పోలీస్ వాహనం ఢీకొని దంపతుల మృతి... 60మందికి తప్పిన ప్రమాదం
వరంగల్ జిల్లాలో ఓ ఆర్టీసి డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కొద్దిలో 60 మంది ప్రయాణికుల ప్రాణాలను బలితీసుకునేది. బస్సు పెను ప్రమాదానికి గురయినా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
వరంగల్: ఆర్టీసి డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ 60మంది ప్రయాణికుల ప్రాణాలు బలయ్యేవి. ప్రయాణికులతో వెళుతున్న బస్సు పెను ప్రమాదానికి గురయినప్పటికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమల్యపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెగ్యులర్ మార్గంలో కాకుండా వేరేదారిలో బస్సును పోనిచ్చి దాదాపు 60మంది ప్రయాణికుల ప్రాణాలతో ఆర్టీసి డ్రైవర్ చెలగాటం ఆడాడు. వరంగల్ నుండి తొర్రూరు కు వెళుతున్న ఆర్టీసి బస్సు 11 కేవీ విద్యుత్ తీగలను తాకి ప్రమాదానికి గురయ్యింది. ఈ సమయంలో విద్యుత్ సరఫరా వెంటనే ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఇటీవల పాలకుర్తి సీఐ వాహనం ఢీకొని భార్యభర్తలు మరణించిన విషయం తెలిసిందే. దీంతో మృతుల కుటుంబసభ్యులు బుధవారం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై మృతదేహాలతో ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఈ విషయాన్ని గుర్తించిన ఓ ఆర్టీసి డ్రైవర్ బస్సును దారి మళ్లించాడు. తెలియని మార్గంలో వెళుతుండగా బస్సు ఒక్కసారిగా విద్యుత్ వైర్లను తాకింది. దీంతో బస్సులో కరెంట్ ప్రవహించే లోపే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. బస్స్ కరెంట్ తీగలకు తాకగానే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో టైర్లు పేలిపోయాయని... అలాగే తీగలు కూడా తెగిపడ్డాయని తెలిపారు. విద్యుత్ సరఫరా వెంటనే నిలిచిపోవడంతో తాము సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులు తెలిపారు.