సింగపూర్ అనేది ఒక రాష్ట్ర-నగరం. ప్రపంచంలో ఇలాంటివి మూడు ఉన్నాయి. అవి వాటికన్ సిటీ, మొనాకో, చివరిది సింగపూర్. అంటే ఇవన్నీ స్వతంత్ర పాలన కలిగిన నగరాలన్న మాట. సింగపూర్ ఆగ్నేయ ఆసియాలోని ఒక ద్వీపం. ఈ నగరం మొత్తం విస్తీర్ణం 137 కి.మీ. మాత్రమే. సింగపూర్ ప్రధాన ద్వీపం కాగా, 63 ఉపగ్రహ ద్వీపాలు దీనికి ఉన్నాయి.
ప్రపంచంలోనే అతి పరిశుభ్ర నగరాల్లో ఒకటిగా సింగపూర్ పేరు పొందింది. సింగపూర్ పరిశుభ్రతను కొనసాగించడంలో చక్కటి విధానాలు పాటిస్తుంది. చెత్త, వ్యర్థాల నిర్వహణలో ఆ ప్రభుత్వం అత్యాధునిక విధానాలు అమలు చేస్తుంది. ఇలా వేస్ట్ ను కేవలం పక్కన పాడేయకుండా దాన్ని ప్రాసెసింగ్ చేసి వేరే అవసరాలకు ఉపయోగించుకుంటోంది. చిన్న నగరమైన సింగపూర్ లో ఇది సాధ్యమైంది. ఇండియాలో ఎందుకు సాధ్యం కావడం లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
సింగపూర్‌లో వ్యర్థాలను ఏం చేస్తారంటే..
ఇన్సినరేషన్ ప్లాంట్లు: సింగపూర్‌లో వ్యర్థాలను విద్యుత్తుగా మార్చే ఇన్సినరేషన్(కాల్చి బూడిద చేసే) ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్లు సుమారు 70% చెత్తను ఆవిరి చేస్తాయి. ఈ విధానం ద్వారా చెత్త పరిమాణాన్ని 90% తగ్గిస్తున్నారు. అంతేకాకుండా విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తున్నారు. దీని ద్వారా దేశంలోని 60 శాతం విద్యుత్తు అవసరాలు తీరుస్తున్నారు. మిగిలిన బూడిదతో సముద్రానికి దగ్గరగా ఉండే ఒక ప్రాంతాన్ని పూడ్చివేస్తున్నారు. ఈ ప్రాసెస్ ను వారు ల్యాండ్ ఫిల్ అంటారు.
రిసైక్లింగ్ ప్రోగ్రామ్స్: సింగపూర్ ప్రభుత్వం రిసైక్లింగ్‌పై ఎక్కువగా దృష్టి పెడుతుంది. నేషనల్ రిసైక్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలు ప్లాస్టిక్, కాగితం, గాజు, మెటల్స్ వంటి పదార్థాలను రిసైకిల్ చేసేలా ప్రోత్సహిస్తారు.
వేస్ట్ సెగ్రిగేషన్: సింగపూర్ లో చెత్తను వేరు చేయడానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. వేర్వేరు చెత్త రకాలకు వేర్వేరు డస్ట్ బిన్స్ ఉపయోగిస్తారు.
ఆహార వ్యర్థాల నిర్వహణ: సింగపూర్ ఆహార వ్యర్థాల నిర్వహణపై కూడా దృష్టి పెడుతుంది. ఫుడ్ డైజెస్టర్లు, అనారోబిక్ డైజెషన్ వంటి సాంకేతికతలు ఆహార వ్యర్థాలను శక్తిగానూ, ఎరువుగాను మార్చడానికి ఉపయోగిస్తారు.
ల్యాండ్ ఫిల్ వాడకం: సేకరించిన వ్యర్థాలను కాల్చివేయగా వచ్చిన బూడిదతో సెమకౌ అనే ప్రాంతాన్ని ల్యాండ్ ఫిల్ చేస్తుంటారు. ఇది పర్యావరణానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండేలా డిజైన్ చేశారు. ఈ ల్యాండ్ ఫిల్ లో చేపలు, మొక్కలు వంటి వాటిని పెంచుతున్నారు. ఇదే బూడిదను
ఇసుకగా మార్చి నేచర్ ఫ్రెండ్లీ బ్రిక్స్ తయారు చేస్తున్నారు.
కఠినమైన చట్టాల వల్లే పరిశుభ్రత
సింగపూర్ లిటరింగ్, చెత్త వేయడం వంటి పనులపై కఠినమైన చట్టాలను అమలు చేస్తుంది. ఈ చట్టాల ఉల్లంఘనకు భారీగా జరిమానాలు విధిస్తారు. సింగపూర్‌లో పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిరంతరం నడుస్తూనే ఉంటాయి. కీప్ సింగపూర్ క్లీన్ వంటి ప్రచారాలు ప్రజలను పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టేలా చేస్తున్నాయి.
సింగపూర్‌లో రెగ్యులర్ వీధి శుభ్రత, చెత్త సేకరణ వ్యవస్థలు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు. టైమ్ కి పనులు పూర్తి అయ్యేలా ప్రణాళిక ప్రకారం పని చేస్తారు. చెత్త సేకరణకు వాళ్లు చాలా ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాకుండా సింగపూర్ పర్యావరణానికి అనుకూలంగా గ్రీన్ స్పేస్‌లు, ఎకో-ఫ్రెండ్లీ నిర్మాణాలు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటారు.
ఇండియాలో ఎందుకు సాధ్యపడటం లేదంటే..
పారిశుద్ధ్య నిర్వహణపై ఇండియాలో ప్రత్యేక విధానాలు ఉన్నప్పటికీ అవేమీ సక్రమంగా అమలు కావడం లేదు. ముఖ్యంగా పట్టణాల్లో చెత్తను ఇళ్లకు వచ్చి మరీ సేకరిస్తారు. అయితే దాన్ని రీసైక్లింగ్ చేయడం లోనూ, వేరే అవసరాలకు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవడంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. సేకరించిన చెత్తను ఊరికి లేదా పట్టణానికి దూరంగా పడేస్తున్నారు. ఆ చెత్త అక్కడే రోజులు, నెలల తరబడి పేరుకుపోతుంది. దీని వల్ల ఆ డంపింగ్ యార్డ్ కు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు రోగాల పాలవుతుంటారు. సింగపూర్ సాధించింది ఇండియా అనుకుంటే అయిపోతుంది. అయితే కావాల్సింది అధికారుల్లో కార్యాచరణ, నాయకుల్లో నిబద్ధత మాత్రమే.