మారటోరియం ప్లీజ్.. లేదంటే...!! కేంద్రానికి సీఐఐ, అసోచామ్ డిమాండ్లు

By narsimha lodeFirst Published Mar 23, 2020, 10:51 AM IST
Highlights

అసలే మందగమనం.. ఆపై కరోనా వైరస్ మహమ్మారి.. దేశీయ ఆర్థిక వ్యవస్థను మరింత విపత్కర పరిస్థితుల్లోకి నెట్టింది. ఈ మహమ్మారి దెబ్బకు దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. 

న్యూఢిల్లీ: అసలే మందగమనం.. ఆపై కరోనా వైరస్ మహమ్మారి.. దేశీయ ఆర్థిక వ్యవస్థను మరింత విపత్కర పరిస్థితుల్లోకి నెట్టింది. ఈ మహమ్మారి దెబ్బకు దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రజల ఆర్థిక, జీవన ప్రమాణాలే సంకటంలో పడ్డాయి.

ఈ నేపథ్యంలో అటు కార్పొరేట్‌, ఇటు వ్యక్తిగత రుణాల చెల్లింపులపై మారటోరియం ఇవ్వాలని వ్యాపార, పారిశ్రామిక రంగాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. రుణ చెల్లింపులు, పన్ను కోతలపై ఏడాదిపాటు విరామం ఇవ్వాలని దేశీయ పరిశ్రమ డిమాండ్‌ చేస్తున్నది.

‘తక్షణమే ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించాలి. లేకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 5 శాతం దిగువకు పడిపోయే ప్రమాదమున్నది’ అని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

బ్యాంకుల ద్వారా తీసుకున్న కార్పొరేట్‌, వ్యక్తిగత రుణాల చెల్లింపులపై ఏడాదిపాటు మారటోరియం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో అసోచామ్‌ కోరింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు నిధుల కొరత రాకుండా చూసే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు బాసటగా ఎల్‌ఐసీ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆ లేఖలో అసోచామ్‌ అధ్యక్షుడు నిరంజన్‌ హీరానందని కోరారు.

వచ్చే నెల ద్రవ్యసమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను 50 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గించాలని సీఐఐ డిమాండ్‌ చేసింది. మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) వర్గీకరణ నిబంధనల్ని 90 రోజుల నుంచి 180 రోజులకు పెంచాలనీ సీఐఐ కోరింది. 

దీనివల్ల పరిశ్రమకు గొప్ప ఊరట లభించగలదన్నది. ఒత్తిడిలో ఉన్న రంగాల్లోని సంస్థల కోసం రుణాల పునర్‌వ్యవస్థీకరణ తదితర అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని సీఐఐ కోరింది.

కరోనా వైరస్‌ సినీ పరిశ్రమ, దాని అనుబంధ సంస్థలపైనా దుష్ప్రభావం చూపుతున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో థియేటర్ల యాజమాన్యం పన్నుల వంటి చట్టబద్ధ బకాయిలు, రుణాల చెల్లింపులపై ఏడాదిపాటు మారటోరియం ఇవ్వాలని సినీ రంగ పరిశ్రమ కోరుతున్నది.

also read:కరోనా ఎఫెక్ట్: ఇప్పట్లో నూతన నియామకాలు హుళ్లక్కే.. నిపుణుల వార్నింగ్

కొత్త సినిమాల నిర్మాణం ఆగిపోవడంతో ఆదాయం కోల్పోయామని, అసలు థియేటర్లనే మూసేయాల్సి రావడంతో పరిస్థితి దారుణంగా తయారైందని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. దేశవ్యాప్తంగా 8,750 థియేటర్లుండగా, ఇందులో 3,100 స్క్రీన్లను అసోసియేషన్‌ నిర్వహిస్తున్నది.
 

click me!