కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు హవా ముగిసిన తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. వీరి మధ్య పోటీ 90 వ దశకంలో పీక్ స్టేజికి చేరింది. ఈ నలుగురు హీరోలు 90వ దశకంలో పోటా పోటీగా సినిమాల్లో నటిస్తూ సూపర్ హిట్స్ అందుకున్నారు.
1994లో నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. వారం రోజుల వ్యవధిలో బాలయ్య, నాగార్జున నటించిన చిత్రాలు విడుదలయ్యాయి. ఆ రెండు చిత్రాలు ఈ ఇద్దరి హీరోల కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలే. బాలయ్య నటించిన భైరవ ద్వీపం చిత్రం ఏప్రిల్ 14న 1994లో విడుదలయింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
భైరవద్వీపం చిత్రం సంచలన విజయం సాధించింది. దాదాపు 8 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. జానపద చిత్రంగా తెరకెక్కిన భైరవ ద్వీపం మూవీ అప్పట్లో ప్రేక్షకులని అబ్బురపరిచింది. 1994 ఏడాదికి ఇదే బిగ్గెస్ట్ హిట్ అని అనుకున్నారు. కానీ వారం రోజుల వ్యవధిలో విడుదలైన నాగార్జున హలో బ్రదర్ చిత్రం భైరవ ద్వీపం రికార్డులు చెరిపివేస్తూ దాదాపు 9 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. అప్పటి వరకు అత్యధికంగా ఉన్న ఘరానామొగుడు రికార్డుకి హలో బ్రదర్ దాదాపుగా చేరువగా వెళ్ళింది.
చిరంజీవి రికార్డుకి చెమటలు పట్టించినంత పని అయింది. ఇండస్ట్రీకి హిట్ కి కొద్ది దూరంలో నిలిచిపోయింది హలో బ్రదర్. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన హలో బ్రదర్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.