Three Capitals Bill: మూడు రాజధానులపై జగన్ ఎందుకు వెనక్కి తగ్గారు?.. మరో బిల్లు ఇప్పట్లో లేనట్టేనా?

By team teluguFirst Published Nov 22, 2021, 5:39 PM IST
Highlights

మూడు రాజధానులను (Three Capitals) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకన్న YS Jagan సర్కార్.. ఇందుకు సంబంధించి తీసుకొచ్చిన బిల్లును వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ నిర్ణయం వెనక కారణాలు ఏమిటనే చర్చ సాగుతుంది. అంతేకాకుండా వికేంద్రీకరణపై సమగ్రమైన బిల్లు (Decentralisation bill) తీసుకురావడంపై జగన్ ఎంత సమయం తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది

మూడు రాజధానులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది (Three Capital Bill withdraws). ఇందుకు శాసన సభ ఆమోదం తెలిపింది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మాట్లాడిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (CM YS Jagan) కూడా.. అధికార వికేంద్రీకరణే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు తెచ్చామని చెప్పుకొచ్చిన సీఎం జగన్.. కొందరికి అన్యాయం జరుగుతుందనే వాదనను తెరపైకి తెచ్చారని అన్నారు. బిల్లును మరింతగా మెరుగుపరచడానికి ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. చట్టపరంగా, న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులో పొందుపరిచేందుకు ఈ నిర్ణయం తీసున్నామని తెలిపారు. మళ్లీ సమగ్రమైన పూర్తి వికేంద్రీకరణ బిల్లుతో వస్తామని తెలిపారు. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడటం కోసమే ఈ నిర్ణయం అని చెప్పారు. 

అయితే సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లు (AP Decentralisation and Inclusive Development of All Regions Repeal Bill) తీసుకురావడానికి ముందు.. ప్రభుత్వ సదుద్దేశాని ప్రజలకు వివరించనున్నట్టుగా, మార్పులు అవసరమైతే వాటిని పొందుపరుస్తామని,  అన్ని ప్రాంతాలకు విస్తృతంగా వివరిస్తామని చెప్పారు. బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (Buggana Rajendranath Reddy) కూడా సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. ఇవన్నీ చూస్తే సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లు తీసుకురావడానికి చాలా సమయమే పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సంప్రదింపులు ప్రక్రియ ఒకటి రెండు నెలలలో ముగిసే ప్రక్రియ కాదు. ఇందుకోసం ప్రభుత్వం ఎలాంటి ప్రక్రియ చేపడుతుందనేది కూడా కీలకం కానుంది.

మూడు రాజధానులను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకన్న YS Jagan సర్కార్.. ఇందుకు సంబంధించి తీసుకొచ్చిన బిల్లును వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందుకు సంబంధించి జగన్ సర్కార్ భారీ కసరత్తే చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాలు, మరోవైపు న్యాయవ్యవస్థ నుంచి ఎదురవుతున్న చిక్కులు వీటికి ప్రధానమైన కారణాలుగా కనిపిస్తున్నాయనే చర్చ సాగుతుంది. 

తొలి నుంచి గట్టిగా పోరాడుతున్న రైతులు..
వైఎస్ జగన్ వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చినప్పటి నుంచి అమరావత్రి ప్రాంత రైతులు (Amaravati farmers) వారి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. 700 రోజులకు పైగా రైతులు విరామం లేకుండా దీక్షలు కొనసాగిస్తున్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని వారు న్యాయస్థానాలను ఆశ్రయించారు. తాము ప్రభుత్వం హామీ ఇవ్వడంతో.. వేలాది ఎకరాలను ఇచ్చామని.. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తూ వచ్చారు. తాజాగా న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో పాదయాత్ర (amaravati farmers padayatra) చేపట్టారు. 

రైతుల నుంచి దాఖలైన పిటిషన్లపై కోర్టుల నుంచి ప్రభుత్వానికి తొలి నుంచి ఎదురుదెబ్బలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇటీవల ఈ పిటిషన్లపై రోజువారి విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. అమరావతి.. అక్కడి రైతుల రాజధాని కాదని.. రాష్ట్రానికి రాజధాని అని చెప్పారు.  రాజధాని రైతులు చేస్తున్న పోరాటాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా (justice prashant kumar mishra) స్వాతంత్య్ర పోరాటంతో పోల్చడం కూడా జరిగింది. హైకోర్టు ప్రధాన బెంచ్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇచ్చారని, కేంద్రం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయనంత వరకు అమరావతి నుంచి హైకోర్టు ఎక్కడికీ వెళ్లబోదని జస్టిస్ ప్రశాంత్‌కుమార్ స్పష్టం చేశారు. హైకోర్టు లేకుండా కర్నూలులో న్యాయ రాజధాని ఎలా సాధ్యమని ప్రశ్నించారు. విచారణ ఇలా సాగుతున్న నేపథ్యంలో.. తుది తీర్పు(విచారణ చేపట్టిన న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యాలపై) ఆధారపడి ఉంటే.. బిల్లలుకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావించి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుల చట్టబద్దతపై తొలి నుంచి వివాదాలు చోటుచేసుకోవడం, మండలిలో వ్యతిరేకించడం(టీడీపీ మెజారిటీ ఎక్కువగా ఉన్న సమయంలో), తర్వాత సెలక్ట్ కమిటీకి పంపడం.. ఇలాంటివి చర్చనీయాంశంగా ఉన్నాయి. అలాగే.. ప్రభుత్వం రూపొందించిన బిల్లులో లోసుగులు ఉండటం, సాంకేతిక పాయింట్లు కూడా బలంగా లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయంపై దాదాపు రెండేళ్ల తర్వాత వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి ఈ బిల్లను ఉపసంహరించుకుంటామని.. మళ్లీ సమగ్రమైన బిల్లుతో ముందుకు వస్తామని చెప్పింది.  

ఇప్పట్లో మరో బిల్లు తీసుకొచ్చే చాన్స్ తక్కువే..
అయితే వైసీపీ ప్రభుత్వం వికేంద్రీకరణకు సంబంధించి వేగంగా బిల్లు తీసుకొచ్చే అవకాశాలు లేనట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలే కారణమని వారు అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతానికి బిల్లు వెనక్కి తీసుకున్నారని.. ఇప్పట్లో కొత్తగా బిల్లు తీసుకొచ్చే అవకాశం కూడా ఉండదని అంచనా వేస్తున్నారు. ఇందుకు అమరావతి రైతుల చేపట్టిన పాదయాత్రకు కొంతమేర మద్దతు లభించడం, ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీ కొంతవరకు పుంజుకోవడం కారణమని వారు అంటున్నారు. 

అమరావతి రైతుల పాదయాత్రకు మీడియా కవరేజ్ ఎక్కువగా దక్కడం, కొన్ని చోట్ల పోలీసులు వారి యాత్రపై హైకోర్టు ఆదేశాల పేరుతో ఆంక్షలు విధించడం విస్తృతంగా జనాల్లోకు బలంగా వెళ్లింది. రోజువారి దీక్షల కన్నా పాదయాత్రకు మెరుగైన మైలేజ్ లభించిందనే చెప్పాలి. ఇది కూడా ప్రభుత్వం వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకోవడానికి కారణమని అంటున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమరావతి ప్రాంత రైతులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. 

ఈ ఏడాది తొలుత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో.. అన్ని కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకన్న సంగతి తెలిసిందే. ఒక్క తాడిపత్రి మాత్రమే టీడీపీ దక్కించుకుంది. టీడీపీకి ఇది ఘోర ఓటమి అనే చెప్పారు. అయితే తాడిపత్రి విజయం కూడా జేసీ సోదరుల కారణంగానే సాధ్యమైందని వాదన కూడా ఉంది. చాలా మంది దీనినే విశ్వసిస్తున్నారు కూడా. అయితే మొన్న పెండింగ్‌లో ఉన్న స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. వైసీపీ విజయం సాధించిన గతంలో మాదిరిగా హవాను కొసాగించలేపోయింది. ఎందుకంటే టీడీపీ కుప్పంలో ఒడినప్పటికీ.. దర్శిని తన ఖాతాలో వేసుకుంది. కృష్ణా జిల్లా కొండపల్లిలో వైసీపీ గట్టి పోటి ఇచ్చింది.. ఆ పీఠాన్ని దక్కించుకోవడానికి పావులు కదుపుతోంది. మరో రెండు మూడు చోట్ల ఓడిపోయిన చెప్పుకొదగ్గ స్థానాలను కైవసం చేసుకోంది. అప్పుడు 75 మున్సిపాలిటీల్లో ఒకటి మాత్రమే దక్కించుకున్న టీడీపీ.. ఇప్పుడు 12 మున్సిపాలిటీలో ఒకటి ఖాతాలో వేసుకుని, మరో స్థానాన్ని దక్కించుకోవడానికి జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. అందుకు అవసరమైన మెజారిటీ కూడా ఉంది. అంటే ఒకరకంగా అర్భన్ ఓటర్లలలో కొంతమార్పు కనిపించిందనే టాక్ నడుస్తోంది. 

మరో రెండున్నరేళ్ల వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఇలాంటి సమయాల్లో రాజధాని విషయంలో వివాదాలకు తావివ్వకుండా జగన్ పాలన సాగించాలని భావిస్తున్నట్టుగా జగన్ భావిస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు జగన్ రాజధాని బిల్లులపై తీసుకున్న నిర్ణయంతో.. అమరావతి రైతులపై ఫోకస్ తగ్గే అవకాశం ఉంటుందని వారు అంటున్నారు. సమగ్ర బిల్లు పేరుతో జగన్.. ఆ అంశంపై రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకావం ఉందని చెబుతున్నారు. ఇప్పట్లో ఎన్నికలు లేనందను జగన్‌కు వచ్చిన తొందరేమీ లేదని.. సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పినందున ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించే సందర్భాలు ఉండకపోవచ్చని అంటున్నారు. 

రాజకీయ పరిణామాల విషయానికి వస్తే.. ఇటీవలికాలంలో డ్రగ్స్‌కు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్‌గా మారుతుందనే ఆరోపణలు, అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, అసెంబ్లీలో తన భార్యను దూషించారని చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం వంటివాటిని కూడా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

జగన్ పాలనపై.. 
వైఎస్ జగన్ రెండున్నరేళ్ల పాలన పూర్తయిందని.. ప్రభుత్వంపై ప్రజలు ఓ అభిప్రాయం ఏర్పరుచుకోవడం ఇప్పటి నుంచే ప్రారంభమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వం కూడా తమ పాలనపై ప్రజాభిప్రాయాన్ని నిఘా వర్గాల నుంచి ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటుందని వారు చెప్పారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఏ మాత్రం వ్యతిరేకత వచ్చిన అది భవిష్యత్తుల్లో ఇబ్బందికర పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని వైఎస్ జగన్ భావించి ఉంటారని విశ్లేషకులు అంటున్నారు. 

కోర్టు బిల్లులను తప్పుబడితే ప్రతికూల ప్రభావం..
ఎలాగూ దాదాపు రెండేళ్లుగా మూడు రాజధానుల బిల్లు ముందుకు సాగడం లేదని, ఇప్పుడు ఆ బిల్లులను ఉపసంహరించుకోవడం వల్ల జరిగే నష్టమేమి లేదని ప్రభుత్వం భావిస్తోన్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు కోర్టులు (Courts) ఆ బిల్లులకు వ్యతిరేకంగా తీర్పులు వెలువరిస్తే.. ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉంటుందని వారు అంటున్నారు. అందుకే ప్రభుత్వం వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకుందని.. అదే సమయంలో త్వరలోనే సమగ్రమైన బిల్లు తీసుకోస్తామని చెప్పడం ద్వారా ఈ అంశంలో ఎవరిని నొప్పించకుండా కొంతకాలం కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా అమరావతి ప్రాంతం అంటే తనకు కోపం లేదని.. రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ది కావడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ చాలా తేలివిగా ప్రకటన చేశారు. 


అమరావతి రైతులకు బీజేపీ మద్దతు కారణమా..?
అమరావతి రైతులకు బీజేపీ మద్దతు తెలుపడం (bjp supports amaravati) జగన్ నిర్ణయాని కారమణమని కొందరు చెప్తున్నప్పటికీ.. మెజారిటీ సంఖ్యలో అదేమీ ఉండకపోవచ్చని వారు అంటున్నారు. అయితే బీజేపీ అధినాయకత్వం అమరావతి విషయంలో స్టాండ్ తీసుకోవడం, బీజేపీ నేతలు అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పి.. వారం రోజులు కూడా కావడం లేదని.. అలాంటప్పుడు జగన్ ఇంతలోనే అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా అని వారు ప్రశ్నిస్తున్నారు. దీని వెనక చాలా రోజులు కసరత్తు చేశారని.. ప్రస్తుతం ఉన్న పలు అంశాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం వెలువరించారని వారు అంటున్నారు. 

click me!