మా వల్ల కాదు! బీసీసీఐ నుంచి వెళ్లిపోతామని సుప్రీంలో కాగ్ పిటిషన్

By Sreeharsha GopaganiFirst Published Jul 10, 2020, 1:53 PM IST
Highlights

బీసీసీఐలో స్వతంత్ర భావాలు వ్యక్తపరచటం, సుప్రీంకోర్టు అప్పగించిన ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించటం సాధ్యపడటం లేదని కాగ్‌ పిటిషనులో పేర్కొంది. 

బీసీసీఐ బాధ్యతల నుంచి తమకు ఉపశమనం కల్పించాలని, అక్కడ తాము పని చేయడం, తమకు అప్పగించిన బాదేతలను నిర్వర్తించడం కూడా కుదరడంలేదని, కాగ్ సుప్రీమ్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో తెలిపింది. 

ఈ మేరకు జులై 3న అత్యున్నత న్యాయస్థానంలో కాగ్‌ పిటిషను దాఖలు చేసింది. బీసీసీఐలో స్వతంత్ర భావాలు వ్యక్తపరచటం, సుప్రీంకోర్టు అప్పగించిన ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించటం సాధ్యపడటం లేదని కాగ్‌ పిటిషనులో పేర్కొంది. 

జులై 17న జరగాల్సిన బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి జూన్‌ 30తో పదవీ కాలం ముగించుకున్న కార్యదర్శి జై షా హాజరు కాకుండా చూడాలని కాగ్‌ ప్రతినిధి ఆల్కా రెహాని భరద్వాజ్‌ ప్రశ్నలు లేవనెత్తిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకోవటం గమనార్హం. 

సుప్రీంకోర్టు 2016 చారిత్రక తీర్పులో బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌లో కాగ్‌ ప్రతినిధి ఉండాలనే జస్టిస్‌ లోధా కమిటీ ప్రతిపాదనను ఆమోదిస్తూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌లో ఆఫీస్‌ బేరర్లు అధ్యక్షుడు, కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, కోశాధికారి, సంయుక్త కార్యదర్శి, రాష్ట్ర క్రికెట్‌ సంఘాల ప్రతినిధి, ఇద్దరు భారత క్రికెటర్ల సంఘం ప్రతినిధులు సహా కాగ్‌ ప్రతినిధి ఉంటారు. 

మా వల్ల కాదు..... 

కాగ్‌ ప్రతినిధి ఆల్కా రెహాని భరద్వాజ్‌ ఇప్పటివరకు మూడు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాలు, నాలుగు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశాలకు హాజరయ్యారు. 2019 డిసెంబర్‌ నుంచి ఆల్కా రెహాని అనుభవాల ఆధారంగా కాగ్‌ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషను దాఖలు చేసింది. బీసీసీఐలో కాగ్‌కు అప్పగించిన పని సహజ వృత్తికి విరుద్ధంగా ఉందని కాగ్‌ తెలిపింది. ' 

బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌లు పరిపాలన పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉద్దేశించినవి. పాలనా నిర్ణయాలు తీసుకునేందుకు మేనేజ్‌మెంట్‌ నైపుణ్యం అవసరం. క్రికెట్‌ మ్యాచుల షెడ్యూల్‌ తయారు, భారత జట్టు క్రికెట్‌ క్యాలెండర్‌ ఖరారు, ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్ల వేతనాలపై నిర్ణయం, ఐసీసీలో భారత క్రికెట్‌ ప్రాతనిథ్యం, ఐపీఎల్‌ నిర్వహణ వంటివి అందులో కీలకమైనవి. 

కాగ్‌ ఆర్థిక పారదర్శకత తీసుకురావటం, ఆర్థిక ఆడిట్‌ చేయటంలో కాగ్‌ దిట్ట. కానీ బీసీసీఐలో కాగ్‌ ప్రతినిధి పాత్ర పూర్తి భిన్నం. అందులో మాకు ఎటువంటి ప్రవేశం లేదు. అపెక్స్‌ కౌన్సిల్‌, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌లో కాగ్‌ ప్రతినిధికి చోటు ఇవ్వటం ద్వారా జస్టిస్‌ లోధా కమిటీ ఆశించిన ప్రయోజనం దక్కటం లేదు. అందుకు భిన్నంగా బీసీసీఐ, రాష్ట్ర సంఘాల వార్షిక ఆర్థిక ఆడిట్‌ చేయటం మెరుగ్గా ఉంటుంది. అపెక్స్‌ కౌన్సిల్‌, గవర్నింగ్‌ కౌన్సిల్‌లో కొనసాగటం వల్ల ఆడిట్‌ పనుల నిర్వహణలో అడ్డంకులు వస్తున్నాయి. ప్రయివేట్‌ ఆడిటర్లు నాణ్యతపై పర్యవేక్షణ సైతం లోపిస్తోంది. నిజానికి బీసీసీఐ ఆడిట్‌ ప్రయివేటు ఆడిటర్లు చూస్తున్నారు. కాగ్‌ ప్రతినిధి ఉండగా, ప్రయివేటు ఆడిటర్ల మాట అంతిమం అవుతోంది. నిజానికి ఆడిట్‌లో కాగ్‌ది అంతిమ నిర్ణయం' అని పిటిషనులో కాగ్‌ వివరించింది. 

బీసీసీఐ బాధ్యతల నుంచి పూర్తిగా మినహాయింపు అవసరం లేకపోయినా.. అపెక్స్‌ కౌన్సిల్‌, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నుంచి తప్పించి.. ఆడిట్‌ బాధ్యతలు చూసుకునేలా 2016 తీర్పులో మార్పు చేయాల్సిందిగా కాగ్‌ కోరింది. నిజానికి బీసీసీఐకి సైతం కాగ్‌ ప్రతినిధి అపెక్స్‌ కౌన్సిల్‌, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో కూర్చోవటం పట్ల తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. కాగ్‌ ప్రతినిధి రాకతో ప్రభుత్వ జోక్యం ఉన్నట్టు అవుతుందని, ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధమని గతంలో అధ్యక్షుడిగా అనురాగ్‌ ఠాకూర్‌ వాదించారు. అందుకు ఐసీసీ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ నుంచి లేఖ కోరాడు. ఈ వ్యవహరం ఠాకూర్‌పై కోర్టు ధిక్కరణకు దారితీయగా.. అనంతరం సుప్రీంకోర్టు అతడిని బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాగ్‌ స్వయంగా అపెక్స్‌ కౌన్సిల్‌, గవర్నింగ్‌ కౌన్సిల్‌ నుంచి తప్పుకుంటామని సుప్రీంకోర్టుకు వెళ్లటం బీసీసీఐకి సంతోషదాయకమే.

click me!