Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: ఇప్పట్లో నూతన నియామకాలు హుళ్లక్కే.. నిపుణుల వార్నింగ్

కరోనా వైరస్​ మహమ్మారి వల్ల కొత్త ఉద్యోగాల కల్పన స్తంభించే ప్రమాదం ఏర్పడింది. కొవిడ్-19​ ప్రభావం తగ్గే వరకు ఇంటర్వ్యూలను రద్దు చేసేందుకు కంపెనీలు మొగ్గు చూపుతుండటం ఇందుకు ప్రధాన కారణం.

COVID-19 to delay job interviews; impact hiring: Experts
Author
New Delhi, First Published Mar 23, 2020, 10:43 AM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్​ మహమ్మారి వల్ల కొత్త ఉద్యోగాల కల్పన స్తంభించే ప్రమాదం ఏర్పడింది. కొవిడ్-19​ ప్రభావం తగ్గే వరకు ఇంటర్వ్యూలను రద్దు చేసేందుకు కంపెనీలు మొగ్గు చూపుతుండటం ఇందుకు ప్రధాన కారణం. సేవారంగంలో దీని ప్రభావం అధికమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

Also read:మళ్లీ ట్రేడింగ్ హాల్టింగ్.. 10 % లోయర్ సర్క్యూట్ వల్ల.. అమ్మకాల ఒత్తిళ్లే!

ఇంటర్వ్యూలకు ఎంపికైన 60-65 శాతం మందికి పలు కంపెనీలు ముఖాముఖి పరీక్షలను రద్దు చేయటమో లేదంటే వాయిదా వేస్తున్నాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ), రిటైల్‌, లాజిస్టిక్స్‌ వంటి సేవల కంపెనీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోందని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ బిజినెస్‌ హెడ్‌ అమిత్‌ వధేరా అన్నారు. 

దీంతో ఈ ఏడా ది కొత్త ఉద్యోగులు కొలువుల్లో చేరటం బాగా ఆలస్యమయ్యే అవకాశముందని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ బిజినెస్‌ హెడ్‌ అమిత్‌ వధేరా  చెప్పారు. అయితే, కొత్త నియామకాలు ఆలస్యమైనా ఉత్పాదకత తగ్గకుండా ఉండేందుకు కంపెనీలు సరికొత్త టెక్నాలజీలపై దృష్టిపెడుతున్నాయన్నారు. లాక్ డౌన్ వల్ల ప్రజలు కూడా ఇంటివద్దనే ఉండాలని అధికారులు చెబుతున్నారని అమిత్ వధేరా తెలిపారు. 

కొవిడ్-19 కారణంగా కీలకమైన చాలా ప్రాజెక్టులు నెమ్మదించే అవకాశం ఉన్నట్లు సీఐఈఎల్ హెచ్​ఆర్ సర్వీసెస్ సీఈఓ ఆదిత్య నారాయణ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. తద్వారా ఆదాయంపై ప్రభావం ఏర్పడి.. నియామకాలు ఆలస్యంగా జరిగే అవకాశం ఉందన్నారు.

ఆతిథ్యం, పర్యాటక, విమానయానం తదితర రంగాల కంపెనీల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దీంతో చాలా కంపెనీల ఆదాయాలు పడిపోయి ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. 

ఇందుకోసం కొన్ని కంపెనీలు ఉన్న సిబ్బందికే జీతాలు ఇవ్వలేక ‘లీవ్‌ విత్‌ నో పే’ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే త్రైమాసికంలో కొత్త నియామకాలు కనీసం 10-15 శాతం తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  ఆర్థిక మందగమనం కారణంగా గత ఏడాదితో పోలిస్తే కంపెనీలు ఇప్పటికే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు తగ్గించాయి.

దీనికి కోవిడ్‌-19 తోడవడంతో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఇంటర్న్‌షిప్‌ వచ్చిన విద్యార్ధులకూ ఉద్యోగ హామీ లేకుండా పోయింది. ఖర్చులు తగ్గించుకునేందుకు కొన్ని కంపెనీలు వీరిని మధ్యలోనే ఇంటికి పంపిస్తున్నట్టు సమాచారం. 

సీఐఈఎల్ హెచ్​ఆర్ సర్వీసెస్ సీఈఓ ఆదిత్య నారాయణ్ మిశ్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఇప్పటికే వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు కావడం మనం చూస్తున్నాం. భవిష్యత్తు అవసరాలు సహా తమ ఆదాయ వనరులపై సంస్థలు ఆందోళన చెందుతున్నాయనే విషయానికి ఇదో సూచన. ఈ సంక్షోభం కారణంగా మందగమనం ప్రారంభమవుతుంది’ అని తెలిపారు.  

అయితే కొన్ని రంగాల్లో ఈ వైరస్ కారణంగా నియామకాలు పెరిగే అవకాశం ఉందని షైన్​.కామ్ సీఈఓ జైరస్ మాస్టర్ పేర్కొన్నారు. "హెల్త్​కేర్​లో నియామకాలు పెరుగుతాయి. ప్రజలు ఇంట్లోనే ఉండేందుకు మొగ్గు చూపుతున్నందున ఈకామర్స్, ఆన్​లైన్ డెలివరీ పోర్టల్స్​కు డిమాండ్ పెరుగుతుంది. స్వల్పకాలికంలో పర్యటకంపై ఎక్కువ ప్రభావం పడింది. అయితే త్వరలోనే ఈ రంగం కోలుకొని నియామకాలు కొనసాగిస్తాయి’ అని తెలిపారు.

ఆతిథ్యం, రిటైల్, ట్రావెల్ రంగాల్లో నియామకాలు మందగిస్తాయని 'మైఖేల్ పేజ్ ఇండియా' ఎండీ నికోలస్ తెలిపారు. వైరస్ ఉద్ధృతి కొనసాగితే దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. అయితే సాంకేతికత ఆధారిత రంగాలు ఆన్​లైన్​లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని, ఈ ప్రక్రియ తొందరగా ముగుస్తుందని నికోలస్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios