టిడిపి-భాజపా పొత్తుపై క్లారిటి

First Published Jan 29, 2018, 10:22 AM IST
Highlights
  • ఈరోజు నుండి మొదలవుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో టిడిపి సీన్ ఏంటో అర్ధమైపోతుంది.

ఈరోజు నుండి మొదలవుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో టిడిపి సీన్ ఏంటో అర్ధమైపోతుంది. గడచిన మూడున్నరేళ్ళల్లో కేంద్ర ప్రభుత్వం ఏ దశలోనూ టిడిపిని లెక్క చేయలేదు. అవటానికి ఎన్డీఏ మిత్రపక్షమే అయినా చంద్రబాబునాయుడును ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏ విషయంలో కూడా పరిగణలోకి తీసుకోలేదన్న విషయం అందరకీ తెలిసిందే. చివరకు ప్రధాని అపాయిట్మెంట్ కోసం చంద్రబాబు ఏడాదిన్నర నిరీక్షించాల్సి వచ్చింది.

ఇటువంటి నేపధ్యంలోనే పోలవరం నిర్మాణం, రాజధాని, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు, రెవిన్యూలోటు భర్తీ ఇలా..ఏ అంశం తీసుకున్నా రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యే చూపిందన్నది వాస్తవం. మళ్ళీ ఎన్నికలు తరుముకొచ్చేస్తున్నాయ్. ఇంతకాలం కేంద్రాంన్ని పల్లెత్తు మాటనని చంద్రబాబు ఇపుడిప్పుడే ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. అందుకు వచ్చే ఎన్నికలే కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మూడున్నరేళ్ళ పాలనపై ప్రజల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతను కేంద్రంపై మళ్ళించి తాను లబ్దిపొందుదామన్నది చంద్రబాబు ఆలోచన. ఆ విషయాన్ని గ్రహించిన మిత్రపక్షం భారతీయ జనతాపార్టీ కూడా చంద్రబాబుకు ఎదురుదాడి మొదలుపెట్టింది. మొత్తానికి టిడిపి-భాజపా మధ్య సంబంధాలు క్షీణిస్తున్నది వాస్తవం.  

ఇటువంటి పరిస్ధితుల్లో సోమవారం నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ సందర్భంలోనే విభజన హామీల అమలు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రప్రభుత్వంపై టిడిపి ఒత్తిడి పెంచాలని టిడిపి అనుకుంటోందట. కేంద్రమంత్రి అనంతనాగ్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్డీఏ మిత్రపక్షాల  సమావేం జరిగింది. సమావేశంలో కేంద్రంమంత్రితో పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహం విభజన హామీల గురించి ప్రస్తావించారు.   

తర్వాత మీడియాతో మాట్లాడుతూ, విభజన హామీల అమలుపై కేంద్రంపై ఒత్తిడి  పెంచుతామని చెప్పారు. మూడున్నరేళ్ళు గడిచినా కేంద్రం హామీలు అమలు కాకపోవటం అన్యాయమన్నారు. అంటే టిడిపి వరస చూస్తుంటే జనాల కోసమైనా కేంద్రప్రభుత్వాన్ని నిలదీయక తప్పదని అనుకున్నట్లుంది. అందులో భాగంగానే పోయిన శీతాకాల సమావేశంలో ‘తలాక్’ బిల్లును వ్యతిరేకించింది. అదే బిల్లు మళ్ళీ ఈసారి సమావేశాల్లో చర్చకు వస్తోంది. ఇపుడేం చేస్తుందో చూడాలి? ఒకవేళ భాజపాతో గనుక పొత్తు వద్దనుకుంటే టిడిపి ఎన్డీఏకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. అంటే టిడిపికి ఈ పార్లమెంటు సమావేశాలు చాలా కీలకమనే చెప్పాలి.

click me!