అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ ఈవారం ఇసుక కొరత అంశంపైనే చక్కర్లు కొట్టాయి. ఇసుకకొరతను రాజకీయ అస్త్రంగా చేసుకున్నాయి విపక్షాలు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిరసనలకు దిగింది. 

చంద్రబాబు నాయుడు తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఒక్కరోజు నిరహార దీక్షకు సైతం దిగారు. ఇసుక కొరతపై ప్రభుత్వ తీరును తప్పుబడుతూ నారా లోకేష్ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. 

తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనలకు దిగడంతో అటు భవన నిర్మాణ కార్మికులు సైతం ఆందోళనబాట పట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఇసుక కొరతను నివారించాలంటూ పలు రకాలుగా నిరసనలు తెలిపారు. 

ఇక చంద్రబాబు నాయుడు అయితే ఇసుకకొరత అంశంపై సమరశంఖారావం పూరించారు. ఇసుక కొరత వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డ బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధిత కటుంబాలకు ఆర్థికంగా సహాయం ప్రకటించారు చంద్రబాబు నాయుడు. 

మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇసుక కొరత అంశాన్ని ఎజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహరచన చేశారు. నవంబర్ 3న విశాఖపట్నం వేదికగా జనసేన లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. 

అంతవరకు పలు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో జనసైనికులు జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరసనలకు దిగారు. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఆందోళన చేపట్టారు. 

ఇదిఇలా ఉంటే బీజేపీ సైతం వైసీపీ ప్రభుత్వంపై చురకలు అంటించింది. గాంధీ సంకల్పయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టిన బీజేపీ నేతలు అవకాశం చిక్కినప్పుడుల్లా ఇసుక కొరతను భూతద్దంలో చూపిస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.  

లక్షలాదిమంది కార్మికులను రోడ్డుపాలు చేసిన ఇసుక సమస్యపై బీజేపీ మొదటినుండి రాజీలేని పోరాటంచేస్తూ గవర్నర్,సీఎం దృష్టికి తెచ్చి భిక్షాటనతో ప్రజాపక్షాన నిలిచాని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అంతేకాదు నవంబర్ 4న బీజేపీ ఆధ్వర్యంలో ఇసుక సత్యాగ్రహం చేపట్టనున్నట్లు ప్రకటించింది. 

అటు వామపక్ష పార్టీలు సైతం ఇసుకకొరత అంశంపై పోరాటాన్ని ఉధృతం చేశాయి. అర్థనగ్నంగా నిరసన ప్రదర్శనలకు దిగారు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి భిక్షాటన చేశాయి. ఇసుక కొరతపై సీఎం జగన్ కు లేఖాస్త్రాలు సంధించాయి వామపక్షాలు. 

ఇసుక కొరతపై విపక్షాలన్నీ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దిగిరావాల్సి వచ్చింది. ఐదు నెలలుగా విపక్షాల ఒత్తిడికి తలొగ్గని సీఎం జగన్ ఇసుకకొరత అంశంలో ఒక మెట్టుదిగారు. 

ఒకవైపు చంద్రబాబు నాయుడు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడం మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా లాంగ్ మార్చ్, నవంబర్ 4న బీజేపీ ఇసుకసత్యాగ్రం కు పిలుపునివ్వడంతో జగన్ అప్రమత్తమయ్యారు. వారికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో జగన్ ఇసుక వారోత్సవాలకు పిలుపు ఇచ్చారు. 

వారం రోజులపాటు ఇసుకపైనే పనిచేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల తర్వాత ఇసుక కొరత అనే పదం వినకూడదంటూ అధికారులకు స్పష్టం చేశారు. మెుత్తం ఇసుక కొరత కేంద్రంగా ఏపీ రాజకీయాలు నడిచాయి. 

ఈ వార్తలు కూడా చదవండి

పొత్తు పొడుపు: ఇసుక సాక్షిగా పవన్ కల్యాణ్ తో చంద్రబాబు దోస్తీ

వంశీ దెబ్బ: చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా చేసిన జగన్ వ్యూహం

అది ప్రజల హక్కు దాని పై మీ బోడిపెత్తనం ఏంటి: జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపాటు

చంద్రబాబు-పవన్ ల వ్యూహానికి జగన్ చెక్ : నేరుగా రంగంలోకి సీఎం, ఇక సమరమే

క్వారీ కోసమే సామాన్యులపై కేసులు...: వైసిపి ఎమ్మెల్యేపై కాల్వ శ్రీనివాసులు ఆరోపణ

మంత్రి పదవికి రాజీనామా చేస్తా: అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు