కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. పామర్రు నియోజకవర్గంలో టీడీపీ నేతపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. తొట్లవల్లూరు మండలం చాగంటిపాడు గ్రామానికి చెందిన మట్టా అమృతబాబు తెలుగుదేశం పార్టీకి కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.

గత ఎన్నికల్లో పార్టీకి వెన్నెముకగా ఉంటూ వస్తున్నారు. ఇతనిపై అక్కసు పెంచుకున్న స్థానిక వైసీపీ నేతలు అధికారంలోకి రాగానే అమృతబాబు నడుపుతున్న టిఫిన్ సెంటర్‌ను మూసివేయించారు.

అయినప్పటికీ తమకు లొంగకపోవడంతో సోమవారం ఆయనపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రగాయాలతో ఉన్న అమృతబాబును ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.