మ్యూచువల్ ఫండ్స్ చరిత్రలో కొత్త రికార్డు...అదనంగా 4 లక్షల కోట్లు...

By Sandra Ashok Kumar  |  First Published Dec 26, 2019, 11:45 AM IST

మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ చరిత్రలో ఈ ఏడాది ఒక రికార్డు నమోదు కానున్నది. సెబీ చర్యలతో పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ బలపడి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దీంతో 2019లో మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లోకి అదనంగా రూ.4 లక్షల కోట్లు వచ్చి చేరతాయని అంచనా వేస్తున్నారు.
 


న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్ల జోరు నిరాటంకంగా కొనసాగుతున్నది. ప్రస్తుత సంవత్సరంలో ఫండ్‌ ఆస్తుల విలువ మరో రూ.4 లక్షల కోట్ల మేర పెరిగింది. 2019లో భారీ వృద్ధిని నమోదు చేసుకున్న ఈ విభాగం నూతన వసంతంలోనూ మరింత పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్టాక్ మార్కెట్ల నియంత్రణ మండలి ‘సెబీ’ తీసుకున్న పటిష్ఠ చర్యలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం మరింత పెరుగడంతో డెబిట్‌ మార్కెట్లో భారీగా నిధులు కుమ్మరించారు. ఈక్విటీ మార్కెట్లు అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటే 2020లో ఫండ్‌ విభాగం 17-18 శాతం మధ్యలో వృద్ధిని నమోదు చేసుకునే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ బాడీ ఆంపీ సీఈవో ఎన్‌ఎన్‌ వెంకటేశ్‌ తెలిపారు. 

Latest Videos

undefined

ప్రస్తుత సంవత్సరం నవంబర్‌ చివరినాటికి మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో అసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ (ఏయూఎం) ఆస్తుల విలువ మరో 18 శాతం (రూ.4.2 లక్షల కోట్లు) పెరిగి చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.27 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది డిసెంబర్‌ వరకు ఇది రూ.22.86 లక్షల కోట్లుగా ఉన్నది. ఈ నెల చివరినాటికి ఫండ్‌ ఆస్తుల విలువ కొంతమేర తగ్గే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. 

also read బంగారం ధరలు మళ్లీ పెరిగాయి...ఎంత పెరిగిందంటే..?

పాత పెద్ద నోట్లను రద్దు చేస్తు తీసుకున్న నిర్ణయం తర్వాత ఫండ్లలోకి పెట్టుబడులు వరదలా వచ్చాయని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఏడాది కొత్తగా 62 లక్షల మంది పెట్టుబడిదారులు చేరడంతో మొత్తం సంఖ్య 8.65 కోట్లకు చేరుకున్నారు. 2018లో 7.5 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న ఫండ్‌ ఇండస్ట్రీ ఆ తర్వాతి ఏడాదిలో 18 శాతం వృద్ధి కనబరిచింది.

మ్యూచువల్‌ పండ్లు ఆశాజనక పనితీరు కనబరుచాలంటే ఈక్విటీ మార్కెట్లు కూడా వృద్ధిని నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని, అప్పుడే ఫండ్లు దూసుకుపోనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ కట్టుదిట్టమైన చర్యలతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను ఫండ్లవైపు మళ్లించినట్లు చెప్పారు. 

దేశవ్యాప్తంగా లక్ష డిస్ట్రిబ్యూటర్లు ఉండగా, 2.1 కోట్ల మంది పెట్టుబడి దారులు ఉన్నారు. ఈక్విటీలతో పోలిస్తే ఫండ్లలో పెట్టుబడులు అధిక రిటర్నులు పంచుతుండటం కూడా ఇందుకు దోహదం చేస్తున్నది. 2009లో రూ.8.22 లక్షల కోట్లుగా ఉన్నా ఏయూఎం ఇండస్ట్రీ.. నవంబర్‌ 2019 నాటికి రూ.27 లక్షల కోట్లకు చేరుకున్నది. గడిచిన పదేండ్లకాలంలో ఫండ్‌ ఆస్తుల విలువ మూడింతలు పెరిగింది.

కంపెనీల మధ్య విలీనాలు-కొనుగోళ్లు ఈ ఏడాది నీరసించాయి. ఆర్థిక మందగమనం ఓ వైపు, రుణ భారం మరోవైపు కార్పొరేట్‌ రంగాన్ని విలీనాలు-కొనుగోళ్లకు దూరం చేశాయి. రుణ చెల్లింపులకే కార్పొరేట్లు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. నిజానికి గతేడాది విలీనాలు-కొనుగోళ్లు జోరుగా సాగాయి.

also read ముకేశ్ అంబానీ మొత్తం సంపాదన ఎంతో తెలుసా....

దేశీయంగా కార్పొరేట్‌ పరిపాలనా వ్యవస్థ లోపాలు, భారీ నగదు కొరత, అంతర్జాతీయంగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు ఈ ఏడాది మార్కెట్‌ను దెబ్బతీశాయి. 2019 జనవరి-నవంబర్‌లో విలీనాలు - కొనుగోళ్ల విలువ 33 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని గ్లోబల్‌ ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) తెలిపింది. మొత్తం 812 డీల్స్‌ జరిగినట్లు చెప్పింది. 

సగటు డీల్‌ విలువ 81 మిలియన్‌ డాలర్లుగా నమోదవగా, మూడేళ్లలోనే ఇది కనిష్ఠమని గ్లోబల్‌ ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) పేర్కొన్నది. కాగా, వచ్చే ఏడాదిపైనే కార్పొరేట్లు ఆశలు పెట్టుకున్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగైతే మళ్లీ విలీనాలు-కొనుగోళ్లు ఊపందుకోవచ్చన్న అంచనాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. 2021 నుంచి పూర్వ వైభవం వస్తుందన్న విశ్వాసం వెలిబుచ్చుతున్నారు.
 

click me!