IPL2021: ఒకప్పుడు కడు పేదరికం.. ఇప్పుడు అష్టైశ్వర్యాలు.. ఐపీఎల్ తో మారిన ఈ క్రికెటర్ల జీవితాలు

First Published Oct 10, 2021, 5:04 PM IST

ఆ క్రికెటర్లంతా ఒకప్పుడు ఇంట్లో తినడానికి తిండి కూడా లేని దుర్భర పరిస్థితులను చూశారు. ఒక్కపూట తిని మరో పూటకు పస్తులుంటూ.. తమ బాధలను పంటి బిగువునే భరించారు. కొంతమంది రోజు గడవడానికి చిన్న వయసులోనే దినసరి కూలీలుగానూ మారారు. కానీ తమకు వచ్చొచ్చిన ఆటలో రాత్రి పగలు కష్టపడి తమను తాము మెరుగుపర్చుకున్నారు. అవకాశాలు రావడమే తరువాయి.. వారంటే ఏంటో నిరూపించుకున్నారు. ఐపీఎల్ కు ముందు కడు పేదరికంలో ఉండి ఆ తర్వాత రాయల్ లైఫ్ అనుభవిస్తున్న ఈ క్రికెటర్ల గురించి తెలుసుకోండి. 

ప్రపంచంలోనే అత్యంత ధనవంత క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐ ఆధ్వర్యంలో  ఏడాదికోసారి నిర్వహించే ఐపీఎల్ నిర్మొహమాటంగా క్యాష్ రిచ్ లీగ్.  ఒక్కసారి ఈ లీగ్ లో మెరిస్తే చాలు.. లైఫ్ లో సెట్ అయినట్టే. తర్వాత సీజన్ లో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల వెంటపడుతాయి. అప్పటిదాకా ఇంట్లో టీవీ కూడా లేనివాళ్లు ఏకంగా.. డూప్లెక్స్ లో అత్యంత ఖరీదైన టీవీలలో మ్యాచ్ లు వీక్షించొచ్చు. ఇలా ఏమీ లేని స్థితి నుంచి అన్నీ కలిగిన కొంత మంది క్రికెటర్లు ఇక్కడ ఉన్నారు. 

బుమ్రా: ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బాల్యం చాలా కష్టంగా గడిచేది. బుమ్రా తండ్రి జస్బీర్ సింగ్ అతడు ఐదేండ్ల వయసులోనే మరణించాడు. తల్లి లాలనలో పెరిగిన బుమ్రా.. క్రికెట్ ఆడటానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. చిన్నప్పుడు ఒకే డ్రెస్ వేసుకుని రోజూ క్రికెట్ ప్రాక్టీస్ కు వెళ్లేవాడు. మళ్లీ సాయంత్రం ఇంటికి రాగానే తిరిగి దానినే ఉతుక్కునేవాడు. కానీ 2013లో బుమ్రా జీవితం మారిపోయింది. ముంబై ఇండియన్స్ అతడిని రూ. 10 లక్షల కనీస విలువతో కొనుగోలు చేసింది. ఇక ఆ తర్వాత బుమ్రా వెనక్కితిరగలేదు. ఇప్పుడు ప్రతి సీజన్ కు బుమ్రా సంపాధన రూ. 6 కోట్లు (ఒక్క ఐపీఎల్ లోనే)గా ఉంది. 

టి.నజరాజన్: ఐపీఎల్ కు ఆడకముందు సన్ రైజర్స్ బౌలర్ నటరాజన్ కుటుంబ పరిస్థితి దుర్భరంగా ఉండేది. తమిళనాడుకు చెందిన నటరాజన్ నాన్న ఒక ఫ్యాక్టరీలో కార్మికుడు. అమ్మ హోటల్ నడిపేది. కుటుంబంలోని  ఆరుగురు తోబుట్టువులలో నటరాజన్ పెద్దవాడు. వారందరి పోషణ నటరాజన్ తండ్రికి తలకు మించిన భారమైంది. కానీ ఐపీఎల్ లో అడుగుపెట్టిన తర్వాత నటరాజన్ కుటుంబం ఒత్తిడి చెల్లాచెదురైంది. 2016 లో పంజాబ్ అతడిని రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ అతడిని రూ. 4 కోట్లు పెట్టి కొనుక్కుంది. 


చేతన్ సకారియా: ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న బౌలర్ చేతన్ సకారియా. సకారియా తండ్రి ట్రక్ డ్రైవర్. చిన్నప్పుడు సకారియా స్టేషనరీ షాపులో పనిచేసేవాడు. ఇంట్లో టీవీ లేకపోవడంతో అతడు పక్కింటికెళ్లి క్రికెట్ చూసేవాడు. రాజస్థాన్ రాయల్స్ ఈ యువబౌలర్ ను రూ. 1.2 కోట్లకు కొనుగోలు చేసింది. 

మహ్మద్ సిరాజ్: హైదరాబాదీ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ సిరాజ్ కూడా బాల్యం పేదరికంతోనే గడిపాడు. అతడి తండ్రి మహ్మద్ గౌస్ ఒక ఆటో రిక్షా డ్రైవర్. రోజంతా పనిచేసినా అతడికి వచ్చే ఆదాయం కుటుంబపోషణకు కూడా సరిపోకపోయేది. సిరాజ్ తొలి ఆదాయం రూ. 500. దేశవాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్  లో కూడా  మెరవడంతో అతడు వెలుగులోకి వచ్చాడు. 2016లో సన్ రైజర్స్ అతడిని రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ  తర్వాత ఆర్సీబీ రూ. 2.7 కోట్లకు కొనుక్కుంది. 

యశస్వి జైస్వాల్: రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న జైస్వాల్ కు చిన్నప్పట్నుంచే క్రికెట్ అంటే ఇష్టం. పదేళ్ల వయసులో ఇంట్లో చెప్పకుండా ముంబై పారిపోయి వచ్చిన జైస్వాల్.. అక్కడ చిన్న చిన్న దొంగతనాలు చేసి పోలీసుల చేతిలో దెబ్బలు కూడా తిన్నాడు. ముంబై వీధుల్లో పడుకునేవాడు. కానీ క్రికెట్ మీద ఆసక్తితో తన పేదరికాన్ని భరించాడు. 2013లో జైస్వాల్ లోని ప్రతిభను గుర్తించిన అతడి కోచ్.. మెరుగైన శిక్షణ ఇప్పించాడు. అనంతరం 2020 అండర్ 19 ప్రపంచకప్ లో అదరగొట్టిన ఈ యువ ఆటగాడు.. 2021 ఐపీఎల్ వేలంలో రూ. 2.4 కోట్లకు అమ్ముడుపోయాడు. 

పాండ్య సోదరులు: ఐపీఎల్ లో పాండ్యా బ్రదర్స్ గా గుర్తింపు పొందిన హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు కూడా బాల్యంలో చాలా కష్టాలు పడ్డారు. క్రికెట్ లోకి రాకముందు తినడానికి డబ్బుల్లేక పస్తులున్న రోజులు ఉన్నాయని ఈ ఇద్దరు క్రికెటర్లు చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. ఆ సమయంలో  రెండు రూపాయల మ్యాగీనే తిని బతికారు. 2015లో ముంబై ఇండియన్స్ హర్ధిక్ పాండ్యాను గుర్తించింది. ఆ సీజన్ లో రూ. 10 లక్షలకు పాండ్యాను కొనుగోలు చేసింది. ఇక 2018 నుంచి పాండ్యా జాతకమే మారిపోయింది. కృనాల్ కూడా ముంబై ఇండియన్స్ ప్లేయరే.. 

రింకు సింగ్: ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న రింకు సింగ్ తండ్రి గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేవాడు. అతడి నెల జీతం రూ. 6 వేలు. పదో తారీఖు వచ్చిందంటే ఇంట్లో కష్టాలు మొదలయ్యేవి. అప్పట్నుంచి మళ్లీ జీతం వచ్చేదాకా తిప్పలే.  ఎన్ని కష్టాలెదురైనా రింకు క్రికెట్ ను వదలలేదు.  2016 లో పంజాబ్ అతడిని రూ. 10 లక్షలకు కొన్నది. ఆ తర్వాతి సీజన్ లో కోల్కతా రూ. 60 లక్షలు వెచ్చించి రింకును సొంతం చేసుకుంది. 

నాథూ సింగ్: ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్,  ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన నాథూ సింగ్ తండ్రి రాజస్థాన్‌లోని వైర్ ఫ్యాక్టరీలో కార్మికుడు. సంపాదన అంతంతే. ఇంటినిండా కష్టాలే.  2016 లో తన మొదటి IPL సీజన్‌లో, అతడిని ముంబై ఇండియన్స్ రూ. 3.2 కోట్లకు కొన్నది.  కానీ ఆ సీజన్ లో పెద్దగా రాణించలేదు. దీంతో తర్వాత సీజన్‌లో గుజరాత్ లయన్స్ అతడిని రూ .50 లక్షలకు దక్కించుకోగా..  గత సీజన్ లో ఢిల్లీ అతడిని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.

కేరళ రాష్ట్ర జట్టులో రెగ్యులర్ సభ్యుడైన KM ఆసిఫ్ చాలా మందికి తెలియకపోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్  తరఫున పలు మ్యాచ్‌లు ఆడిన ఆసిఫ్ తండ్రి కూలీ. తల్లి గృహిణి. ఆమె సోదరుడు మానసిక వికలాంగుడు సోదరికి బ్రెయిన్ ట్యూమర్. ఐపీఎల్ కు ముందు దుబాయ్‌లోని బాట్లింగ్ ప్లాంట్‌లో స్టోర్ కీపర్‌గా పనిచేసేవాడు. కానీ క్రికెట్‌ పై ఉన్న మక్కువతో  ఉద్యోగాన్ని వదిలేసి కేరళకు తిరిగి వచ్చాడు. ఆపై CSK 2016 IPL వేలంలో అతడిని 40 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.

click me!