వరంగల్: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనిపర్తి గ్రామంలో దారుణమైన హత్య జరిగింది. గ్రామానికి చెందిన తుమల్లపెల్లి వంసీ (24) అనే ఎంబీబీఎస్ విద్యార్థిని దుండగులు హత్య చేశారని అనుమానిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని చంపేసి చేతులూ కాళ్లూ కట్టేసి బావిలో పడేశారని భావిస్తున్నారు. అయితే, ఆత్మహత్య కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..... వంశీ ఖమ్మంలోని మమత వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.. సంక్రాంతి సెలవులకు అతను స్వగ్రామం వచ్చాడు. శుక్రవారం ఉదయం తిరిగి కళాశాలకు వెళ్లాడు. అదే రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు అతనికి ఫోన్ చేశారు. తాను ఖమ్మం కళాశాలకు చేరుకున్నట్లు వంశీ తల్లిదండ్రులకు చెప్పాడు. 

తండ్రి శనివారం ఉదయం 11 గంటలకు తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. బావికి సమీపంలో దుస్తుల బ్యాగ్, మొబైల్ ఫోన్, చెప్పులు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చి బావిలో గాలించాడు. కాళ్లు చేతులూ కట్టేసి ఉన్న తన కుమారుడి శవం కనిపించింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బావి సమీపంలోని కరెంట్ స్తంభానికి సీసీ కెమెరా ఉంది. ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.