డ్రగ్స్ కేసుది కూడా నయీమ్ కేసు దారేనా..

First Published Jul 14, 2017, 8:17 PM IST
Highlights
  • డ్రగ్స్ కేసులో పలువురు టాలీవుడ్ ప్రముఖులకు సిట్ నోటీసులు
  • తాజాగా సెలవుపై వెళ్తున్న ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్
  • ప్రభుత్వ ఒత్తిడి వల్లే అకున్ సెలవుపై వెళ్లారని ఆరోపణలు
  • నయీమ్ కేసు తరహాలోనే డ్రగ్స్ కేసు పరిస్థితి ఉంటుందా

గత వారం రోజులుగా తెలుగు ప్రజలను ఉలికిపాటుకు గురిచేసిన డ్రగ్స్ మాఫియా అంశం తాజాగా టాలీవుడ్ కూ పాకడంతో సంచలనం సృష్టిస్తోంది.ఈ కేసులో ఫోన్ నంబర్లు, కాల్ డేటా ఆధారంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ నియమించిన సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది.

తాజాగా డ్రగ్స్ కేసులో ప్రముఖ తెలుగు సినీ హీరో రవితేజ, దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి, ఐటమ్ గాళ్ ముమైత్ ఖాన్, హీరోలు తరుణ్, నవదీప్,తనీష్, సుబ్బరాజు, నందు తదితరులతోపాటు సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా,శ్రీనివాసరాజులకు నోటీసులు అందాయి. వీరిలో కొందరి తమపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తుంటే.. మరి కొంత మంది మాత్రం దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధపడగా, పోలీసులు నిలువరించినట్లు తెలుస్తోంది.

అయితే మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) మాత్రం తప్పులేని వారికి మా అండగా ఉంటుందని, కానీ తప్పు చేసిన వారిని పరిశ్రమ నుంచి తరిమికొడతామని హెచ్చరిస్తోంది. ఇప్పటికే నిర్మాతల మండలి కూడా డ్రగ్స్ అంశాన్ని తీవ్రంగా ఖండించింది. అయితే పేర్లు ప్రకటించే ముందు మీడియా సంయమనం పాటించాలనేది వారి వాదన.

ఇదిలా వుంటే ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఈ నెల 17 నుంచి 27 వరకు సెలవుపై వెళ్తుండటంతో ఈ కేసు విచారణ ఎలా వుండబోతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవలే సంచలనం రేపిన మాఫియా డాన్ నయీమ్ ఎన్ కౌంటర్ కేసులో ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ కు, పోలీసు ఉన్నతాధికారులకు సంబంధాలున్నాయని పెద్ద యెత్తున పోలీసు అధికారులనుంచి లీకులొచ్చాయి. అనంతరం సీఐడీ చేపట్టిన విచారణ నత్తనడకన సాగుతోంది. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఈ కేసి విచారణ సాగింది. మరి ఒక మాఫియా డాన్ కేసు పరిస్థితే ఇలా వుంటే... సినీ పరిశ్రమలో స్టార్ డమ్ తో వెలిగిపోతున్నవారి పాత్ర ఉందంటూ వచ్చిన డ్రగ్స్ కేసు పరిస్థితి ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. అకున్ సబర్వాల్ సెలవుపై వెళ్లడం దీనిపై మరిన్ని సందేహాలు రేకెత్తిస్తోంది.

click me!