'బాలికల చదువు – దేశ భవితకు వెలుగు'.. హైదరాబాద్‌లో క్రై వాక్ టు ఎంపవర్ హర్..

First Published | Nov 25, 2024, 12:38 AM IST

CRY – Child Rights and You: బాలికలు చదువుకుంటే దేశానికి మార్గదర్శకులవుతారని కాంతి వెస్లీ అన్నారు.  చదువు నాకు స్వేచ్ఛనిచ్చింది, ధైర్యాన్నిచ్చింది, నన్ను సాధికారం చేసిందని  మిస్ ఇండియా 2020 మానస వారణాసి పేర్కొన్నారు. 
 

CRY – Child Rights and You

CRY – Child Rights and You: "బాలికలు చదువుకుంటే కుటుంబానికి మాత్రమే కాదు దేశానికే మార్గదర్శకులు అవుతారు" అని తెలంగాణ మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ డైరెక్టర్ శ్రీమతి ఎ. నిర్మల కాంతి వెస్లీ పేర్కొన్నారు. చదువు విషయంలో ఇబ్బందులు పడుతున్న బాలికలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. "బాలికల పూర్తి చదువు – దేశ భవితకు వెలుగు" నినాదంతో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ క్రై - చైల్డ్ రైట్స్ అండ్ యు (CRY) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో ‘వాక్ టు ఎంపవర్‌ హర్’ (బాలికలను సాధికారం చేద్దాం - Walk to EmpowHER) పేరుతో అవగాహన నడక నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి నిర్మల కాంతి వెస్లీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "తెలంగాణలో స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖను కూడా నిర్వహిస్తున్నారు. చదువుకోవడానికి మేం స్కూలుకు వెళ్లలేకపోతన్నాం అంటున్న బాలికల ఇబ్బందులను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. అలాగే బాలికల చదువును ప్రోత్సహించడానికి మహిళా, శిశు సంక్షేమ శాఖ విభాగంలో అనేక పథకాలు అమలవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ‘బేటీ పఢావో బేటీ బచావో’ అనే కార్యక్రమం అమలు చేస్తోంది. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూళ్లలో లక్షాయాభై వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బాలికలు ఎవరైనా చదువుకోవడానికి కష్టపడుతున్నామంటే చెప్తే మహిళా శిశు సంక్షేమ శాఖ వారికి తప్పకుండా తోడ్పాటునందిస్తుంది. బాలికల చదువు ప్రాధాన్యత గురించి అవగాహన పెంపొందించడానికి క్రై చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయం. కష్టాలకు ఎదురు నిలిచి చదువులో ముందుకు సాగిన కావ్య వంటి బాలికలు తెలంగాణ ప్రభుత్వం బాలికల చదువుకోసం అమలుచేస్తున్న కార్యక్రమాలకు స్టార్ క్యాంపెయిన్‌లుగా ఉండాలి" అని తెలిపారు. 
 
 

CRY – Child Rights and You

ఈ కార్యక్రమంలో విశిష్ట అతధిగా పాల్గొన్న ప్రముఖ నటి, మిస్ ఇండియా 2020 మానస వారణాసి మాట్లాడుతూ.. షఒక ఆడపిల్లగా చదువు అనేది నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చింది. చాలా ధైర్యమిచ్చింది. చదువు నన్ను సాధికారం చేసింది. ప్రతి ఆడపిల్లకీ ఈ స్వేచ్ఛ, దైర్యం అనేది చాలా ముఖ్యం. చదువుతో బాలికలు సాధికారమవుతారు" అని చెప్పారు. "అందరికీ నాణ్యమైన విద్య అవసరం. కానీ అది అందరికీ అందుబాటులో లేదు. అందులోని అసమానతలు నేను చదువుకునే సమయంలో నాకు తెలిసివచ్చాయన్నారు".

చాలా మంది బాలికలు తమ చదువు విషయంలో, తమ స్వప్నాలను సాకారం చేసుకోవడానికి ముందుకు సాగే విషయంలో అనేక ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆ విషయం నాకు తెలుసు. బాలికలందరికీ చదువు కొనసాగించడానికి మద్దతు అవసరం. ఇందుకోసం నేను మిస్ ఇండియా హోదాలో నా మద్దతును అందిస్తున్నాను. ఈ విషయంలో క్రై సంస్థ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకం. బాలికలను సాధికారం చేసే ప్రయాణంలో మీతో నేను ఉన్నాను" అని ఆమె చెప్పారు. 

Latest Videos


CRY – Child Rights and You

ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన నటి దివ్య శ్రీపాద మాట్లాడుతూ.. "చదువు అనేది కనీస హక్కు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత, నాగరికతగా ఇంత పురోగతి సాధించాక కూడా దీని గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉండటం విచారకరం. బాలికలకు కనీసం ప్రాధమిక చదువును కొనసాగించలేకపోతున్నారని మనం ఇంకా పోరాడాల్సి వస్తోంది. దీనిని ప్రగతి అనలేం. చదువు అనేది బాలికలు, వారి కుటుంబాలు, వారి సమాజాలను ప్రాధమికంగా మెరుగుపరచే ఒక ఆయుధం. చదువుతో స్వేచ్ఛాభద్రతలు లభిస్తాయి. బాలికలందరూ చదువుకొనసాగించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి" అని చెప్పారు.  

మరో అతిథి నటి శ్రీవిద్య మహర్షి మాట్లాడుతూ.. "బాలికల చదువు అనేది సామాజికంగా, ఆర్థికంగా ఒక స్థాయి, హోదా గల వారికి సంబంధించిన విషయంగా ఉండిపోయింది. ఈ పరిస్థితులను మార్చడానికి మనం చేయగలిగినదంతా చేయాలి. అప్పుడే ప్రపంచం మెరుగవుతుంది" అని పేర్కొన్నారు.  తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేశ్ మాట్లాడుతూ.. "మనం మనకు సాధ్యమైనంత మేరకు సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరముంది. మన పరిసరాల్లో ఉన్న ఒక చిన్నారికి మద్దతు అందించడానికి మనం ప్రయత్నించాలి. ముందు ముందు మంచి రోజులు వచ్చాక సాయం చేద్దాంలే అని ఎదురుచూస్తూ అలక్ష్యం చేయవద్దు" అని కోరారు. 

CRY – Child Rights and You

క్రై సౌత్ ప్రోగ్రామ్స్ విభాగం జనరల్ మేనేజర్ పీటర్ సునీల్ మాట్లాడుతూ.. "ప్రాధమిక విద్యలో బాలికల నమోదును పెంచడంలో భారతదేశం గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, ఆపై తరగతులలో బాలికల నమోదు ఇంకా తక్కువగానే ఉంది. డ్రాప్ అవుట్ రేట్లు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. UDISE + (2021-22) గణాంకాల ప్రకారం, ప్రతి ఐదుగురిలో ముగ్గురు మాత్రమే ఉన్నత పదో తరగతి దాటి చదువు కొనసాగించగలుగుతున్నారు. ఇందుకు పేదరికం, లింగ వివక్ష, కుల వివక్ష, ప్రాంతీయ అసమానతలతో పాటు సామాజిక-ఆర్థిక అవరోధాలు కారణంగా ఉన్నాయి. ఇవి బాలికలు వయసు పెరిగే కొద్దీ చదువుకు దూరమయ్యేలా చేస్తున్నాయి. బాలికలు ఇలా పాఠశాలలకు దూరమవడం వల్ల.. బాల్య వివాహాలు, చిన్నవయసులోనే తల్లులవడం, బాల కార్మికులుగా మారడం, అక్రమ రవాణాకు గురవడం వంటి ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. భారతదేశంలోని బాలికలందరూ 18 ఏళ్ల వయసు వరకూ చదువుకునేలా, స్కూళ్లు, కాలేజీల్లో కొనసాగేలా చూడడం లక్ష్యంగా క్రై సంస్థ ఈ ఏడాది ‘పూరీ పఢాయి – దేశ్ కీ భలాయి’ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా ‘వాక్ టు ఎంపవర్ హర్’ అవగాహన నడకలు నిర్వహిస్తోంది. బాలికలు పూర్తిగా చదువుకునేలా పరిస్థితులను మెరుగుపరచటం కోసం ప్రభుత్వ విభాగాలు, కార్పొరేట్ సంస్థలు, పౌర సమాజాలతో కలిసి క్రై సంస్థ పని చేస్తోంది" అని వివరించారు. 

క్రై వలంటీర్ సపోర్ట్ జనరల్ మేనేజర్ అనుపమ ముహూరి మాట్లాడుతూ.. క్రై సంస్థ ఏటా దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 4.5 లక్షల మంది చిన్నారుల జీవితాలను మెరుగుపరచేందుకు కృషి చేస్తోందని చెప్పారు. "అందరూ కలిసి వ్యవస్థీకృత అవరోధాలను పరిష్కరిస్తూ, ప్రత్యక్షంగా మద్దతు అందించడం ద్వారా జీవితాలను మార్చవచ్చునని ఇది నిరూపిస్తోంది" అని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో పోనుగంటి కావ్య, తలకొండ వసంత, గోల్కొండ అఖిల, జ్యోత్స్నలు.. తమ చదువు కొనసాగించడంలో పేదరికం, లింగ వివక్ష వంటి సమస్యలు ఎలా అవరోధంగా నిలిచాయి, వాటిని అధిగమించి తాము ఎలా చదువు కొనసాగిస్తున్నామో వివరించారు. వారి స్వీయ అనుభవాలు స్ఫూర్తినిచ్చాయి. క్రాంతి కళాబృందం సాంస్కృతిక ప్రదర్శనలతో బాలికల చదువు ప్రాధాన్యతను సృజనాత్మకంగా చాటిచెప్పింది. ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు, విద్యార్థులు, ఉద్యోగులు, పౌర సమాజ సభ్యులు సహా అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమంలో ఒక వేదికపైకి వచ్చారు. బాలికల చదువు కొనసాగించేలా ఉమ్మడిగా కృషి చేస్తామని ప్రతినబూనారు.

click me!