కరోనా దెబ్బకు ఫార్మాసి రంగం కుదేలు...నిలిచిపోయిన దిగుమతులు...

By Sandra Ashok KumarFirst Published Mar 16, 2020, 12:25 PM IST
Highlights

కరోనా వైరస్‌ దెబ్బకు ఫార్మా రంగం కుదేలైంది. చైనా నుంచి  ముడి సరుకు దిగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా ఔషధాలు ఉత్పాదకత ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే నెలలో వైరస్ తీవ్రత కొనసాగితే ఔషధాల కొరత తప్పనిసరిగా ఏర్పడుతుందని వైద్య, ఔషధ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాపార, పారిశ్రామిక రంగాలనూ పట్టి పీడిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా వేల మంది ప్రాణాలను బలిగొంటున్న ఈ మహమ్మారి.. దేశీయ పరిశ్రమను ముఖ్యంగా ఔషధ రంగాన్ని కుదేలు చేస్తున్నది. చైనా నుంచి ముడి సరుకు దిగుమతులు నిలిచిపోవడంతో ఉత్పాదకత ప్రభావితం అవుతున్నది. 

ప్రపంచ కర్మాగారంగా ప్రసిద్ధి చెందిన చైనాలోనే కరోనా పుట్టిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి తయారీ రంగం దాదాపు మూతబడింది. అన్ని రకాల పరిశ్రమలు స్తంభించాయి. ఫలితంగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న భారత్‌సహా పలు దేశాలపై ఈ ప్రభావం కనిపిస్తున్నదిప్పుడు. 

చైనా నుంచి చౌకగా ముడి సరుకు లభిస్తుండటంతో చాలా దేశాలు అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. కరోనా దెబ్బకు అంతా తలకిందులైంది. బల్క్‌ డ్రగ్స్‌, ఫార్మా రంగ పరిశ్రమపై వైరస్‌ ప్రభావం అధికంగా కనిపిస్తున్నది. 

also read తగ్గిన పసిడి దిగుమతులు...బంగారాన్ని నగలుగా మార్చి....

చైనాలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పరిశ్రమలను తెరవడం సాధ్యమేనా? తెరిచినా అక్కడి నుంచి ముడి సరుకులను ఇక్కడికి దిగుమతి చేసుకోవడంపై ఎలాంటి ఆంక్షలు ఉంటాయి? అన్న అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. చైనాలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

అసలే కరోనా ధాటికి అతలాకుతలమైన చైనా సైతం ఔషధాల కొరతనెదుర్కొంటున్నది. దీంతో తమ అవసరాలకే ఆ దేశం తొలి ప్రాధాన్యం ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పటిదాకా దేశీయ అవసరాల సంగతి ఏంటన్న ప్రశ్నలు.. భవిష్యత్‌పై భరోసా లేకుండా చేస్తున్నాయి. 

నిజానికి పారసిటమల్‌ వంటి మందుల కొరత లేదని కేంద్రం చెబుతున్నా వైరస్‌ బాధితులు పెరిగితే తలెత్తే పరిస్థితి ఏమిటన్నదానిపై ఆందోళనలు లేకపోలేదు. ఇప్పటికే దేశం నుంచి విదేశాలకు ఔషధ ఎగుమతులపై మోదీ సర్కార్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

మరికొన్ని నెలలపాటు ఔషధ రంగాన్ని కరోనా ప్రభావిత సమస్యలు వెంటాడే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి పరిశ్రమలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

బల్క్‌ డ్రగ్‌, ఫార్మా పరిశ్రమ ఉత్పత్తులపై ఏప్రిల్‌ తరువాత ప్రభావం ఉంటుందంటున్న విశ్లేషకులు.. విదేశాలు ఇచ్చిన ఆర్డర్లపై ఈ పరిస్థితుల ప్రభావం పడవచ్చని అంటున్నారు. 

అత్యవసరాల కోసం ముడి సరుకు సిద్ధంగా ఉందని పరిశ్రమ చెప్తుండగా, వచ్చే నెలలోనూ వైరస్‌ ఉధృతి కొనసాగితే కష్టాలు తప్పవన్న సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ఔషధ ఎగుమతులకు బ్రేకులు పడ్డాయి. ఈ క్రమంలో చైనా పరిస్థితులు మెరుగుపడకుంటే యావత్‌ పరిశ్రమపై తీవ్ర ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

దేశీయ అవసరాలకు అనుగుణంగా మందుల తయారీని పెంచుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వాలని బల్క్‌ డ్రగ్స్‌ పరిశ్రమల ప్రతినిధి ఒకరు తెలిపారు. కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా కంపెనీల నుంచి వివిధ శాఖల అధికారులు సమాచారాన్ని సేకరించారని వివరించారు.

also read మండే ‘భగభగలు’: 15 నిమిషాల్లో రూ.6 లక్షల కోట్లు హాంఫట్..

కేంద్రం వెంటనే స్పందిస్తే దేశీయ అవసరాలకు కొరత ఉండదన్న అభిప్రాయం ఉంది. బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకు చైనా నుంచి రావాల్సి ఉన్నా అక్కడ పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదు. ఈ క్రమంలోనే స్థానిక వనరులపై దృష్టి పెట్టి ఉత్పాదకతను పెంచుకునే మార్గాలను అన్వేషించాలని చెబుతున్నారు. 

లేనిపక్షంలో మున్ముందు ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతినే వీలుందని ఔషధ రంగ నిపుణులు అంటున్నారు. మరోవైపు దేశీయంగా తయారయ్యే వ్యాక్సిన్లు, మందుల ఎగుమతులపై కేంద్రం విధించిన నిషేధం.. రాష్ట్ర కంపెనీల ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేయవచ్చన్నారు.

కరోనా దెబ్బకు కకావికలమవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఔషధ రంగ షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. మదుపరుల నిరాదరణకు భారీ నష్టాలెదుర్కొంటున్నాయి. ఒకప్పుడు బంగారు గుడ్లను పెట్టే బాతుగా ఇన్వెస్టర్లకు కనిపించిన ఫార్మా రంగం.. ఇప్పుడు సంపదను హరించేదిగా కనిపిస్తున్నది.

గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌, పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, లుపిన్‌, బయోకాన్‌, క్యాడిలా హెల్త్‌కేర్‌, అరబిందో ఫార్మా, సిప్లా, దివిస్‌ లాబొరేటరీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, సన్‌ ఫార్మా షేర్లు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. నిఫ్టీ ఫార్మా సూచీ 7.29 శాతం దిగజారి 6,436.75 వద్దకు చేరింది.
 

click me!