జాక్ సినిమాతో నిర్మాతకు నష్టం వచ్చిందని తెలుసుకున్న సిద్ధూ జొన్నలగడ్డ తన సగం పారితోషికం తిరిగి ఇచ్చేశాడు.
డిజాస్టర్ అయిన జాక్ మూవీ
యువ నటుడు సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. రొమాంటిక్ కామెడీ జోనర్ చిత్రాల్లో సిద్ధూ జొన్నలగడ్డ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. అయితే ఇటీవల విడుదలైన ఆయన తాజా చిత్రం జాక్ బాక్సాఫీస్ వద్ద పూర్తిగా విఫలమైంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది.
నిర్మాతకి భారీ నష్టాలు
ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఫలితంగా బడ్జెట్ ఖర్చులో 10 శాతం కూడా రాబట్టలేకపోవడంతో, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ చిత్రంతో బయ్యర్లు కూడా నష్టపోయారు. ముఖ్యంగా నైజాం హక్కులను రూ.10 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ తీవ్రంగా నష్టపోయాడు.
రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన సిద్ధూ
ఈ పరిస్థితిని గుర్తించిన సిద్ధూ తన గొప్ప మనసు చాటుకున్నాడు. నిర్మాతని, డిస్ట్రిబ్యూటర్ లని ఆదుకోవడం తన బాధ్యతగా భావించిన సిద్ధూ తన పారితోషికం నుంచి రూ.4 కోట్లు నిర్మాతకు తిరిగి ఇచ్చేశాడు. అంటే సిద్ధూ జొన్నలగడ్డ తన రెమ్యునరేషన్ లో సగం వదులుకున్నాడు. సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు హీరోలు చాలా అరుదుగా తమ పారితోషికం తిరిగి వెనక్కి ఇచ్చేస్తుంటారు. నిర్మాతపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు చొరవ చూపిన సిద్ధూ జొన్నలగడ్డపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సంఘటనతో టాలీవుడ్ లో నిర్మాతలలో సిద్ధూ జొన్నలగడ్డపై మరింతగా పాజిటివ్ ఇమేజ్ పెరుగుతుంది.
సిద్ధూ జొన్నలగడ్డ నెక్స్ట్ మూవీ
ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ తన తదుపరి చిత్రం “తెలుసు కదా” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. “జాక్” తర్వాత తన కెరీర్‌ను మళ్లీ సరైన దిశలో తీసుకెళ్లే ఉద్దేశంతో సిద్ధూ ఈ సినిమాపై పూర్తి దృష్టి పెట్టినట్లు సమాచారం.


