చంద్రబాబుకు ఝలక్: టీడీపీకి బొడ్డు భాస్కరరామారావు రాజీనామా

By Nagaraju penumalaFirst Published Mar 16, 2019, 6:05 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలను తట్టుకోలేకపోయిన ఆయన తెలుగుదేశం పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన భవిష్యత్ కార్యచరణ రెండు రోజుల్లో ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అయితే పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్న డిప్యూటీ సీఎం, ఏపీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పను ఓడించి తీరుతానని హెచ్చరించారు.

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బొడ్డు భాస్కరరామారావు రాబోయే ఎన్నికల్లో పెద్దాపురం అసెంబ్లీ నుంచి పోటీ చెయ్యాలని భావించారు. 

పెద్దాపురం టికెట్ పై సీఎం చంద్రబాబు నాయుడుతో సైతం చర్చించారు. అయితే చంద్రబాబు నాయుడు పెద్దాపురం టికెట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చారు. పెద్దాపురం అసెంబ్లీ టికెట్ ను మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి చినరాజప్పకే కేటాయించారు. 

అయితే రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చెయ్యాలంటూ బొడ్డుకు చంద్రబాబు సూచించారు. అయిష్టంగానైనా రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. 

అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెరపైకి మాజీఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూప, ముళ్లపూడి రేణుకల పేర్లు తెరపైకి రావడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం టికెట్ దాదాపుగా మాగంటి రూపకే ఖరారయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. 

తెలుగుదేశం పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలను తట్టుకోలేకపోయిన ఆయన తెలుగుదేశం పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన భవిష్యత్ కార్యచరణ రెండు రోజుల్లో ప్రకటిస్తానని స్పష్టం చేశారు. 

అయితే పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్న డిప్యూటీ సీఎం, ఏపీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పను ఓడించి తీరుతానని హెచ్చరించారు. బొడ్డు రాజీనామా వ్యవహారం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  

click me!