అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇసుక "తుఫాన్"సృష్టిస్తోంది. ఐదునెలలుగా వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు ఎన్నో రాద్ధాంతాలు చేసినప్పటికీ దిగిరాని సీఎం జగన్ ను మెట్టుదిగేలా చేసింది ఇసుక రాజకీయం. 

ఇసుక కొరతపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఒక దఫాగా నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పురాకపోవడంతో సమరశంఖారావం పూరించింది. బుధవారం మాజీమంత్రి నారా లోకేష్ ఒక్కరోజు నిరసన దీక్షకు దిగారు. 

మరోవైపు జనసేన పార్టీ సైతం ఇసుక కొరతపై విశాఖలో ఈనెల 3న లాంగ్ మార్చ్ కు పిలుపు ఇచ్చారు. నారా లోకేష్ ఒక్కోరోజు నిరసన దీక్షకు తెలుగు తమ్ముళ్లు ఏర్పాట్లు చేస్తుంటేలాంగ్ మార్చ్ కోసం జనసేన పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఒకవైపు తెలుగుదేశం పార్టీ, మరోవైపు జనసేన పార్టీ నిరసనలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతుంది. అయితే ఈ ఇసుకకొరత అంశాన్నే లక్ష్యంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం జగన్ అప్రమత్తమయ్యారు. 

జనసేన పార్టీకి గానీ, తెలుగుదేశం పార్టీకి గానీ ఎలాంటి మైలేజ్ రాకుండా ఉండేందుకు సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగారు. గత ఐదు నెలలుగా ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేసినా దిగిరాని జగన్ దిగిరాక తప్పలేదు. విపక్షాలకు తావివ్వకుండా దిద్దుబాటు చర్యలకు రంగంలోకి దిగారు. 

ఇసుక కొరతను భూతద్దంలో చూపించి మేలుపొందాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని వారు ఆశించింది రాకుండా ఉండేందుకు అడ్డుకట్ట వేశారు. రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలకు ఆదేశాలు జారీ చేశారు. 

ఇసుక తవ్వకాలు, పంపిణీపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక వారోత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. వారం రోజులపాటు ఇసుక మీదే పనిచేసి ఇసుక కొరత గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూడాలని ఆదేశించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్ష పార్టీ నేతలు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పళ్లు ఇచ్చే చెట్టుపైనే రాళ్లు వేస్తున్నారు. గతంలో వ్యవస్థ తీవ్ర అవినీతి మయమైందని దాన్ని పూర్తిగా రిపేర్ చేస్తున్నట్లు తెలిపారు. ఇసుక పాలసీ విధానంలో ఎక్కడైనా అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించారు. 

ఇసుక తవ్వకాలను అవినీతికి దూరంగా పెట్టగలిగామని గర్వంగా చెప్పగలమని జగన్ తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు, వరదలు వస్తున్నాయని అందువల్లే ఇసుకలభ్యత ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. 

వర్షాలు కురవడం రైతులకు మంచిదేనని చెప్పుకొచ్చారు. దోచేసిన ఇసుక స్థానంలో కొత్త ఇసుక వచ్చి చేరడం కూడా మంచిదేనని అయితే రాబందుల మాదిరిగా మనపై రాళ్లు వేస్తున్నారని జగన్ మండిపడ్డారు.  

ఇసుక వారోత్సవం అని కార్యక్రమం పెడతామన్న సీఎం జగన్ వారం రోజులు ఇసుక మీదే పనిచేద్దాయాలన్నారు. ఇసుక గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూద్దామన్నారు. వచ్చే వారం రోజుల్లో పరిస్థితులు మెరుగవుతాయని ధీమా వ్యక్తం చేశారు. 
 
ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక వెళ్లకూడదన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల వద్ద గట్టి పహారా ఉండాలన్న సీఎం డీజీపీ స్వయంగా దీనిని పర్యవేక్షించాలన్నారు. 

ఎంత బాగా పనిచేసినా ప్రభుత్వంపై విమర్శలు వస్తూనే ఉంటాయన్నారు. విమర్శలకు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఇప్పుడు పని దొరకడం లేదన్నది సరికాదన్న సీఎం జగన్  గతంలో అవినీతి , మాఫియాతో ఇసుకను తరలించేవారు. 

ఇప్పుడు ప్రభుత్వం అధీనంలోనే ఇసుక రవాణా జరుగుతుంది. మరింతగా కార్మికులకు పనులు లభిస్తాయి. పట్టాభూములున్న రీచ్‌ల్లో తప్ప మిగతా చోట్ల మాన్యవల్‌గా ఇసుక తీయాలని చెప్పామన్నారు. వరదలు తగ్గేలోగా వాగులు, వంకల్లో 70 చోట్ల రీచ్‌లను గుర్తించినట్లు సీఎం జగన్ తెలిపారు. 

ఇకపోతే ఇసుకకొరతపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై సమర శంఖారాం పూరించారు. నేరుగా తనయుడు నారా లోకేష్ నే రంగంలోకి దింపారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కి పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగడం ఇసుక వారోత్సవాలకు పిలుపు ఇవ్వడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 

జగన్ ఇసుకకొరతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తే తెలుగుదేశం, జనసేన పార్టీలు సందిగ్ధంలో పడాల్సిన పరిస్థితి నెలకొంది. మెుత్తానికి విపక్షాల ఆందోళనకు జగన్ దిగొచ్చారా లేదా అన్నది ఎలా ఉన్నప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు చెక్ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. నేరుగా జగన్ రంగంలోకి దిగడంతో రాజకీయం రసవత్తరంగా ఉంటుందని పొలిటికల్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  

ఈ వార్తలు కూడా చదవండి

ఇసుకపై టీడీపీ పోరాటం: గుంటూరులో లోకేష్ నిరసన దీక్ష