న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-ఫిబ్రవరి మధ్య పుత్తడి దిగుమతులు దాదాపు 9 శాతం పడిపోయాయి. ద్రవ్యలోటును కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి మధ్య 27 బిలియన్‌ డాలర్ల (రూ.1.90 లక్షల కోట్ల) విలువైన పసిడి దిగుమతి అయింది. 

అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన 29.62 బిలియన్‌ డాలర్ల విలువైన పసిడి దిగుమతులతో పోలిస్తే 8.86 శాతం తగ్గినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా తెలిపింది. పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టడంతో వాణిజ్యలోటు 173 బిలియన్‌ డాలర్ల నుంచి 143.12 బిలియన్‌ డాలర్లకు పరిమితమైందని తెలిపింది.

also read మండే ‘భగభగలు’: 15 నిమిషాల్లో రూ.6 లక్షల కోట్లు హాంఫట్..

బంగారం ధర రికార్డు స్థాయిలో పుంజుకుంటుండటం, మరోవైపు కరోనా వైరస్‌ దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతుండటంతో మదుపరులు జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో గతేడాది డిసెంబర్‌ నుంచి పసిడి దిగుమతుల్లో ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. 

దేశీయంగా ఆభరణాలకు అధికంగా డిమాండ్‌ ఉండటంతో భారత్‌ ప్రతియేటా 800 నుంచి 900 టన్నులకు వరకు బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నది. ఇందులో కొంత భాగాన్ని నగలుగా మార్చి ఎగుమతి చేస్తుంటారు. 

also read అమెరికాకు అలీబాబా వ్యవస్థాపకుడి భారీ విరాళం....

వాణిజ్యలోటు, కరంట్ ఖాతా లోటును కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పసిడి దిగుమతులపై విధిస్తున్న పన్నును 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో మార్కెట్ సెంటిమెంట్ పై ప్రభావం పడింది. 

ఫలితంగా పుత్తడి దిగుమతిలో  ప్రతికూల వృద్ధి నమోదైంది. మరోవైపు జెమ్స్‌ అండ్‌ ఆభరణాల వర్తకులు ఈ సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పన్ను భారం తగ్గించుకునేందుకు కొంత మంది ఆభరణాల ఎగుమతిదారులు పన్నులు తక్కువగా ఉండే పొరుగు దేశాలకు తమ వ్యాపారాలను మార్చారు. దీనికి తోడు ఆర్థిక మందగమనం, అధిక దరల వల్ల దేశీయ కొనుగోళ్లూ నీరసించాయి. ఇవన్నీ పసిడి దిగుమతులను దెబ్బతీస్తున్నాయి.