షాట్ మిస్ అయినందుకు బూతులు... గీత దాటిన దినేశ్ కార్తీక్‌కి మందలింపు...

By Chinthakindhi RamuFirst Published May 27, 2022, 3:37 PM IST
Highlights

షాట్ మిస్ అయినందుకు కోపంతో తనపైన తాను అరుచుకున్న దినేశ్ కార్తీక్... ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించింనందుకు మందలించిన రిఫరీ... 

ఐపీఎల్ 2016 తర్వాత మొట్టమొదటిసారిగా ఎలిమినేటర్ గండాన్ని దాటి, రెండో క్వాలిఫైయర్ వరకూ దూసుకొచ్చింది ఆర్‌సీబీ. నెగిటివ్ రన్‌రేట్‌తో, ముంబై ఇండియన్స్‌ దయతో లక్కీగా ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో మాత్రం అద్భుతంగా పోరాడి, లక్నో సూపర్ జెయింట్స్‌పై చక్కని విజయాన్ని నమోదు చేసింది...

అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌కి ముందు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆర్‌సీబీ సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తీక్‌ని మందలించారు రిఫరీ. ఇంతకీ ఏం జరిగిందంటే... 

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ గోల్డెన్ డకౌట్ అయినా విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెప్పుకోదగ్గ స్థాయిలో పరుగులు చేయలేకపోయినా రజత్ పటిదార్ అద్భుత సెంచరీ, ఆఖర్లో దినేశ్ కార్తీక్ మెరుపుల కారణంగా 207 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది...

14వ ఓవర్‌ మొదటి బంతికే మహిపాల్ లోమ్రోర్ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్, క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్నాడు. కార్తీక్ ఎదుర్కొన్న రెండో బంతికే ఎల్బీడబ్ల్యూ రివ్యూ తీసుకుంది లక్నో సూపర్ జెయింట్స్... అంపైర్స్ కాల్‌గా రావడంతో బతికిపోయిన దినేశ్ కార్తీక్, మోహ్సీన్ ఖాన్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్ క్యాచ్ డ్రాప్ చేయడంతో రెండోసారి లైఫ్ దక్కించుకున్నాడు...

మొదటి 10 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసిన దినేశ్ కార్తీక్, ఆవేశ్ ఖాన్ వేసిన 17వ ఓవర్‌లో 3 ఫోర్లతో 15 పరుగులు రాబట్టాడు. అదే ఆవేశ్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్‌లో వైడ్‌గా వెళ్లే ఓ బాల్‌ని ఫోర్ తరలించేందుకు ప్రయత్నించి, మిస్ అయ్యాడు దినేశ్ కార్తీక్...

వైడ్ బాల్‌గా వచ్చే అదనపు పరుగు మిస్ అవ్వడం, షాట్‌గా మలచలేకపోవడంతో తీవ్ర అసహనానికి లోనైన దినేశ్ కార్తీక్... క్రీజులోనే తననే తాను తిట్టుకున్నాడు. ఊరిస్తూ వచ్చిన ఫుల్ అండ్ వైడ్ బాల్‌ని స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి తప్పు చేశానని అరుస్తూ బూతులు మాట్లాడాడు. 

దీంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఉల్లంఘించినందుకు దినేశ్ కార్తీక్‌ని మందలించారు రిఫరీ. కార్తీక్ చేసిన పని ఐపీఎల్ కోర్ట్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.3 లోని లెవెల్ 1 తప్పుగా పరిగణించారు. ఈ తప్పుకు రిఫరీ ఏ విధమైన శిక్ష విధించినా దానికి తలొగ్గాల్సి ఉంటుంది. అయితే దినేశ్ కార్తీక్ తనన తప్పును అంగీకరించడంతో ఈసారికి మందలింపుతో వదిలేశారు రిఫరీ... 

23 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, రజత్ పటిదార్‌తో కలిసి 41 బంతుల్లో 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 208 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లక్నో సూపర్ జెయింట్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులకి పరిమితమై 14 పరుగుల తేడాతో ఓడింది...

దినేశ్ కార్తీక్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోలేకపోయిన లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కెఎల్ రాహుల్‌తో పాటు సెంచరీ మ్యాన్ రజత్ పటిదార్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డర్లు అందుకోలేకపోయారు. 

click me!