కరోనాపై యుద్దం: ఎస్పీబీ స్పెషల్ ఈవెంట్, మీరూ పాల్గొనవచ్చు

By Surya PrakashFirst Published Mar 27, 2020, 11:15 AM IST
Highlights

కరోనాను ఎదుర్కొనేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కొంతమంది టాలీవుడ్‌ హీరోలు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివారిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒకరు.

కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపుతోన్న సంగతి తెలిసి్ందే. సినీ ఇండస్ట్రీపై  కూడా కరోనా ప్రభావం తీవ్రంగా పడుతోంది. సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు, ఫంక్షన్‌లు పూర్తి రద్దయ్యాయి. దీంతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో భాగంగా సెలబ్రెటీలు ఇంటికే పరిమితమయ్యారు. కొందరు తమకు దొరికిన ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తుండగా.. మరికొందరు తమలోని మరో ప్రతిభతో ప్రపంచానికి సాయిపడేందుకు ఉద్యమిస్తున్నారు. 

ఈ మహమ్మారి వల్ల భారతదేశంలో ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించింది.  కరోనాను ఎదుర్కొనేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కొంతమంది టాలీవుడ్‌ హీరోలు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివారిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒకరు.  ఈ గాన గంధర్వుడు కూడా తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అయితే, ఇందులో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఇందుకోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ వివరాలన్నీ తన ఫేస్‌బుక్‌ వేదికగా వెల్లడించారు. 

ఆ పోస్ట్ లో ఏముందంటే...‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నేను ఏదైనా కొత్తగా చేయాలని అనుకుంటున్నా. పారిశుద్ధ్య, పోలీస్‌, వైద్యులకు ఏదైనా సాయం చేయాలనుకుంటున్నా. అందుకుకోసం శ్రోతలు, నెటిజన్లకు అవకాశం ఇస్తున్నా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మీకు నచ్చిన పాట పాడమని నన్ను  అడగొచ్చు. అది సినిమా పాటైనా భక్తి గీతమైనా ఏదైనా కావచ్చు. ఎవరు ముందు అడుగుతారో వారికే అవకాశం ఉంటుంది. వచ్చే శనివారం, సోమవారం, బుధవారం, గురువారాల్లో అరగంట పాటు రాత్రి 7గంటల నుంచి 7.30 వరకూ మీరు కోరిన పాటలు నేను పాడతా’’

‘‘ఒక రోజుకీ మరో రోజుకీ విరామం ఎందుకు ఇచ్చామంటే మీరు కోరిన అన్ని పాటలూ నాకు గుర్తు ఉండకపోవచ్చు. అందుకోసం నేను కసరత్తు చేసి, మీరు కోరిన పాటను మరుసటి రోజు పాడి రికార్డు చేసి వినిపిస్తా. ఇందుకు సాధారణ రుసుము రూ.100 చెల్లించాలి. ఇంత మొత్తం సేకరించాలన్న లక్ష్యం ఏమీ లేదు. అలాగే వచ్చిన మొత్తాన్ని ఎలా వినియోగించాలనే విషయంపై కూడా మీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటా. ప్రధానమంత్రి సహాయనిధికి ఇవ్వాలా? లేక ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఇవ్వాలా? అన్నది మీరే చెప్పవచ్చు. 

మీరు ఏ బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపించాలో ఆ వివరాలను నా ఫేస్‌బుక్‌ ఖాతాలో పంచుకుంటా. లావాదేవీలు చాలా పారదర్శకంగా ఉంటాయి. అరగంటలో మొత్తం పాట పాడితే నాలుగైదుకు మించిరావు. అందుకే ఒక పల్లవి, ఒక చరణం మాత్రమే పాడతా. అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నా’’ అని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

click me!