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేశాడు.  క్లైమాక్స్ కి వెళ్లే కొద్ది ఎమోషనల్‌ డోస్‌ పీక్‌లోకి వెళ్తుంది. గుండెలు బరువెక్కుతాయి. మనమే ఆ వేదన అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది, మనమే ఆ వరదల్లో ఇరుక్కున్నట్టు ఉంటుంది, మనమే రంగంలోకి దిగి ఇతరుల ప్రాణాలు కాపాడుతున్నట్టు ఉంటుంది. మనమే ఆ విషాదంలో మునిగినట్టు ఉంటుంది, చివరికి మనమే దాన్నుంచి రిలీఫ్‌ అయినట్టు అనిపిస్తుంది. చివరి అరగంట మనల్ని మనం మర్చిపోతాం. అంతగా హృదయాలను బరువెక్కిస్తుంది. మరోవైపు సినిమాలో మెలో డ్రామా  ఎక్కువైనట్టుగా ఉంటుంది. కొన్ని సీన్లలో ఓవర్‌గా అనిపిస్తుంది. చిన్న సంఘటనకే పెద్దగా రియాక్ట్ అయిన తీరు కాస్త శృతి మించినట్టుగా ఉంటుంది. 

నటీనటులు, టెక్నీషియన్లు..

నటీనటుల పరంగా వంక పెట్టడానికి లేదు. ఏ పాత్రకి వాళ్లు సెట్‌ అయ్యారు. అంతే సహజయంగా, అంతే బాగా చేశారు. సినిమాలో ప్రత్యేకంగా హీరో లేడు, ప్రతి పాత్రనే హీరో, ఇంకా చెప్పాలంటే కథే హీరో. వర్షాలు, వరదలే విలన్‌. టివోలి థామస్‌ పాత్ర, లాల్‌ పాత్రలు మన గుండెల్ని పిండేస్తాయి. అలాగే బోబన్‌, ఆసిఫ్‌ అలీ, అపర్ణ, తన్వి, ఇలా అందరు ఆకట్టుకుంటారు. పాత్రల్లో జీవించారు. టెక్నీకల్‌గా ఇదొక బ్రిలియంట్‌ మూవీగా చెప్పొచ్చు. ఈ సినిమాలో అంత్యంత కష్టమైన పని కెమెరా వర్క్ దే. దర్శకుడి విజన్‌ని అంతే బాగా, అంతే అద్భుతంగా క్యాప్చర్‌ చేశారు. ఇంకా చెప్పాలంటే విజువల్సే సినిమాకి ప్రధాన బలం. ఓ విజువల్‌ ట్రీట్‌లా సినిమా వచ్చిందంటే కెమెరామెన్‌ పడ్డ కష్టమే అని చెప్పాలి.  సినిమాటోగ్రాఫర్‌ అఖిల్‌ జార్జ్ ని అభినందించాల్సిందే. చమన్‌ చక్కో ఎడిటిగ్‌ సూపర్బ్. అనేక కథలను అంతే బ్యాలెన్సింగ్‌గా చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. ఇక దర్శకుడు ఆంటోని ఈ కథని సినిమాగా తీయాలనుకోవడమే పెద్ద ఛాలెంజ్‌. దాన్ని అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. దానికి కారణం ఆయన స్వయంగా 2018 కేరళ వరదల అనుభవాలను చూశాడు కాబట్టి దాన్ని బాగా తీయగలిగాడు. నిర్మాణ విలువలు సూపర్‌. ఈ సినిమాని నిర్మించడంలోనే వాళ్లు సక్సెస్‌ అయ్యారు. తెలుగులో అంతే క్వాలిటీగా తీసుకొచ్చాడు నిర్మాత బన్నీవాసు. 
 

ఫైనల్‌గాః  `2018` సినిమా అంతర్లీనంగా మనషుల మధ్య అనుబంధాలను, ఫ్యామిలీ రిలేషన్స్ గొప్పతనాన్ని చాటి చెప్పింది. కష్టాల్లో అందరు సమానులే అని, ఇతరులకు సాహయం చేయాలనేది సందేశాన్నిస్తుంది. 

రేటింగ్‌ః 3

నటీనటులు : టోవినో థామస్, లాల్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, తన్వి రామ్, అపర్ణ బాల మురళి, కున్‌చకో బోబన్, అజు వర్గీస్, నరైన్, కలైయారసన్ తదితరులు
ఛాయాగ్రహణం : అఖిల్ జార్జ్
సంగీతం : నోబిన్ పాల్
నిర్మాతలు : వేణు కున్నప్పిళ్లై, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్
తెలుగులో విడుదల : 'బన్నీ' వాస్
రచన, దర్శకత్వం : జూడ్ ఆంథనీ జోసెఫ్
 

click me!