కర్నూల్ జిల్లాలో కలకలం...నామినేషన్ వేయకుండా ఎంపీటీసి అభ్యర్థుల కిడ్నాప్

By Arun Kumar PFirst Published Mar 11, 2020, 8:59 PM IST
Highlights

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కర్నూల్ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. అక్కడ ఏకంగా ప్రత్యర్థి పార్టీల అభ్యర్ధులను కిడ్నాప్ చేసి నామినేషన్లు  అడ్డుకునే స్థాయిలో రాజకీయాలు సాగుతున్నాయి. 

కర్నూల్: ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రస్తుతం ఘర్షణ  వాతావరణం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని భావిస్తున్న నాయకులు ఎంతకయినా తెగించడానికి వెనుకాడటం లేదు. అలా కర్నూల్ జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో ముగ్గురు టిడిపి ఎంపిటీసి అభ్యర్థులను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం సృష్టించింది. వైసిపి పార్టీ నాయకులే ఈ  కిడ్నాప్ లకు పాల్పడినట్లు టిడిపి  నాయకులు ఆరోపిస్తున్నారు. 

మంత్రాలయం మండలం రచ్చమరి టిడిపి ఎంపిటిసి అభ్యర్థి హుసేని, నాగన్న కౌతాళం మండలం బదినేహాలు అభ్యర్థి వీరేశ్ ను నామినేషన్ దాఖలు చేయకుండా వైసిపి నాయకులు అడ్డుకున్నారు. వారిద్దరిని వైసిపి నాయకులే కిడ్నాప్ చేశారంటూ టిడిపి నియోజకవర్గ ఇంచార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి సంబంధిత పోలీసు స్టేషన్లలో  ఫిర్యాదు చేశారు. 

read more   ఆ వైసిపి ఎమ్మెల్యేల ఓట్లు కూడా ఖచ్చితంగా నాకే...: టిడిపి రాజ్యసభ అభ్యర్థి వర్ల

అయితే వైసీపీ నాయకులు మాత్రం తాము ఎవ్వరినీ కిడ్నాప్ చేయలేదని అంటున్నారు. టిడిపి అభ్యర్థులు తమకు సన్నిహితులు కావడంతో వాళ్లతో రాజీ కుదుర్చుకుని పోటీలో నిలవకుండా చేశామని... ఎవరిని కిడ్నాప్ చేయలేదని చెబుతున్నారు. 

అయితే తిక్కారెడ్డి మాత్రం వైసిపి నాయకుల మాటలను కొట్టిపారేశారు.  నియోజకవర్గ పరిధిలో టీడీపీ ఎంపిటిసి అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని... అందుకు నిదర్శనమే తమ ఎంపిటిసి అభ్యర్థుల కిడ్నాప్ అని అన్నారు. ఇలా తమ అభ్యర్థులను నిర్బంధించి నామినేషన్ వేయకుండా చేసినవారిని గుర్తించి శిక్షించాలని తిక్కారెడ్డి  డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 

read more   ఎలక్షన్ కోడ్ వున్నా... దివంగత నేత విగ్రహానికి ముసుగులు వద్దు: ఈసీఆదేశం


 

click me!