ఓటీటీలో 'పలాస' వర్కవుట్ అయ్యిందా?

By Surya PrakashFirst Published May 3, 2020, 12:33 PM IST
Highlights

 'ప‌లాస‌' కథ కుల వ్య‌వ‌స్థ చుట్టూ తిరుగుతుంది. పలాస లో జరిగే జీడిగింజల వ్యాపారం, అక్కడ షావుకార్లు దురాగతాలు, క్రింద కులాల వారిని తమ వ్యాపారం కోసం ఉపయోగించుకోవటం వంటి పాయింట్‌ని డీల్ చేసింది. ముఖ్యంగా  ఈ సినిమాలో బహుజ‌నుల జీవితాలు, వాళ్ల వ్య‌ధ‌లు, అగ్ర వర్ణాల చేతుల్లో వాళ్లు అణ‌చ‌బ‌డిన విధానాన్నీ చూపించే ప్ర‌య‌త్నం చేశారు. 


 పలాసలో జరిగిన వాస్తవ సంఘటనలు, కొన్ని నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో రూపొందిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ సినిమా కరోనా ప్రభావంతో థియోటర్స్ క్లోజ్ కు ముందు రిలీజైంది. మంచి కథ, కథనాలున్న సినిమా అంటూ సుకుమార్ వంటి పెద్ద దర్శకులు మెచ్చుకున్నా, అల్లు అరవింద్ వంటి వారు మెచ్చుకున్నా..జనాల్లోకి వెళ్లలేకపోయింది. అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవటంతో అక్కడైతే చాలా మంది చూసే అవకాసం ఉందని ఆశపడ్డారు. అయితే అందుతున్న సమాచారం మేరకు అక్కడ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదని మీడియాలో  వినపడుతోంది. 
 
ఈ సినిమాకు సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ బ్యాకింగ్ ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయింది. అదే పరిస్దితి ఓటీటిలో కూడా ఎదురైందంటున్నారు.  ఈ చిత్రాన్ని  మొత్తం హక్కులు తీసుకుని రిలీజ్ చేసారు మీడియా 9 వారు.. మంచి చిత్రంగా అందరూ మాట్లాడుతున్నారు కానీ ఎక్కువ మంది చూడటం లేదంటున్నారు.  అందుకు కారణం ఈ సినిమా కేవలం కొన్ని వర్గాలు.. కొన్ని ఏరియాల పరిమితైందని చెప్తున్నారు. ముఖ్యంగా సినిమాలో వాడిన స్లాంగ్ చాలా ప్రాంతాలు వారికి అర్దం కాలేదని చెప్తున్నారు. అంతేకాకుండా సినిమాపై దృష్టి పడేలా చేసే స్టార్ కాస్టింగ్ కూడా లేకపోవటం పెద్ద ఇబ్బందే.   ఈ సినిమాతో మీడియా 9 కు ఒటీటీలో కూడా నష్టాలు తప్పడం లేదట. 

స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రేక్షకుడిని 1978 ప్రాంతంలోకి తీసుకెళ్లడానికి సినిమాటోగ్రఫీ, ఆర్ట్‌ విభాగం చాలానే కష్టపడ్డట్లు సినిమాను చూస్తే అర్థమవుతుంది. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సిఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్‌ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: విన్సెంట్‌ అరుల్, సంగీతం: రఘు కుంచె. 

click me!