Weather Update: బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు !
Andhra Pradesh Rains: ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు గురువారం, శుక్రవారం సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక శుక్రవారాల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం, ఉత్తరాంధ్రలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది.
IMD Warns Of Cyclonic Storm: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారడంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాత్రి విశాఖపట్నానికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం ఉత్తర దిశగా పయనించి గురువారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారుతుందని అంతకుముందు భారత వాతావరణ శాఖ పేర్కొంది.
ఇది తన దిశను మార్చుకుని ఈశాన్య బంగాళాఖాతం వైపు ఈశాన్య దిశగా పయనించి గురువారం ఉదయం ఒడిశా తీరానికి, 18వ తేదీ ఉదయం పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వివరించింది. మరోవైపు ఉత్తర శ్రీలంక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా అక్కడి నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం, భారీ గాలులు వీచే అవకాశముంది. గాలుల ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
తుఫాను ఏర్పడటంతో ఆంధ్ర, ఒడిశా తీరాల్లో అల్లకల్లోల వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆంధ్ర తీరం వైపు కదులుతున్నందున గురువారం నుంచి తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. శుక్రవారం కూడా ఇదే తరహాలో గాలులు వీస్తాయని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మత్స్యకారులకు హెచ్చరికలు..
ఈ నెల 17 ఈ తర్వాతి తేదీల్లో ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం, ఉత్తరాంధ్రలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.