జగన్ పొలిటికల్ రివేంజ్ షురూ... గవర్నర్ కు బిజెపి ఫిర్యాదు

By Arun Kumar PFirst Published Oct 14, 2019, 3:29 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి నాయకులపై జరుగుతున్న దాడులపై ఆ రాష్ట్ర గవర్నర్  కు ఫిర్యాదు అందింది. అధికార పార్టీ నాయకులే ఈ  దాడులకు పాల్పడుతున్నట్లు  బిజెపి ఆరోపిస్తోంది.  

విజయవాడ: తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై వైఎస్సార్‌సిపి దాడులకు పాల్పడుతోందంటూ ఆంధ్ర ప్రదేశ్ బిజెపి నాయకులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అధికార అండతో కొందరు పెద్ద నాయకులు కిందిస్థాయి కార్యకర్తల చేత దాడులు చేయిస్తున్నారని గవర్నర్ కు తెలిపారు. పోలీసులు కూడా అధికారపార్టీ నాయకులకు బయపడి ఈ దాడులను పట్టించుకోవడం లేదన్నారు. ఇలా ప్రతిపక్షాలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతోందన్నారు. 

గవర్నర్ ను కలిసిన తర్వాత బిజెపి మాజీ ఎంఎల్ఏ గోనుగుంట్ల సూర్యనారాయణ మాట్లాడుతూ... అనంతపురం జిల్లాలో బిజెపి కార్యకర్తలపై అధికార పార్టీ దాడులు మరీ ఎక్కువగా వున్నాయన్నారు. అందువల్లే ధర్మవరం నియోజకవర్గంలో ఏఎస్పి స్ధాయి అధికారిని నియమించాలని గవర్నర్ కు విన్నవించినట్లు తెలిపారు. కనీసం నోటీసులు ఇవ్వకుండానే అధికారులు భూములు లాక్కుంటున్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.  

మరో బిజెపి నేత నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ...ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ రివెంజ్ లను ప్రోత్సహించే పనులు చేస్తున్నారని ఆరోపించారు.  రాయలసీమలో జరుగుతున్న దాడులను ముఖ్యమంత్రే నియంత్రించాలని డిమాండ్ చేశారు. 

పల్నాడులో టిడిపి నుంచి బిజెపికి వచ్చిన వారిపై జరిగిన దాడులపై కూడా గవర్నర్ కు  ఫిర్యాదు చేశామన్నారు. ఈ దాడులకు పాల్పడిన వారిని  వెంటనే శిక్షించాలని... అప్రజాస్వామిక విధానాలను ప్రోత్సహించకుండా ఆదేశాలివ్వాలని గవర్నర్ ను కోరినట్లు తెలిపారు. 

click me!