ఆర్బీఐతో ఐదేళ్లుగా టజిల్.. బట్ ఉదయ్ కొటక్ వెల్త్ మూడింతలు

By ramya NFirst Published Mar 13, 2019, 4:03 PM IST
Highlights

బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ ఆర్బీఐ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేకించి ప్రైవేట్ బ్యాంకుల నిర్వహణలో నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేలా చూస్తోంది. కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రమోటర్ ఉదయ్‌ కోటక్‌కు బ్యాంకులో 30 శాతం వాటా షేర్లు ఉన్నాయి. దీన్ని 20 శాతానికి తగ్గించి వేయాలని ఆ సంస్థ పెట్టిన నిబంధనను ఆయన సవాల్ చేశారు. ఐదేళ్లుగా కొనసాగుతున్న వివాదం ఆయన సంపద పెరుగకుండా ఆపలేకపోయాయి. ప్రస్తుతం ఉదయ్ కొటక్ సంపద రూ.80 వేల కోట్లకు చేరింది.  

ప్రతి సంస్థ సజావుగా నడవడానికి, ప్రగతి పథంలో ముందుకు వెళ్లడానికి, సంబంధిత రంగ నియంత్రణ సంస్థ ఆదేశాలకు అనుగుణంగా సాగాల్సిందే. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వంటి శక్తిమంత నియంత్రణ సంస్థతో పలు అంశాల్లో ఢీ అంటే ఢీ అంటూ.. అందుబాటులో ఉన్న రికార్డుల మేరకు తన సంస్థను లాభాల్లో నడిపిస్తున్నారు ఉదయ్‌ కోటక్‌.

దీంతోపాటు ఆయన సంపద విలువ కూడా గత అయిదేళ్లలో గణనీయంగా పెరిగింది. ఉదయ్ కొటక్ సంపద దాదాపు రూ.80 వేల కోట్ల (11.4 బిలియన్‌ డాలర్ల)కు చేరడం గమనార్హం. ముంబై కేంద్రంగా నడిచే కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (కేఎంబీ) వ్యవస్థాపకుడే ఉదయ్‌ కోటక్‌.

2014 మార్చి నుంచి ఇప్పటి వరకు ఉదయ్ కొటక్ సంపద విలువ మూడింతలైంది. మరోవైపు నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులో తన వాటా తగ్గింపులో ఉదయ్‌ విఫలమయ్యారని ఆర్బీఐ తొలిసారి అప్పుడే ప్రకటించింది. 
ఇప్పుడు కొటక్ మహీంద్రా బ్యాంకు (కేఎంబీ)లో 30 శాతం వాటా ఉదయ్‌ కోటక్‌కు ఉంది. బ్యాంక్‌ షేర్ విలువకు అనుగుణంగా, ఆయన సంపద మొత్తం దాదాపు రూ.80 వేల కోట్ల (11.4 బిలియన్‌ డాలర్ల)కు చేరినట్లు బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ చెబుతోంది.

వాస్తవవంగా గతేడాది డిసెంబర్ నాటికే బ్యాంకులో ఉదయ్‌ తన వాటాను 20 శాతం దిగువకు తగ్గించుకోవాలి. వ్యవస్థాపక వాటాదార్ల ప్రభావం బ్యాంకులపై అధికంగా ఉండకుండా, వారి వాటా ఎంతకు పరిమితమవ్వాలనే నిబంధనలను ఆర్‌బీఐ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

మొత్తం బ్యాంకింగ్ రంగానికి ఈ నిబంధనను ఆర్బీఐ వర్తింప చేస్తోంది.కానీ ఆర్‌బీఐ నిబంధనను చట్టబద్దంగా ఉదయ్‌ కోటక్‌ సవాలు చేశారు. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే, గతేడాది ప్రిఫరెన్షియల్‌ షేర్ల రూపంలో కొటక్ మహీంద్రా బ్యాంకులో రూ.500 కోట్ల విలువైన తమ షేర్లు విక్రయించామని చెబుతున్నారు. 

ఇదే సమయంలో మిగిలిన బ్యాంకులతో పోలిస్తే, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు రాణించడం ఉదయ్‌కు కలిసి వచ్చింది. ఇతర బ్యాంకులకు భిన్నంగా, ఈ బ్యాంకు ఆస్తుల నాణ్యతలో ఆందోళనలు లేకపోవడం ఉపకరించింది. 

మొత్తం కొటక్ మహీంద్రా బ్యాంక్ (కేఎంబీ) రుణాల్లో, మొండి బకాయిల వాటా అతి తక్కువ. దేశీయంగా ఇతర బ్యాంకుల్లో నికర వడ్డీ మార్జిన్‌ అధికంగా ఉన్నదిగా కేఎంబీ నిలిచింది. ఇందువల్లే గత అయిదేళ్లలో ఎన్‌ఎస్‌ఈ బ్యాంక్‌ సూచీలో కేఎంబీ షేర్లు బాగా రాణించాయి.

‘బ్యాంకుల్లో వ్యవస్థాపకుల వాటాలకు సంబంధించిన నిబంధనల అమలును ఆలస్యం చేసేందుకు ఉదయ్‌ సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియలోనే తన సంపదను గణనీయంగా పెంచుకున్నారు’అని స్మార్ట్‌కర్మ ప్లాట్‌ఫామ్‌ ప్రతినిధి హేమింద్ర హజారి పేర్కొన్నారు. ఒకవేళ ఆయన నిబంధనలను పాటించి ఉంటే, ప్రస్తుతం కంటే, చాలా తక్కువకే కేఎంబీ షేర్లను విక్రయించాల్సి వచ్చేదని ఆయన అభిప్రాయ పడ్డారు. 

ఉదయ్‌ కొటక్‌ను కనుక బలవంతంగా వాటా తగ్గించుకునేలా చేస్తే, మదుపర్లు నష్టపోతారని స్టేక్‌హోల్డర్స్‌ ఎంపవర్‌మెంట్‌ సర్వీసెస్‌ ఎండీ జేఎన్‌ గుప్తా అభిప్రాయపడ్డారు. బ్యాంక్‌ పరిమాణం దృష్ట్యా, ఉదయ్‌ వాటాను గణనీయంగా తగ్గించుకోవాలనడం సరికాదన్నారు. సెకండరీ విపణిలో షేర్లు అమ్మినా, బ్యాంక్‌ దృష్టి మళ్లుతుందని పేర్కొన్నారు.

కొటక్ మహీంద్రా బ్యాంక్ (కేఎంబీ)లో ఉదయ్‌ వాటాను 20 శాతం కంటే దిగువకు తగ్గించుకోనందున, ఆర్‌బీఐ జరిమానాలు విధించకుండా అడ్డుకోలేమని గతేడాది బాంబే హైకోర్టు కూడా స్పష్టం చేసింది. కేఎంబీ తరహాలోనే వ్యవస్థాగత వాటాదార్ల విషయంలో నిబంధనలు పాటించనందుకు, గత సెప్టెంబరులో బంధన్‌బ్యాంకుకు ఆర్‌బీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం ఆ బ్యాంక్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) చంద్రశేఖర్‌ ఘోశ్‌ వేతనం పెంచొద్దని, తమ ఆమోదం లేకుండా కొత్త శాఖలు ప్రారంభించవద్దని పేర్కొంది.

ఆర్బీఐ సూచనలను పాటిస్తున్నామని, అదే సమయంలో కంపెనీ అవసరాలు, చట్టపరమైన అంశాలకు అనుగుణంగా సాగుతున్నామని కొటక్ మహీంద్రా బ్యాంక్ (కేఎంబీ) ముఖ్య సమాచార అధికారి (సీఈఓ) రోహిత్‌రావు తెలిపారు. అందువల్ల తమ బ్యాంకుకు దురుద్దేశాలు ఆపాదించవద్దని కోరారు. 

షేర్ విలువ పెరగడంతో ఉదయ్‌తోపాటు మదుపర్లందరికీ లాభమే కలిగిందని కొటక్ మహీంద్రా బ్యాంక్ (కేఎంబీ) ముఖ్య సమాచార అధికారి (సీఈఓ) రోహిత్‌రావు గుర్తు చేశారు. ఇంతకు మించి వ్యాఖ్యానించనన్నారు. వ్యవస్థాపకుల వాటాల తగ్గింపు కోసం ఆర్‌బీఐ ఇచ్చిన గడువులను 2014, 2016లలో కేఎంబీ పూర్తిగా అమలు చేయలేదు. అయితే 2017లో మాత్రం పాటించిందని కోర్టుకు సమర్పించిన బ్యాంక్ రికార్డులు వెల్లడిస్తున్నాయి.

కోటక్ వాటా ఉపసంహరణపై ఉపశమనానికి బాంబే హైకోర్టు నిరాకరణ 

కొటక్ మహీంద్రా బ్యాంక్ (కేఎంబీ)లో ఉదయ్‌ వాటా తగ్గింపునపై కేఎంబీకి ఉపశమన ఆదేశాలు ఇచ్చేందుకు బాంబే హైకోర్టు మరోసారి మంగళవారం నిరాకరించింది. బ్యాంకు తెలిపినట్లు ఇది చిన్నపాటి వ్యవహారం కాదని పేర్కొన్నది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 1కి వాయిదా వేసింది. ‘అధికారం కేంద్రీకృతమవుతుందన్నదే ఆర్బీఐ ఆందోళన. 2020 మే వరకు ప్రమోటర్లు తమ ఓటుహక్కును 20 శాతానికి మించి వినియోగించరని హామీ ఇస్తున్నాం’ అని కేఎంబీ కోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై మధ్యంతర ఉపశమనం ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

click me!