1988 మోటారు వాహన చట్టం ప్రకారం మద్యం లేదా మత్తు పదార్థాలు తీసుకొని వాహనం నడిపే వ్యక్తులకు పోలీసులు జరిమానాలు విధిస్తారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న రూల్ అయినప్పటికీ ఇండియాలో మద్యం తాగి వాహనాలు నడిపే సంఘటనలు మాత్రం తగ్గడం లేదు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల నివేదిక ప్రకారం 2024 మొదటి ఆరు నెలల్లో 12,000 మందికి పైగా డ్రైవర్లు మందు తాగి వాహానాలు నడిపారు. 2023లో మొదటి ఆరు నెలల్లో 9,837 కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి కేసులు పెరిగాయని అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక్క ఢిల్లీలోనే కాదు దేశంలోని ముఖ్య నగరాల్లో ఇదే పరిస్థితి ఉంది.
ఇండియాలో అమలులో ఉన్న రూల్ ప్రకారం ఆల్కహాల్ లిమిట్ గా తీసుకొన్నా కారు, జీప్ వంటి చిన్న వాహనాలు డ్రైవ్ చేయొచ్చు. అది ఎంత ఉండాలంటే రక్తంలో ఆల్కహాల్ సాంద్రత (BAC) 0.03% ఉండాలి. అంటే 100 మి.లీ. రక్తంలో 30 మి.గ్రా. ఆల్కహాల్ ఉన్నా కార్లు లాంటివి డ్రైవ్ చేయొచ్చు అన్న మాట. అయితే బిజినెస్ పర్పస్ లో వాహనాలు నడిపే డ్రైవర్లు అసలు ఆల్కహాల్ తీసుకోకూడదు. ఈ రూల్స్ ఉల్లంఘిస్తే 1988 మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 185 ప్రకారం కఠిన శిక్షలు విధిస్తారు.
1988 మోటారు వాహన చట్టం ప్రకారం మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడవితే మొదటిసారి రూ.10,000 వరకు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. రెండోె సారి కూడా ఇదే తప్పు చేస్తే రూ.15,000 వరకు జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ఇలాంటి సంఘటనల్లో ఎవరికైనా ప్రాణాపాయం కలిగితే జైలు శిక్ష కూడా రెండేళ్లు ఉండేది.
కొత్తగా ప్రవేశపెట్టిన 2023 చట్టం ప్రకారం మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే మరణాలకు ఐదు సంవత్సరాల వరకు తప్పనిసరి జైలు శిక్ష విధిస్తారు. అంతేకాకుండా జరిమానా కూడా ఎక్కువగా వేస్తారు. ఒకవేళ ప్రమాదం చేసిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి మరణానికి సరైన కారణం చెప్పకపోతే 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో సహా అదనపు కఠినమైన శిక్షలు విధించే విధంగా చట్టాన్ని మార్చారు.
ఇక వెహికల్ ఇన్సురెన్స్ విషయానికొస్తే మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదం జరిగితే వెహికల్ ఇన్సురెన్స్ క్లెయిమ్ కూడా రాదు. చాలా బీమా కంపెనీలు తమ పాలసీల్లో ఈ రూల్ ని స్ట్రిట్ గా అప్లై చేస్తున్నాయి. ఒక వేళ డ్రైవర్ BAC చట్టపరమైన పరిమితిలో ఆల్కహాల్ తాగి యాక్సిడెంట్ చేసినా బీమా మాత్రం రాదు. అందువల్ల మీ రక్షణ, భద్రత కోసమే కాకుండా చట్టపరమైన ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఆల్కహాల్ తాగి వాహనాలు నడపవద్దు అని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.