Tollywood : 8 వారాల తర్వాతే ఓటీటీలో సినిమా.. కొలిక్కి వస్తోన్న సమస్యలు.. త్వరలోనే షూటింగ్‌లు : దిల్‌రాజు

By Siva KodatiFirst Published Aug 18, 2022, 5:47 PM IST
Highlights

తెలుగు చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న సమస్యలు ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. త్వరలోనే షూటింగ్‌లు మొదలుపెడతామని ఆయన తెలిపారు. 

ఇకపై ఓటీటీల్లో 55 రోజులు లేదా 8 వారాల తర్వాతే సినిమాను స్ట్రీమింగ్‌కు అనుమతించేలా నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలిపారు. సినిమా షూటింగ్‌లకు సంబంధించి ఆయన పరిశ్రమ పెద్దలతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. మల్టీప్లెక్స్, థియేటర్ సమస్యలకు సంబంధించి కూడా చర్చించామని దిల్‌రాజు వివరించారు. టికెట్ ధరలు, తినుబండారాల ధరలు కూడా ప్రేక్షకులకు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

సింగిల్ స్క్రీన్ నిర్వాహకులతోనూ టికెట్ ధరలు, ఇతర సమస్యలకు సంబంధించి ఎగ్జిబిటర్లతో రేపు చివరి సమావేశం నిర్వహించి నిర్ణయాలు వెలువరిస్తామన్నారు. ఒక్కో సమస్యలను పరిష్కరించుకుంటూ త్వరలోనే షూటింగ్‌లు మొదలు పెడతామని దిల్‌రాజు వెల్లడించారు. కాస్ట్ కటింగ్, ప్రొడక్షన్ ఖర్చులు తగ్గింపుకు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్- మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది తమ వరకు ఒక పెద్ద విజయమన్నారు. మూడు , నాలుగు రోజుల్లో వరుసగా కీలక సమావేశాలు వున్నాయని దిల్‌రాజు చెప్పారు. 

ALso Read:తెలుగు సినిమా ఎలా ఉండాలనేదానికి నాలుగు కమిటీలుః దిల్‌రాజు..

సినీ కార్మికుల వేతనాల సమస్యలపై స్పందించిన ఆయన.. ఫెడరేషన్‌తోనూ చర్చించామని, ఒకట్రెండు ఫైనల్ మీటింగ్స్ వున్నాయని ఆయన తెలిపారు. ప్రొడ్యూసర్స్ ఇస్తామంటోన్న దానికి.. కార్మికులు కోరుతున్న దానికి పెద్దగా వ్యత్యాసం లేదని దిల్‌రాజు వెల్లడించారు. రేపు లేదా ఎల్లుండి షూటింగ్‌లు ప్రారంభమవుతాయంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారా ప్రకటిస్తామని దిల్‌రాజు స్పష్టం చేశారు. బాలీవుడ్ కూడా తెలుగు చిత్ర పరిశ్రమను చాలా నిశితంగా గమనిస్తోందని ఆయన తెలిపారు. ప్రతిరోజూ హిందీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, అక్కడి మీడియా ఇక్కడి డెవలప్‌మెంట్స్‌పై ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారని దిల్‌రాజు చెప్పారు. 
 

click me!