విజయవాడ బస్టాండ్ లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సదరు మహిళ బస్టాండ్ లోని 37వ ప్లాట్ ఫాం దగ్గర ఏటీఎం ముందు కూర్చొని ఒక్కసారిగా కుప్ప కూలిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు పరిశీలించగా.. అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. 

మృతురాలు తూర్పుగోదావరి జిల్లా కలవచర్లకు చెందిన గానుగల నిర్మలగా గుర్తించారు. కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే పోలీసులకు ఆమె బంధువుల సమాచారం కనుక్కొని వారికి సమాచారం అందించారు. కాగా.. సదరు మహిళ ఎలా చనిపోయిందన్న విషయం మాత్రం తెలియలేదు. ఆమె అసలు విజయవాడ బస్టాండ్ లో ఎందుకు ఉంది, ఎలా చనిపోయిందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  హత్య, ఆత్మహత్య, అనారోగ్యంతో చనిపోయిందా అనే విషయం తెలియలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.