పుట్టింటికి అత్తింటికి మధ్య భూవివాదం... అక్కా తమ్ముడు ఆత్మహత్య
రక్తసంబంధీకుల మద్య భూమి కోసం రేగిన చిచ్చు ఇద్దరిని బలితీసుకుంది.
వరంగల్: ఆస్తి కోసం గొడవపడి అక్కా తమ్ముడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్న విషాద సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో చోటుచేసుకుంది. మరో యువతి కొన ఊపిరితో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఇలా రక్తంసంబంధీకు మద్య భూమి కోసం రేగిన చిచ్చు ఇద్దరిని బలితీసుకుంది.
వివరాల్లోకి వెళితే... వరంగల్ అర్బన్ జిల్లా నక్కలపల్లికి చెందిన మహ్మద్ రబ్బాని, సైదాబి అక్కాతమ్ముడు. సైదాబికి అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమయ్యింది. అయితే వీరిద్దరి వ్యవసాయ భూములు పక్కపక్కనే వుండటంతో గతకొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. అత్తింటివారికి పుట్టింటివారికి మధ్య జరుగుతున్న గొడవల్లో నలిగిపోయిన సైదాబి ఆత్మహత్య చేసుకుంది.
గత ఆదివారం గ్రామ పెద్దల సమక్షంలో భూమి విషయంలో పంచాయితీ జరిగింది. ఈ క్రమంలోనే అక్కా తమ్ముడు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి చెందిన అక్కా తమ్ముడు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రబ్బానీ కూతురు మెహరున్నిసా(22) కూడా బలవన్మరణానికి పాల్పడింది.
రబ్బాని, మెహరున్నిసా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఎంజిఎంలో చికిత్సపొందుతూ రబ్బాని మృతిచెందాడు. అతడి సోదరి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మెహరున్నిసా పరిస్థితి విషమంగా వుంది. ఇలా భూవివాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకోగా మరొకరిని ప్రాణాలమీదకు తెచ్చింది.